ఒకేరోజు రెండు ఇళ్లలో చోరీ
-
మరో రెండిళ్లలో విఫలయత్నం
-
సీసీ కెమెరాలు, డీవీఎల్ ధ్వంసం
-
ద్విచక్ర వాహనం అపహరణ
నల్లబెల్లి : మండల కేంద్రంలో రెండు ఇళ్లలో దొంగతనం చేయడంతో పాటు మరో రెండిళ్లలో చోరీకి విఫలయత్నం చేసిన ఘటన బుధవారం తెల్లవారుజామున సుమారు 3 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. బాధితులు, పోలీసుల కథనం ప్రకారం.. మండల కేంద్రంలో నివాసం ఉంటున్న ఉపాధ్యాయుడు పొగాకు అచ్చయ్య వారం రోజుల క్రితం తన స్వగ్రామం నందిగామకు కుటుంబ సభ్యులతోSకలిసి వెళ్లారు. మంగళవారం అర్ధరాత్రి దాటాక దుండగులు తాళం పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. తమను గుర్తించకుండా సీసీ కెమెరాలు, డీవీఎల్, హార్డ్‌డిస్క్, ఎల్‌ఈడీ మానిటర్‌లను ధ్వంసం చేశారు. బీరువా తాళాలు తీసి బట్టలు చిందరవందరడగా పడేసి, అందులోని మూడుజతల పట్టా గొలుసులు, మూడు వెండి బిల్లలను ఎత్తుకెళ్లారు. ఇంట్లోని వస్తువులను చెల్లాచెదురుగా పడేశారు. ఆ తర్వాత స్థానిక ఫొటో స్టుడియో యజమాని జనగాం నాగేశ్వర్, బీజేపీ మండల మాజీ అధ్యక్షుడు గుమ్మడి వేణు ఇళ్ల ఆవరణలో ఉన్న రెండు ద్విచక్ర వాహనాలను తీసుకెళ్లారు. కొద్దిదూరం వెళ్లాక వేణు బైక్(హీరోహోండా గ్లామర్) స్టార్ట్ కాకపోవడంతో అక్కడే వదిలేసి నాగేశ్వర్‌రావు బైక్ (హోండా శైన్) అపహరించారు. బొద్దుల కృష్ణ, పెద్ది రామన్న ఇళ్లలోనూ చోరీకి విఫలయత్నం చేశారు. బుధవారం ఉదయం చోరీ జరిగిన ఇళ్లను పరిశీలించిన ఎస్సై రాజమౌళి బాధితులతో మాట్లాడి వివరాలు సేకరించారు. నాగేశ్వర్‌రావు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.