భలే రేటుగాడు | ring-leader of the task force constable Ramesh | Sakshi
Sakshi News home page

భలే రేటుగాడు

Published Thu, Jun 16 2016 12:30 AM | Last Updated on Tue, Mar 19 2019 6:01 PM

భలే  రేటుగాడు - Sakshi

భలే రేటుగాడు

టాస్క్‌ఫోర్స్‌లో రింగ్ లీడర్ కానిస్టేబుల్ రమేష్
కేసు కేసుకో రేటు చొప్పున భారీగా వసూళ్లు
కాల్‌మనీ కేసుల్లో లక్షలు     కొల్లగొట్టిన వైనం
సస్పెన్షన్‌తో వెలుగుచూస్తున్న అవినీతి బాగోతం

 

అతడు డీల్ చేసే ప్రతి కేసుకూ ఓ రేటు ఉంటుంది. ఫిర్యాదు వస్తే న్యాయం చేయడానికి ఒక రేటు.. ఫిర్యాదు చేసినవారిపైనే కౌంటర్ కేసు పెట్టడానికి మరో రేటు.. పేకాట శిబిరాలకు ఇంకో రేటు నిర్ణయిస్తాడు.  ఇదంతా విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఓ ఉద్యోగి సాగించిన అవినీతి దందా. అతడే.. టాస్క్‌ఫోర్స్‌లో పనిచేసి సస్పెండైన కానిస్టేబుల్ పొట్లూరి రమేష్.

 

విజయవాడ :  టాస్క్‌ఫోర్స్‌లో పెద్ద రింగ్ లీడర్‌గా మారి భారీ అవినీతికి పాల్పడిన కానిస్టేబుల్ రమేష్  ఏసీపీ, సీఐలను సైతం శాసించే స్థాయికి చేరాడు. టాస్క్‌ఫోర్స్‌కు వచ్చిన ప్రతి కేసును ఆదాయవనరుగా మలుచుకున్నాడు. రెండు రోజుల కిందట ఒక కేసులో నిందితుడిని తప్పించేందుకు రూ 1.5 లక్షలు తీసుకున్నాడన్న ఆరోపణలు రుజువుకావడంతో రమేష్‌ను సీపీ గౌతం సవాంగ్ సస్పెండ్ చేశారు. రమేష్ అవినీతికి సంబంధించి ఫిర్యాదులు ఉంటే అందజేయాలని ప్రకటించిన నేపథ్యంలో రమేష్ బాధితులు పలువురు కమిషనరేట్‌కు క్యూకట్టారు. కాల్‌మనీ కేసులో ఏడో నిందితుడిగా ఉన్న దూడల రాజేష్ తనను బెదిరించి రమేష్ రూ. 5 లక్షలు తీసుకున్నాడని ఫిర్యాదు చేశాడు. కాల్‌మనీ కేసుల్లో టాస్క్‌ఫోర్స్ విచారణకు హాజరైన మరో ఇద్దరు ఫిర్యాదు చేయనున్నారు. దీర్ఘకాలం టాస్క్‌ఫోర్స్‌లో పనిచేయడం రమేష్‌కి బాగా కలిసొచ్చింది. ఇలా భారీ దందాలు సాగించడం వెనుక ఉన్నతాధికారుల పాత్ర ఉందనే అనుమానాలూ ఉన్నాయి. ప్రతిచోట ఉన్నతాధికారి పేరుతోనే వసూళ్లకు పాల్పడతాడు. గత నెలలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కానిస్టేబుళ్లను బదిలీ చేసినప్పుడు రమేష్‌ను తోట్లవల్లూరు పీఎస్‌కు పంపారు.

