చినుకు చిందు
- పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు
- నగరంలో కుండపోత.. 5 సెం.మీ. వర్షపాతం
- బస్తీల్లోకి నీళ్లు.. చెరువులను తలపించిన దారులు
- ట్రాఫిక్ తిప్పలతో జనం అవస్థలు
- మరో 24 గంటలు భారీ వర్ష సూచన
- ఖమ్మం, యాదాద్రి జిల్లాల్లో జడివాన
- భూపాలపల్లి జిల్లాలో పొంగుతున్న వాగులు..
- మూసీలో ఒకరి గల్లంతు.. కొట్టుకుపోయిన రెండు బైక్‌లు
సాక్షి, హైదరాబాద్: రుతుపవనాలకు ఉపరితల ఆవర్తనం తోడవడంతో బుధవారం పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. రాజధాని నగరం హైదరాబాద్ తడిసిముద్దయింది. బుధవారం తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు సిటీలో జడివాన కురి సింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సుమారు వందకుపైగా బస్తీలు, కాలనీల్లోని ఇళ్లలోకి నీరు చేరింది. నీటిని తొలగించేందుకు జీహెచ్‌ఎంసీ బృందాలు రంగం లోకి దిగాయి.
ఉదయం, సాయంత్రం వేళల్లో సుమారు వంద కూడళ్లలో ట్రాఫిక్ ఎక్కడికక్కడే స్తంభించింది. అమీర్‌పేట్, సికింద్రాబాద్, మెహిదీపట్నం, మలక్‌పేట్, కోఠి, అబిడ్స్, పంజాగుట్ట, బంజారాహిల్స్ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కుకొని వాహనదారులు, ప్రయాణికులు నరకయాతన అనుభవించారు. సాయంత్రం వరకు నగరంలో 5 సెం.మీ. వర్షం నమోదైంది. రానున్న 24 గంటల్లో నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇక గత 24 గంటల్లో ఖమ్మంలో అత్యధికంగా 9 సెం.మీ. వర్షపాతం నమోదైంది. మెదక్‌లో 7, నాగార్జునసాగర్‌లలో 4 సెం.మీ. చొప్పున వర్షం కురిసింది. రుతుపవనాలు చురుగ్గా మారడంతో వచ్చే నాలుగురోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ శాస్త్రవేత్తలు తెలిపారు.
గ్రేటర్ నగరాన్ని వర్షం ముంచెత్తినా.. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురియకపోవడంతో జంట జలాశయాలు హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌లలోకి ఇన్‌ఫ్లో లేదని జలమండలి వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం జలాశయాల్లో నీటి నిల్వలు సంతృప్తికరంగానే ఉన్నట్లు పేర్కొన్నాయి. గ్రేటర్ పరిధిలో జూన్ నుంచి ఈ నెల 9 వరకు సాధారణం కంటే 3 శాతం అధికంగా నమోదు కాగా.. పొరుగునే ఉన్న రంగారెడ్డి జిల్లాలో మాత్రం 12 శాతం తక్కువ నమోదు కావడం గమనార్హం.
కొన్నిచోట్ల ముసురు.. ఇంకొన్ని చోట్ల భారీగా..
రుతుపవనాల ప్రభావంతో కొన్ని జిల్లాల్లో భారీగా వర్షాలు కురవగా మరికొన్ని జిల్లాల్లో ముసురు కమ్మింది. ఖమ్మం జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో భారీ వర్షం కురిసింది. ఖమ్మంతోపాటు పాలేరు, మధిర, వైరా నియోజకవర్గాల్లో వర్షం పడింది. తిరుమలాయపాలెం, ఖమ్మం రూరల్, నేలకొండలపల్లి, కొణిజర్ల మండలాల్లో భారీ వర్షం కురిసింది. ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లోకి నీరు రావడంతో కందులు, పెసర రాశులు తడిచిపోయాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో బుధవారం తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. వలిగొండ, బీబీనగర్, భువనగిరి, భూదాన్ పోచంపల్లి మండలాల్లో వందలాది ఎకరాల్లో వరి పొలాలు నీట మునిగాయి.
భూదాన్ పోచంపల్లి పిలాయిపల్లి వద్ద మూసీలో కొట్టుకుపోతున్న బైక్
మూసీకి వరద పోటెత్తింది. వరద ఉధృతికి రెండు బైక్‌లు కొట్టుకుపోయాయి. భూదాన్ పోచంపల్లి మండలం పిలాయిపల్లి వద్ద మూసీలో ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. అతడి కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్, పలిమెల మండలాల్లోని వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఏటూరు నాగారం, తాడ్వాయి, కన్నాయిగూడెం, మహముత్తారం మండలాల్లో కురిసిన వర్షాలకు పెద్దంపేటవాగు, లెంకలగడ్డవాగు, పంకెనవాగు, తీగెలవాగు, రాళ్లవాగు, సర్వాయిపేటవాగులు ఉప్పొంగడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లోని పలు మండలాల్లో మోస్తరు వర్షం పడింది. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి, మొయినాబాద్, చేవెళ్ల, యాచారం, కందుకూరు, శంషాబాద్, రాజేంద్రనగర్ మండలాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు చిరు జల్లులు కురిశాయి. వికారాబాద్ జిల్లా కేంద్రంలో 2.1 సెం.మీ. వర్షపాతం నమోదైంది.
గనిలో నిలిచిన ఉత్పత్తి
వర్షాలకు భూపాలపల్లి ఏరియాలోని కేటీకే ఉపరితల గనిలో బుధవారం బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. సుమారు 5 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలిగింది.