హన్మకొండ: వరంగల్ జిల్లాలో రెండు రోజులుగా వర్షం కురుస్తోంది. మంగళవారం నుంచి బుధవారం ఉదయం వరకు 47 మండలాల్లో భారీగా వర్షం కురిసింది. అత్యధికంగా ఏటూరునాగారంలో 59.6 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలకు ఏజెన్సీలోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు గ్రామాలను వరద నీరు ముంచెత్తింది. ఏటూరునాగారం మండలంలో జీడివాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చిన్నబోయినపల్లి వద్ద వట్టివాగు ఉప్పొంగడంతో వరంగల్- ఏటూరునాగారం మధ్య రవాణా స్తంభించింది.
ఏటూరునాగారం మండలంలోని గోగుపల్లి జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది. ప్రాథమిక పాఠశాలకు వెళ్లిన ఉపాధ్యాయులు చెరుకుల ధర్మయ్య, నాగేశ్వర్‌రావు పాఠశాల గదిలోనే ఉన్నారు. నాగేశ్వర్‌రావు ద్విచక్రవాహనం వరదకు కొట్టుకుపోయింది. రాత్రి 7 గంటలకు వరద తగ్గిన తర్వాత వారు బయటకు వచ్చారు. ఏజెన్సీ ప్రాంతాల్లో వాగులు ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో పలు ఆర్టీసీ బస్సులు చిక్కుకున్నాయి. మేడారంలోని జంపన్నవాగు బుధవారం ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షంతో రెండు బ్రిడ్జిలకు ఆనుకుని వరదనీరు పరవళ్లు తొక్కింది.
మోరంచవాగులో చిక్కిన ఇద్దరు యువకులు
గణపురం మండల కేంద్రం-ధర్మారావుపేట గ్రామాల మధ్య మోరంచవాగులో ఇద్దరు యువకులు చిక్కిపోయారు. మండల కేంద్రానికి చెందిన ఏరువ రత్నాకర్, వెంకటాపురం మండలం రామానుజాపురం శివారు నారాయణగిరిపల్లెకు చెందిన నరిగె అశోక్‌లు ధర్మారావుపేటకు వెళ్లేందుకు బయలుదేరారు. మోరంచవాగు ఉధృతంగా ప్రవహిస్తుండంతో దాటలేకపోయారు. అరగంట సేపు అక్కడ ఆగారు. తిరిగి గణపురం పోవడానికి వెనక్కిరాగా.. అక్కడ కూడా పిల్లవాగు (కాజ్‌వే) ఉధృతంగాప్రవహించడంతో మధ్యలో బందీలుగా మారారు. గ్రామస్తులు వారిని బయటకు తీసుకు వచ్చే ప్రయత్నంలో ఉన్నారు. రాత్రి వరకు కూడా వారు బయటపడే అవకాశం కనిపించడం లేదు.
వరంగల్ ఏజెన్సీలో ఉప్పొంగిన వాగులు
Published Wed, Jun 29 2016 9:01 PM | Last Updated on Wed, Apr 3 2019 9:27 PM
Advertisement