ఎన్‌హెచ్‌–216 విస్తరణకు రూట్‌ క్లియర్‌ ! | Route Clear to NH-216 expansion | Sakshi
Sakshi News home page

ఎన్‌హెచ్‌–216 విస్తరణకు రూట్‌ క్లియర్‌ !

Published Mon, Mar 13 2017 10:31 PM | Last Updated on Tue, Sep 5 2017 5:59 AM

ఎన్‌హెచ్‌–216 విస్తరణకు రూట్‌ క్లియర్‌ !

ఎన్‌హెచ్‌–216 విస్తరణకు రూట్‌ క్లియర్‌ !

సుఖవంతమైన ప్రయాణానికి సౌకర్యవంతమైన రహదారి ఎంతో ముఖ్యం.

⇒ మచిలీపట్నం నుంచి మోపిదేవి వరకు అభివృద్ధి పనులకు టెండర్లు పిలిచిన అధికారులు
⇒10 రోజుల్లో టెండర్లు ఆమోదం
⇒ రూ.260 కోట్లతో జాతీయ  రహదారి విస్తరణకు ప్రతిపాదన
⇒ గుండేరు, జీలగలగండి వద్ద నూతన వంతెనలు


సుఖవంతమైన ప్రయాణానికి సౌకర్యవంతమైన రహదారి ఎంతో ముఖ్యం. ఈ క్రమంలో జాతీయ రహదారి–216 విస్తరణ ప్రక్రియ వేగం పుంజుకుంది. పది రోజుల్లో టెండర్ల ప్రక్రియ పూర్తి కానుంది. ఈ  జాతీయ రహదారి అభివృద్ధి త్వరితగతిన పూర్తయితే కోల్‌కతా నుంచి చెన్నై వరకు విశాలమైన రోడ్డు అందుబాటులోకి వస్తుంది. ప్రయాణం సుఖమయంగా సాగుతుంది.

మచిలీపట్నం : ఎన్‌హెచ్‌ (జాతీయ రహదారి)–216 విస్తరణ పనులు త్వరలోనే ఓ కొలిక్కి రానున్నాయి. మచిలీపట్నం నుంచి మోపిదేవి వార్పు వరకు జరగనున్న అభివృద్ధి పనులకు పది రోజుల్లో టెండర్లు ఖరారు కానున్నాయి. ఈ రహదారి పశ్చిమగోదావరి జిల్లా లోసరి నుంచి మచిలీపట్నం శివారు మాచవరం వరకు ఒక ప్యాకేజీగా ప్రస్తుతం పనులు జరుగుతున్నాయి. మచిలీపట్నం నుంచి మోపిదేవి వరకు మరో ప్యాకేజీగా రూ.260 కోట్ల అంచనాలతో టెండర్లు పిలిచారు. గతంలో మచిలీపట్నం – మోపిదేవి ప్యాకేజీకి సంబంధించి టెండర్లు పిలవగా ప్రస్తుతం మచిలీపట్నం – విజయవాడ జాతీయ రహదారి పనులను చేస్తున్న దిలీప్‌ బిల్డ్‌ కాన్‌ సంస్థ 15 శాతం అదనపు నిధులతో టెండర్లు దాఖలు చేసినట్లు జాతీయ రహదారి అధికారులు తెలిపారు.

ఒకే సంస్థ ఈ రహదారి నిర్మాణానికి టెండరు దాఖలు చేయడం, అది కూడా అంచనాకు మించి 15 శాతం అదనంగా చూపడంతో ఈ టెండరును రద్దు చేశారు. రెండోసారి ఈ రహదారి నిర్మాణానికి టెండర్లు పిలవగా ఒక్క సంస్థ కూడా ముందుకు రాలేదు. మట్టి లభ్యత తక్కువగా ఉండటం తదితర కారణాలతో టెండర్లు దాఖలు కాలేదని అధికారులు చెబుతున్నారు. మూడోసారి టెండర్లు పిలవగా 10 నిర్మాణ సంస్థలు టెండర్లు దాఖలు చేశాయి. మరో పది రోజుల్లో ఈ రహదారి నిర్మాణానికి సంబంధించి టెండరు ఖరారు కానున్నట్లు అధికారులు తెలిపారు.

నిర్మాణం ఇలా..  
కత్తిపూడి – పిఠాపురం – కాకినాడ – యానాం – ముమ్మిడివరం – అమలాపురం – రాజోలు – నరసాపురం – దిగమర్రు – కృత్తివెన్ను – బంటుమిల్లి – పెడన – మచిలీపట్నం – చల్లపల్లి – రేపల్లె మీదుగా ఒంగోలు వరకు 390 కిలోమీటర్ల మేర ఈ రహదారిని విస్తరించాలి. ప్రస్తుతం ఈ రహదారి అధిక భాగం సింగిల్‌ (12 అడుగులు) రోడ్డుగానే ఉంది. మాచవరం నుంచి మోపిదేవి వార్పు వరకు 12 మీటర్ల మేర ఈ రహదారిని విస్తరిస్తారు. పది మీటర్ల సిమెంటు రోడ్డు,  రహదారికి ఇరువైపులా ఒక్కో మీటరు చొప్పున బీటీ రోడ్డు నిర్మిస్తారు. మచిలీపట్నం హర్ష కళాశాల సమీపం నుంచి ఈ రహదారి ప్రారంభమవుతుంది.

నాగులేరు (మంచినీటి కాలువ), శివగంగ డ్రెయిన్, జీలగలగండి, లంకపల్లి సమీపంలో గుండేరు డ్రెయిన్‌పై నూతన వంతెనలను నిర్మిస్తారు. లక్ష్మీపురం, కప్తానుపాలెం వద్ద ఉన్న మలుపులతో సంబంధం లేకుండా నేరుగా రహదారి నిర్మాణం జరుగుతుంది. చాలాకాలంగా ఈ రహదారి అభివృద్ధి కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తయితే కోల్‌కతా నుంచి చెన్నై వరకు నేరుగా ఈ రహదారిపై వాహనాలు ప్రయాణించేందుకు అవకాశం ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement