► విప్ మేడా ప్రోద్బలంతో పోలీసుల అత్యుత్సాహం
►విద్యుదాఘాతంతో మృతిచెందాడని బలవంతంగా కేసు నమోదు
►కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి
కడప అర్బన్/సిద్దవటం: కుటుంబ పెద్ద అకాలమరణం చెందడంతో కన్నీరుమున్నీరవుతూ కుటుంబసభ్యులు అంత్యక్రియలు తీసుకువెళుతున్న సమయంలో అధికారపార్టీ నేతలు తమ దర్పాన్ని ప్రదర్శించి అడ్డుకున్నారు. వారికి పోలీసులు సైతం వత్తాసు పలికారు. మరోవైపు కుటుంబసభ్యులు తమకు కేసు అవసరం లేదని నెత్తినోరు మొత్తుకుని చెబుతున్నా విద్యుత్‌షాక్‌తో మరణించాడని బలవంతంగా కేసు బనాయించి పోస్టుమార్టం చేయించాలని ప్రయత్నించారు. ఈ సంఘటన సిద్దవటం మండలం పొన్నవోలు గ్రామపంచాయతీ వెంకటాంపల్లెలో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. వెంకటాంపల్లెకు చెందిన గువ్వల ఓబయ్య (55)బుధవారం తెల్లవారుజామున పొ లం పనికి వెళ్లి అక్కడ ఆకస్మికంగా మృతి చెందాడు.
ఈ విషయం తెలుసుకున్న ఆయన కుమారుడు ఓబులయ్య తన కుటుంబ సభ్యులతో కలిసి తన తండ్రి మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చారు. చివరిచూపు కోసం సాయంత్రం దాకా అలాగే ఉంచారు. బంధుమిత్రులు వచ్చి మృతదేహానికి నివాళులరి్పంచారు. అనంతరం సాయంత్రం అంత్యక్రియలకు తీసుకు వెళుతున్న సమయంలో రాజంపేట ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డి అనుచరులు ఆగమేఘాల మీద వచ్చి అడ్డుకున్నా రు. విద్యుదాఘాతంతో మృతిచెందిన వ్యక్తిని ఎందుకు కేసు పెట్టకుండా అంత్యక్రియలకు తీసుకువెళుతున్నారని గదమాయించారు.
ఈక్రమంలో తెల్లబోయిన మృతుని కుమారుడు ఓబులయ్య, బంధువులు ఏం చేయాలో పాలుపోక తమకెందుకు కేసు అని చెప్పుకునే ప్రయత్నం చేశారు. కానీ టీడీపీ నాయకులు ఆగకుండా సిద్దవటం పోలీసులను సంఘటనాస్థలానికి ఫోన్ చేసి మరీ పిలిపిం చారు. షాక్‌తో ఓబయ్య మృతిచెందాడని, కేసు నమోదు చేయాల్సిందేనని బలవంతంగా ఓబులయ్య చేతుల మీదుగా ఫిర్యాదు చేయించారు. అనంతరం కేసు నమోదు చేయడం పోలీసుల వంతైంది. ఈ సందర్భం గా ఓబులయ్య విలేకరులతో మాట్లాడుతూ పోస్టుమార్టం ఎందుకు చేయించాలి? తమకు కేసు వద్దని కోరుకుంటున్నప్పటికీ బాధితుని ఆవేదన అరణ్య రోదనగా మారింది.
పోస్టుమార్టం కోసం మృతదేహం
పోలీసులు మృతదేహాన్ని ఖననం చేయనీయకుండా పోలీసుస్టేషన్‌కు బుధవారం రాత్రి తీసుకొచ్చారు. అక్కడ కేసు బలవంతంగా నమోదు చేయించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కడప రిమ్స్‌కు తరలించారు. గురువారం పోస్టుమార్టం నిర్వహిస్తారని సమాచారం. కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఒంటిమిట్ట సీఐ రవికుమార్ తెలిపారు.
ఆకేపాటి పరామర్శ
బుధవారం రాత్రి వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి స్వయంగా గ్రామానికి చేరుకుని ఓబయ్య మృతికి సంతాపం తెలిపారు. ఓబులయ్యను, కుటుంబసభ్యులను ఓదార్చారు. ఈ సందర్బంగా ఆకేపాటి మాట్లాడుతూ ఎవరూ ఫిర్యాదు చేయకపోయినా అనవసరంగా పోలీసులు టీడీపీ వారు చెప్పారని, మృతదేహాన్ని అంత్యక్రియలకు వెళ్లకుండా అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. ఇటువంటి సంఘటనలు వారి కుటుంబాలకు జరగవా? అని అన్నారు. కుటుంబసభ్యులు, బంధువులు అందరూ వచ్చి నివాళులర్పించి మృతదేహాన్ని ఖననం చేయడానికి తీసుకు వెళుతున్న సమయంలో అడ్డగించడం ఏమిటని ఆయన పోలీసులను ప్రశ్నించారు.