ప్రభుత్వ భూముల్లో.. పెద్దల పాగా ! | rich persons occupies the government lands | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ భూముల్లో.. పెద్దల పాగా !

Published Fri, Sep 15 2017 10:07 PM | Last Updated on Tue, Sep 19 2017 4:36 PM

ప్రభుత్వ భూముల్లో.. పెద్దల పాగా !

ప్రభుత్వ భూముల్లో.. పెద్దల పాగా !

- ఖాళీ స్థలాలను ఆక్రమించేస్తున్న అక్రమార్కులు
- రిజిస్ట్రేషన్‌ అధికారులూ కుమ్మక్కు !
- అమ్మకాలు చేస్తున్నా పట్టించుకోని అధికారులు


ఇక్కడ కనిపిస్తున్న వెంచర్‌ కురుగుంట పొలం సర్వేనంబర్‌ 94లోని 42 ఎకరాల 9 సెంట్ల స్థలంలో వెలిసింది. ఈ స్థలాన్ని ముగ్గురు ముస్లీం మెనార్టీ నేతలు ఆక్రమించుకొని వెంచర్‌ వేసి ఒక్కొక్క సెంట్‌ను రూ.20 వేల చొప్పున 90 శాతం మేర  ఇప్పటికే అమ్మకాలు జరిపేశారు. తప్పుడు ఎన్‌ఓసీ (నాన్‌ అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌) సృష్టించి రిజిస్ట్రేషన్‌ అధికారులతో కలిసి ఈ వంక స్థలాన్ని కొనుగోలు చేసిన వ్యక్తులకు రిజిస్ట్రేషన్‌ సైతం చేయించి రూ. కోట్లు కొల్లగొట్టారు. అయితే వాస్తవానికి రెవెన్యూ రికార్డులలోని డైక్లాట్‌ ప్రకారం ఈ స్థలం తడకలేరు వంక స్థలంగా ఉంది. రెవెన్యూ చట్టం మేరకు వంక పోరంబోకు స్థలానికి  రెవెన్యూ అధికారులు పట్టాలను మంజూరు చేయరు.  అయితే ఈ సర్వే నంబర్‌ను 94–1, 2, 3 విభజించించారు.  అడంగల్‌ను పరిశీలిస్తే  94–1 కె.సాలమ్మకు 2.97 ఎకరాలు, 94–2లో 24.68 ఎకరాల స్థలం వంక, 94–3 ప్రమీళమ్మకు 5 ఎకరాలు, వసుంధరమ్మ పేరిట 4.32 ఎకరాల స్థలం ఉన్నట్లు ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. అయితే ఆన్‌లైన్‌లోకి ప్రైవేట్‌ వ్యక్తుల పేర్లు  ఎలా వచ్చాయో ఆ లోగుట్టు మాత్రం రెవెన్యూ అధికారులకే తెలియాలి.

అనంతపురం రూరల్‌: ప్రభుత్వ జాగా కనిపిస్తేచాలు కులసంఘాల పేరిట పాగ వేస్తున్నారు. నగర శివారులోని ప్రభుత్వ భూములు మొత్తం పేదల మాటున పెద్దలు హస్తగతం చేసుకున్నారు. అత్యంత విలువైన స్థలాలను కళ్లేదుటే ఆక్రమించుకొని దర్జాగా అమ్మేసుకుంటున్నారు. ఒక్క కురుగుంట గ్రామంలోనే వందల ఎకరాల ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నారు. అంతటితో ఆగకుండా వంక పోరంబోకు స్థలాలను సైతం ఆక్రమించుకొని అమ్మేసుకుంటున్నారు.

ఒక్కోరికి ఒక్కో న్యాయం
చెరువు, వంక పోరంబోకు స్థలాలకు పట్టాలను ఎట్టి పరిస్థితుల్లోనూ మంజూరు చేయరు. అందులో నిర్మించుకున్న ఇళ్లను తొలగిస్తామని అధికారులు చెబుతూనే నెల క్రితం  బుక్కరాయసముద్రం చెరువులో విజయనగరకాలనీ వాసులు నిర్మించుకున్న 200 ఇళ్లను అకాలంగా కూల్చివేశారు. అయితే కురుగుంటలోని వంకపొరంబోకు స్థలంలో నిర్మించుకున్న ఆక్రమణలు అధికారులకు కనిపించడం లేదా? అని పలువురు విమర్శిస్తున్నారు.

ఉన్నతాధికారులు స్పందించాలి
అత్యంత విలువైన ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని అమ్మేసుకుంటున్న వారిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.  పేదల మాటున పెద్దలు తన్నుకుపోతున్న ప్రభుత్వ భూములను కాపాడాల్సిన అవసరం ఎంతైన ఉందని అంటున్నారు.

కేసులు నమోదు చేస్తాం
- అన్వర్‌హుస్సేన్, తహసీల్దార్‌, అనంతపురం
 ప్రభుత్వ, వంక పోరంబోకు స్థలాలను ఆక్రమించుకున్న వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తాం. కురుగుంట గ్రామంలో ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతమైన మాట వాస్తవమే. విచారణ జరిపి ప్రభుత్వ భూములకు హద్దులను ఏర్పాటు చేస్తాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement