ఖమ్మం : పెళ్లి మండపాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులను ఖమ్మం టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి దొంగిలించిన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. టూ టౌన్ పోలీస్‌స్టేషన్ గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ సురేష్‌కుమార్ వివరాలు వెల్లడించారు. చెన్నైకి చెందిన ఎక్స్ సర్వీస్‌మెన్ వేలుమళ్లై రంగనాథ్ అలియాస్ రాజు కొంతకాలం హైదరాబాద్‌లో ఉంటూ చిన్నచిన్న దొంగతనాలు చేసేవాడు. అనంతరం ఖమ్మం చేరుకున్న అతడు బల్లేపల్లిలో ఉన్న మచ్చా ఉమతో వివాహేతర సంబంధం ఏర్పర చుకున్నాడు.
ఉమకు పదేళ్ల కొడుకు కూడా ఉన్నాడు. ఈ క్రమంలో వీరు నగరంలోని కల్యాణ మండపాలకు వెళ్లి చోరీలు చేయడం ప్రారంభించారు. మండపానికి వెళ్లే ముందు పెళ్లి వారి బంధువుల్లా తయారై.. అక్కడ ఎవరికీ అనుమానం రాకుండా హడావుడి చేస్తూ.. ముఖ్యంగా పెళ్లి కూతురు ఉండే గది వద్ద కొద్దిసేపు రెక్కీ నిర్వహిస్తారు. వారి వద్ద నగలు ఉన్నాయని తెలుసుకుంటారు.. పెళ్లి హడావుడిలో వారుండగా.. ఉమ, ఆమె కొడుకు ఆ గదిలోకి వెళ్లి.. కుర్చీలు, అవి, ఇవి సర్దుతూ బంధువుల్లా నటిస్తారు. తర్వాత తెలివిగా గదిలో పెళ్లికి వచ్చిన వారి నగలను అపహరిస్తారు. తర్వాత ఏమీ తెలియనట్లు పెళ్లి భోజనం చేసి మరీ తాపీగా వెళ్లిపోతారు.
ఈ నేపథ్యంలో వీరు బుధవారం బైపాస్ రోడ్డులోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద నుంచి వెళ్తుండగా.. ఆ సమయంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న టూ టౌన్ సీఐ రమేష్ వీరిని అదుపులోకి తీసుకన్నారు. అనుమానంతో ప్రశ్నించగా.. వ్యవహారం బయటపడింది. వీరి వద్ద నుంచి రూ.2.50 లక్షల విలువ గల బంగారు నగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితురాలైన ఉమ గతంలో ఆమె చెల్లితో కలిసి పలు చోట్ల దొంగతనాలకు పాల్పడింది. త్రీటౌన్ పోలీస్‌స్టేషన్లో ఆమెపై మూడు కేసులు సైతం ఉన్నాయి. సమావేశంలో సీఐ రమేష్, ఎస్సైలు ఓంకార్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.