సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అకాల వర్షాలు బీభత్సం సృష్టించాయి. ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వాన కురవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. హైదరాబాద్ నగరంతో పాటు వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా భారీ గాలులతో వర్షం పడుతోంది. వర్షబీభత్సానికి పలుచోట్ల వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. రాష్ట్రంలోని పలు పట్టణాలు, గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయింది. భీకర గాలులకు చేతికందిన మామిడి పంట నేలరాలింది.
హైదరాబాద్: నగరంలో ఒక్కసారిగా వాతారణం మారిపోయింది. కొన్ని ప్రాంతాల్లో చీకట్లు కమ్ముకున్నాయి. ఖైరతాబాద్, బషీర్‌బాగ్, నారాయణ గూడ, అబిడ్స్, కోఠి, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, నాంపల్లి, సికింద్రాబాద్, దిల్‌సుఖ్‌నగర్, చైతన్యపురి, కొత్తపేట, సరూర్‌నగర్, ట్యాంక్‌బండ్, కర్మన్‌ఘాట్, నాచారం, తార్నాక, ఓయూ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులతో పలు కాలనీల్లో విద్యుత్ సరఫరా నిలిచి పోయింది. కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడుతుంది. భారీ వర్షం నేపథ్యంలో జీహెచ్ ఎంసీ అధికారులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.
నగరంలో ప్రాంతాల వారిగా వర్షపాతం
రాజేంద్రనగర్ 3.31 సెం.మీ
ముషీరాబాద్ 2.9 సెం.మీ
బాలానగర్ 2.3 సెం.మీ
మారేడుపల్లి 2.2 సెం.మీ
వరంగల్ అర్బన్ : వరంగల్, కరీంనగర్ జిల్లాలతో పాటు రాష్ట్రంలో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వాన కురవడంతో కొద్దిసేపు జనజీవనం స్తంభించిపోయింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వరంగల్ నగరంలో రోడ్లపై భారీగా వర్షపు నీరు చేరడంతో రవాణ, విద్యుత్ వ్యవస్థలు నిలిచిపోయాయి. రోడ్లపైన విరిగిపడ్డ చెట్లను తొలగించి, విద్యుత్ స్తంబాలు, తీగలను పునరుద్ధరించాలని జిల్లా కలెక్టర్ ఆమ్రపాలి, నగర కమీషనర్ గౌతమ్ అధికారులను ఆదేశించారు. నగరంలో చెట్లు, విద్యుత్ తీగలు, స్థంబాల పడిపోతే కార్పొరేషన్ అధికారులకు తెలియజేయాలని వారు ప్రజలను కోరారు. టోల్ ఫ్రీ నెంబర్ 18004251980 నెంబర్ కి కాల్ చేసి తెలియజేయవచ్చని కలెక్టర్ ఆమ్రపాలి తెలిపారు. వరంగల్ అర్బన్ 5 సెం.మీ, వరంగల్ రూరల్ 4 సెం.మీ, భూపాలపల్లి 4 సెం.మీ, దామెర, ములుగు 3.6 సెం.మీ వర్షపాతం నమోదయింది.
ఇద్దరు మృతి
వరంగల్‌లో కురిసిన భారీ వర్షానికి ఇద్దరు మృతి చెందారు. భీమ దేవరపల్లిలోని మల్లారంలో పిడుగుపాటుకు గురై తోడేటి కట్టయ్య అనే రైతు మృతి చెందాడు. మరోచోట గోడకూలి అయోధ్య అనే వ్యక్తి ప్రాణాలు వదిలాడు.
మహబూబాబాద్, ఖమ్మం, పెద్దపల్లి, సిద్దిపేట, హుస్నాబాద్, గజ్వేల్, ములుగు, వర్గల్ మండలాల్లో కూడా భారీ వర్షం కురిసింది. కొన్ని చోట్ల ఈదురు గాలులతో కూడిన వర్షం ధాటికి విద్యుత్ స్తంబాలు నేలకొరిగాయి. విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. మంచిర్యాల జిల్లాలోని మందమర్రి, చెన్నూరులో ఈదురుగాలులతో వర్షం పడింది. యాదాద్రి జిల్లాలోని బీబీనగర్‌లోనూ వర్షం బీభత్సం సృష్టించింది. ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది.
అప్రమత్తంగా ఉండాలి
భారీ వర్షాల కారణంగా అన్ని జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించింది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ కూడా అప్రమత్తమైంది. రాజధాని నగరంలో ప్రజలకు ఎలాంటి ఆటంకం లేకుండా ఉండేందుకు కార్యాచరణను సిద్ధం చేస్తోంది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment