అమరేశ్వరుని పుష్కర ఆదాయం రూ.1.47 కోట్లు
అమరావతి (గుంటూరు): గుంటూరు జిల్లా అమరావతి పట్టణంలో వేంచేసియున్న శ్రీబాలచాముండికా సమేత శ్రీ అమరేశ్వర స్వామి దేవస్థానంలో శుక్రవారం హుండీల లెక్కింపు నిర్వహించారు. దేవాదాయ సహాయ కమిషనర్ కేబీ శ్రీనివాసరావు సమక్షంలో తెనాలికి చెందిన భక్త సమాజం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వాహ ణాధికారి ఎన్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ హుండీల ఆదాయం రూ.42 49,606 వచ్చినట్లు తెలిపారు. స్వామివారి దర్శనం టికెట్ల ద్వారా రూ.96 లక్షల 22 వేలు, అన్నదానానికి రూ.2 లక్షల 34,509 వచ్చినట్లు వెల్లడించారు. మొత్తం రూ.1,47,23,526 ఆదాయం సమకూరినట్లు తెలిపారు. నగదును స్థానిక బ్యాంక్‌లలోని దేవాలయ ఖాతాకు జమ చేస్తున్నామన్నారు. లడ్డూప్రసాదాన్ని సుమారు రూ.40 లక్షలకు విక్రయించినట్లు తెలిపారు.