దొంగ అరెస్టు
పులివెందుల : పులివెందుల పట్టణంలో పలుచోట్ల దొంగతనాలకు పాల్పడిన కేసులో నిందితుడిని అరెస్టు చేసి అతని వద్ద నుంచి 10తులాల బంగార అభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు పులివెందుల ఏఎస్పీ అన్బురాజన్ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక ఎస్‌డీపీవో కార్యాలయంలో ఎస్‌ఐలు గోపినాథరెడ్డి, రవిలతో కలిసి ఆయన విలేకరులకు వివరాలు వెల్లడించారు. అనంతపురం జిల్లా కదిరి పట్టణానికి చెందిన ఎద్దుల రామకృష్ణ దొంగతనాలు చేసేవాడన్నారు. అతనిపై పులివెందులలో 8 దొంగతనాల కేసులు నమోదయ్యాయన్నారు. నిందితుడిని సోమవారం రాత్రి ఉల్లిమెల్ల రింగ్ రోడ్డు వద్ద అరెస్టు చేసి అతని నుంచి 10తులాల బంగారు అభరణాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. అలాగే పులివెందుల అర్బన్, రూరల్ ప్రాంతాలలో 7చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. వాహనాలను తనిఖీ చేసిన తర్వాతనే పట్టణంలోనికి అనుమతిస్తామన్నారు. ఆలయాల్లో దొంగతనాలు జరుగుతున్న దృష్ట్యా ఆలయాలకు చెందిన ట్రస్ట్ నిర్వాహకులు విలువైన నగదు, బంగారు వస్తువులను ఆలయాల్లో ఉంచకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నిందితుడిని పట్టుకోవడంలో కృషి చేసిన సీఐ ప్రసాద్, ఎస్‌ఐలు గోపినాథరెడ్డి, రవి, కానిస్టేబుల్ వేణుగోపాల్‌రెడ్డిలకు రివార్డు కోసం ఉన్నతాధికారులకు సిఫార్సు చేశామన్నారు.