 
కాల్‌మనీ కేసుల్లో ముందస్తు వ్యూహం

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాల్‌మనీ కేసుల్లో రమేష్ వ్యూహాత్మకంగా వ్యవహరించాడు. ఈ వ్యవహారం వెలుగులోకి  రాగానే పటమట పంటకాలువ రోడ్డులో ఉన్న యలమంచలి రాము కార్యాలయంపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. సంఘటన స్థలంలో మొత్తం 14 మంది ఉండగా వారిలో కొందరిని ముందుగానే తప్పించి వారి నుంచి సుమారు రూ. 24 లక్షలు రమేష్ వసూలుచేశాడనే ఆరోపణలున్నాయి. కేసులు ఆరు మాత్రమే నమోదు చేశారు. ఇదంతా టాస్క్‌ఫోర్స్ ఉన్నతాధికారి పర్యవేక్షణలో జరిగింది. కాల్‌మనీ వ్యవహారంలో భారీగా లభ్యమైన ప్రామిసరీ నోట్లకు సంబంధించిన వారితో పోలీసు స్టైల్‌లో మాట్లాడి కొన్ని కేసుల్ని సెటిల్ చేసి డబ్బులు దండుకున్నారనే ఆరోపణ ఉంది. ఇక పెండ్యాల శ్రీకాంత్‌తో రమేష్‌కు పాత పరిచయంతోపాటు దూరపు బంధుత్వం కూడా ఉండడంతో అతడిని కేసు నుంచి తప్పించడానికి యత్నించాడు. కుదరకపోవడంతో అతను  ముందస్తు బెయిల్‌కు ప్రయత్నించుకోవడానికి వీలుగా  మూడు రోజులపాటు అతను అరెస్ట్ కాకుండా బయట తిరిగేలా చూసినందుకుగాను రూ. 2 లక్షలు తీసుకున్నాడు. రాము  కార్యాలయంలో ఉన్న ప్రామిసరీ నోట్లు, చెక్‌లను స్వాధీనం చేసుకొని సీజ్ చేసిన వాటిలో చూపకుండా  సెటిల్ చేసినందుకు రూ. 3 లక్షలు తీసుకున్నాడనే ఫిర్యాదు ఉంది. గత నెలలో యలమంచలి రాముకు సంబంధించిన భారీ మొత్తంతో ఉన్న కాల్‌మనీ కేసు సెటిల్ చేసినందుకు టాస్క్‌ఫోర్స్ అధికారి ఒకరికి రూ 10.60 లక్షల విలువ చేసే హారం నజరానాగా ఇప్పించినట్లు సమాచారం.

 
దూడల రాజేష్ ఫిర్యాదుతో.
.
కాల్‌మనీ కేసులో ఏడో నిందితుడిగా ఉన్న దూడల రాజేష్ కానిస్టేబుల్ రమేష్‌కు రూ. 5 లక్షలు ఇచ్చానని ఫిర్యాదు చేయటంతో వ్యవహారం వెలుగులోకి వచ్చింది. బెయిల్‌పై వచ్చిన తర్వాత విచారణకు రావాలని పదేపదే ఫోన్లు చేసి వేధించి తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేశాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. తనపై మరో ఆరు కేసులు వచ్చాయని, వాటిని కట్టకుండా ఉండాలంటే రూ. 5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో తన స్నేహితుడు వరప్రసాద్ వద్ద రూ. 5 లక్షలు అప్పు తీసుకొని మార్చి 28వ తేది రాత్రి బందరురోడ్డులోని శేషసాయి కల్యాణ మండపం వెనుక రోడ్డులో అందజేశామని ఫిర్యాదు చేశాడు. దీనిపై పోలీసులు విచారణ నిర్వహిస్తున్నారు.

 

మరికొన్ని కేసుల్లోనూ...
తాడిగడపకు చెందిన శ్రీను గత ఏడాది భారీగా పేకాట శిబిరాలు నిర్వహించాడు. పగటిపూట నిడమానూరులో, రాత్రివేళ తాడిగడపలో నాలుగు నివాసాల్లో పేకాట నిర్వహించాడు. దీనికిగాను టాస్క్‌ఫోర్స్ మామూళ్ల పేరిట వారానికి రెండు లక్షల చొప్పున ఏడాదిపాటు తీసుకున్నాడు. ఇతడికి తోట్లవల్లూరులో పనిచేసే మరో కానిస్టేబుల్ వ్యక్తిగత సహాయకుడిగా ఉండి వసూళ్ల వ్యవహారం చూసుకుంటాడు.

 
చర్చి ఫాదర్ కేసు విషయంలో ఫాదర్‌ను బెదిరించి డబ్బులు వసూలుచేసిన వ్యక్తి నుంచి మొత్తం రికవరీ చేయాలని పోలీసులు నిర్ణయించారు. టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఈ కేసును పర్యవేక్షించిన క్రమంలో ఫాదర్‌ను బెదిరించిన వ్యక్తి ఆస్తిని రూ. 55 లక్షలకు అమ్మి అతడి నుంచి రూ. 32 లక్షలు మాత్రమే రికవరీ చేసినట్లు చూపారు. ఇందులోనూ రమేష్‌దే కీలక పాత్ర.  కల్తీ నెయ్యి కేసులో నిందితుడు ఫణీంద్ర, కాళేశ్వరి ట్రావెల్స్ వ్యవహారంలోనూ కానిస్టేబుల్ రమేష్ కీలకంగా ఉన్నాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement