దారి... అధ్వానంగా మారి
-
గుంతలమయంగా ప్రధాన రహదారి
-
ఇబ్బంది పడుతున్న ప్రజలు
-
పట్టించుకోని మున్సిపల్ అధికారులు
కాగజ్‌నగర్ రూరల్ : కాగజ్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలోని పలు ప్రధాన రోడ్లు అధ్వానంగా మారడంతో ఇటు ప్రజలు, అటు వాహనచోదకులు నానా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలతో మున్సిపాలిటీ పరిధిలో రోడ్లు, డ్రెయినేజీ, విద్యుత్ వంటి సౌకర్యాల కల్పన కోసం నిధులు వెచ్చిస్తున్నా అధికారుల నిర్లక్ష్యం, ముందు చూపు కొరవడటం వల్ల అవి సక్రమంగా ఉపయోగపడటం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. పట్టణంలో ప్రధానమైన మహాత్మా గాంధీ రోడ్డే అందుకు నిదర్శనం.
పట్టణం నుంచి ఈజ్‌గాం వైపు వెళ్లే రైల్వే ఓవర్ బ్రిడ్జి ప్రారంభంలో ఎంజీ రోడ్డు అస్తవ్యస్తంగా మారడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రారంభంలోనే పెద్ద పెద్ద గుంతలు ఏర్పడటం, వర్షం వస్తే నిండిపోయి ప్రమాదకంగా మారడంతో ప్రజలు ఇక్కట్ల పాలవుతున్నారు. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో నిత్యం ఈ ప్రాంతం మురుగు నీటితో దర్శనమిస్తోంది.
ముందు చూపు కొరవడడంతోనేనా..?
రోడ్డు వేసిన మూన్నాళ్లకే పగుళ్లు తేలడం, గుంతలమయంగా మారడం పరిపాటిగా మారింది. ఆర్‌వోబీ ప్రారంభంలో ప్రజలు పడుతున్న కష్టాల వైపు అధికారులు కన్నెత్తి కూడా చూడటం లేదని విమర్శలున్నాయి. పలు గ్రామాల ప్రజలు ఈ ప్రాంతం మీదుగానే రాకపోకలు కొనసాగిస్తున్నారు. అయితే వారు పడుతున్న ఇబ్బందులను అధికారుల ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ఫిర్యాదులున్నాయి.
ఇదిలా ఉండగా, ప్రధాన రహదారిని ఆనుకొని ఉన్న మురుగు నీటి కాల్వలు సక్రమంగా లేకపోవడంతో వర్షం కురిసినప్పుడల్లా నీరంతా రోడ్డుపైకి చేరి గుంతలమయం కావడంతో వచ్చి పోయే వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ఈ రహదారికి ఒకవైపు మాత్రమే ఉన్న మురుగు నీటి కాల్వను సక్రమంగా కొనసాగిస్తే రోడ్డు కోతకు గురి కాకుండా ఉంటుందని పలువురు చెబుతున్నారు. ఈ సమస్యను పలుసార్లు మున్సిపాలిటీ, ఆర్ అండ్ బీ శాఖాధికారులకు విన్నవించినప్పటికీ వారు పట్టించుకోలేదని వ్యాపారులు, ప్రజలు ఆరోపిస్తున్నారు.
ఇటీవల గుంతలమయమైన రోడ్డుకు ఒకవైపు సిమెంట్, కాంక్రీటు వేసి చేతులు దులుపుకోవడంతో మరో వైపు రోడ్డు గుంతలమయమై మురుగునీటితో కంపుకొడుతోంది. అధికారులు, ప్రజాప్రతినిధులు అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేస్తున్నారు తప్ప పక్కా మరమ్మతులు చేపట్టడం లేదందటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేపట్టి, ప్రజలకు సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు.