- ఇన్నర్, అవుటర్ రింగ్ రోడ్లకు రూ. 791 కోట్లతో ప్రతిపాదనలు
- సీఎం హామీ ఇచ్చినా ఏడాదిన్నరగా నాన్చుడు
- రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసమేనన్న ఆరోపణలు
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : నగరంలో పెరిగిపోతున్న వాహన రాకపోకలు, ఆ కారణంగా ఎదురవుతున్న ఇబ్బందుల పరిష్కారంలో భాగంగా నగరాన్ని చుడుతూ ప్రతిపాదించిన ఇన్నర్, అవుటర్ రింగ్ రోడ్ల నిర్మాణాలు అటకెక్కాయి. ఏడాదిన్న క్రితం ప్రతిపాదనలు పంపాలంటూ సీఎం చంద్రబాబు స్వయంగా ఆదేశాలు ఇవ్వడంతో అధికారులు ఆఘమేఘాలపై రూ.791 కోట్లతో ప్రభుత్వానికి నివేదికలు పంపించారు. అయితే ఇందుకు సంబంధించి అటు సర్కారులో ఉలుకూ పలుకూ లేకపోవడం, జిల్లా ప్రజాప్రతినిధులుగాని, ఉన్నతాధికారులుగాని దానిపై ధ్యాస పెట్టకపోవడం గమనార్హం. మరోవైపు రింగ్ రోడ్డు నిర్మాణం పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రచారం నిర్వహిస్తూ కోట్లాది రూపాయలు దండుకుంటున్నారు.
45 కిలోమీటర్ల మేర అవుటర్ రింగ్ రోడ్డు...
కర్నూలు నగరాన్ని చుట్టూ కప్పుతూ అవుటర్ రింగ్ రోడ్డును ప్రతిపాదించారు. మొత్తం 45 కిలోమీటర్ల మేర నాలుగు లేన్లలో కొనసాగే అవుటర్ రింగు రోడ్డు దాదాపు 20 గ్రామాలను కలుపుతూ వెళ్తుంది. ఈ రహదారి నిర్మాణం కోసం రూ.405 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. పంచలింగాల, దొడ్డిపాడు, గొందిర్లపల్లె, వసంతనగర్, ఈ తాండ్రపాడు, పూడూరు, పడిదెంపాడు, వెంకాయపల్లి, నూనతపల్లి, మిలిటరీ కాలనీ, రాంభూపాల్ నగర్, పసుపల, దిన్నెదేవరపాడు, అంబేద్కర్ నగర్, పందిపాడు, నాగులపురం, పెద్దపాడు, ఉల్చాల, మునగాలపాడు తదితర గ్రామాలను అవుటర్ రింగ్ రోడ్డు చుడుతూ జాతీయ రహదారి(ఎన్‌హెచ్)-44ను కలుస్తుంది.
రూ.386 కోట్లతో ఇన్నర్ రింగు రోడ్డు..
నగరంలోని వివిధ కాలనీలను కలుపుతూ ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణం కొనసాగుతుంది. దీనిని రూ.386 కోట్లతో 30 కిలోమీటర్ల మేర నిర్మిస్తారు. పంచాలింగాల సమీపంలోని జాతీయ రహదారి -44 నుంచి విడిపోయి పెద్దపాడు, కృష్ణానగర్, సీక్యాంపు, మాధవీనగర్, వెంకాయపల్లి, పూడూరు రహదారిలో కలుస్తుంది.
ప్రతిపాదనల దశలోనే..
2011 జనాభా లెక్కల ప్రకారం నగరంలో దాదాపు నాలుగు లక్షల మంది నివాసం ఉంటున్నారు. ప్రస్తుతం ఆ సంఖ్య ఆరు లక్షలకు చేరింది. అంతేకాక ఏటేటా వాహనాల సంఖ్య కూడా పెరిగిపోతోంది. ఒకరోజులో నగరంలోని రోడ్లపై 60 వేల వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. నగరం వెలుపలి నుంచి దాదాపు 20 వేల వాహనాలు లోపలికి వస్తున్నాయి. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. రోడ్లను విస్తరిస్తూ పోతున్నా సమస్యకు పరిష్కారం లభించడంలేదు. దీంతో కర్నూలును చుడుతూ అవుటర్, ఇన్నర్ రింగు రోడ్లకు అధికారులు ప్రతిపాదించారు. విషయాన్ని 2015 ఆగస్టు 17న కర్నూలు పర్యటన సందర్భంగా సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. అనుకున్నదే తడువుగా ఆయన అక్కడే కర్నూలుకు రింగ్ రోడ్డును ప్రకటించారు. వెంటనే ప్రతిపాదనలు పంపాలని అధికారులను ఆదేశించారు. దీంతో ఎంతో హడావుడిగా అధికారులు రూ.791 కోట్లతో ప్రతిపాదనలు పంపారు.
రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఒత్తిడి మేరకే...
కర్నూలుకు రింగ్ రోడ్డు ప్రతిపాదన కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారుల మేలు కోసమే ప్రకటించారనే ఆరోపణలున్నాయి. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో అనేక మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులున్నారు. వీరు తమ వ్యాపార వృద్ధి కోసం రింగ్ రోడ్డును ప్రతిపాదించారనే ఆరోపణలున్నాయి. ఏడాదిన్నర గడిచినా ఇందుకు సంబంధించి ఎలాంటి పురోగతి లేకపోవడం ఇందుకు నిదర్శనంగా చెబుతున్నారు. అయితే రియల్ ఎస్టేట్ వ్యాపారులు మాత్రం రింగ్ రోడ్డు ప్రతిపాదనలతో కోట్లాది రూపాయలు సంపాదించుకున్నది నిజం.
ప్రతిపాదనలు పంపించాం: ఫణిరాముడు, ఏఈ, కర్నూలు డివిజన్
కర్నూలు నగరాన్ని చుడుతూ అవుటర్, ఇన్నర్ రింగు రోడ్లకు ప్రతిపాదనలు పంపాం. 45 కిలో మీటర్ల అవుటర్‌కు రూ.405 కోట్లు, 30 కిలోమీటర్ల ఇన్నర్‌కు రూ.386 కోట్లతో ప్రతిపాదనలు వెళ్లాయి. ప్రభుత్వంలో మాత్రం ఎలాంటి కదలికలు లేవు. ప్రభుత్వం ఎప్పుడు ఆదేశించినా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాం.