సిటీలో కుండపోత
తెలంగాణలో బలపడుతున్న అల్పపీడనం
రెండు మూడు రోజులు జోరుగా వర్షాలు
సాక్షి, హైదరాబాద్: అల్పపీడన ప్రభావంతో గురువారం సాయంత్రం నుంచి రాత్రి వరకు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురిసింది. రాత్రి 8.30 గంటల వరకు 1.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు బేగంపేటలోని వాతావరణ కేంద్రం తెలిపింది. భారీ వర్షం కారణంగా అడ్డగుట్ట ఏ జంక్షన్ ప్రాంతంలో ఓ పాతగోడ కూలి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు గాయాల పాలయ్యారు. ఈ దుర్ఘటనలో గాయపడిన ఓ మహిళ పరిస్థితి విషమంగా ఉంది. ముషీరాబాద్, మెహిదీపట్నం, సికింద్రాబాద్, కంటోన్మెంట్ తదితర ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల్లో ఉన్న బస్తీలు, కాలనీల్లో ఇళ్లలోకి వర్షపునీరు చేరి గురువారం తెల్లవార్లూ బస్తీజనం నిద్ర లేకుండా గడిపారు. ఇక ప్రధాన ప్రాంతాల్లోని రహదారులపై వర్షపునీరు నిలిచి ట్రాఫిక్ ఎక్కడికక్కడే స్తంభించింది.
తెలంగాణవ్యాప్తంగా వర్షాలు
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మరో రెండు మూడు రోజులు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముంది. ఇప్పటికే పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తుండగా... అల్పపీడనం మరింత బలపడుతుండడంతో మరో రెండు మూడు రోజుల పాటు వర్షాలు కొనసాగనున్నాయి. మరోవైపు తెలంగాణవ్యాప్తంగా గత 24 గంటల్లో విస్తారంగా వర్షాలు పడ్డాయి. పలు చోట్ల కుంభవృష్టి కురిసింది. దీంతో ప్రస్తుత సీజన్‌లోనే ఈ వారం అధిక వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. బంగాళాఖాతంలో అల్పపీడనం మరింత బలపడే అవకాశముందని, దీంతో మరో రెండు మూడు రోజులు తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ ఇన్‌చార్జి డెరైక్టర్ సీతారాం తెలిపారు. శనివారం నుంచి ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పడతాయని ఆయన చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటికే పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయని వెల్లడించారు. గత 24 గంటల్లో వరంగల్ జిల్లా వెంకటాపూర్‌లో అత్యధికంగా 11.3 సెంటీమీటర్ల వర్షం కురిసిందన్నారు. కరీంనగర్ జిల్లా బెజ్జంకిలో 9.3, దుబ్బాకలో 8.6, గుండాలలో 8.5, ఆసిఫాబాద్‌లో 8.2, కల్వకుర్తిలో 6.3, రాజాపేటలో 6.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని సీతారాం తెలిపారు. తెలంగాణలో దాదాపు అన్ని ప్రాంతాల్లో వర్షం కురిసిందని... ప్రస్తుత వర్షాకాల సీజన్‌లో ఈ వారంలోనే అధిక వర్షపాతం నమోదైందని చెప్పారు. కాగా.. రాష్ట్రవ్యాప్తంగా అనేక చోట్ల వాగులు పొంగి ప్రవహిస్తున్నాయని అధికారులు చెబుతున్నారు.
సాగుపై సానుకూల ప్రభావం..
వర్షాభావం నేపథ్యంలో వారం ముందు వరకూ రాష్ట్రవ్యాప్తంగా పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది. దాదాపు 5 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయే దశలో ఉన్నాయని, ముఖ్యంగా మొక్కజొన్న దాదాపు వాడిపోయే దశలో ఉందని వ్యవసాయ శాఖ ప్రకటించింది కూడా. అయితే మూడు నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలు పంటలకు ప్రాణం పోశాయని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. మరికొద్ది రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతున్న నేపథ్యంలో.. ఈ పంటలకు ఎటువంటి ఇబ్బందీ ఉండబోదని పేర్కొంటున్నారు. మరోవైపు మధ్య మధ్యలో ఇలా వర్షాలు కురిస్తే పంటలకు మేలే జరుగుతుందని, ఒకేసారి వర్షాలు పడితే నీరు నేలలోకి ఇంకిపోకుండా వృథాగా వెళుతుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇలా కొద్ది తేడాతో మధ్య మధ్యలో వర్షాలు పడితే పంట బాగా పండుతుందంటున్నారు. 2004లో ఇలాగే వర్షాలు కురిశాయని.. ధాన్యం ఉత్పత్తి బాగా జరిగిందని అంటున్నారు. మరో మూడు రోజులపాటు కురిసే వర్షాలతో వాగులు వంకలు నిండితే మరింత బాగుంటుందని చెబుతున్నారు.