ఆదాయం నిల్
హాలియా : కృష్ణాపుష్కరాలతో ఆలయాల ఆదాయం పెరుగుతుందన్న ఆశతో ఎదురుచూసిన దేవాదాయ శాఖ అధికారులకు నిరాశే ఎదురైంది. నాగార్జునసాగర్ భక్తజన సందోహం కారణంగా ఆలయ అధికారులు ఎంతో ఆశించినప్పటికీ పోలీసుల ఆంక్షలతో ఆల యాలు బోసిబోయాయి. ప్రధానంగా శివాలయం ఘాట్ వద్ద ఉన్న శివాలయానికి వచ్చే భక్తులు కూడా ఒక్కరు లేకపోవడం గమనార్హం. వీఐపీలకు మాత్రమే దర్శనభాగ్యం కలగడంతో సాధారణ భక్తులకు దేవుని దర్శనం కావడం లేదు. ఆలయ ప్రధాన గేట్ వద్ద బారీ కేడ్లు ఏర్పాటు చేసి తాము రాకుండా చేశారని సాధారణ భక్తులు మండిపడితున్నారు. వీటితోపాటు పైలాన్‌కాలనీలో ఉన్న మార్కండేయస్వామి, హిల్‌కాలనీలోని ఏలేశ్వరస్వామి, సత్యనారాయణస్వామి ఆలయాలు బోసిబోతున్నాయి. వన్‌వే ట్రాఫిక్ కారణంగా ఆలయాలకు భక్తులు వెళ్లే అవకాశం లేదు. ఇప్పటికే ఆరు రోజులు గడిచింది. మరో ఆరు రోజులే ఉన్నాయి. ఇకనైనా పోలీసు అధికారులు సాధారణ భక్తులకు దేవుని దర్శన భాగ్యం కలిగించాలని భక్తులు, అర్చకులు కోరుకుంటున్నారు.
సాధారణ భక్తులకు దర్శనభాగ్యం కల్పించాలి – సుధాకరశాస్త్రి శివాలయ అర్చకులు
12 ఏళ్లకు ఒకసారి వచ్చే పుష్కరాల సందర్భంగా భక్తులు ప్రతిఒక్కరూ పుణ్యస్నాం అనంతరం దేవుని దర్శనం చేసుకోవాలని కోరుకుంటారు. పోలీసులు ఆంక్షల తొలగించి శివాలయంలో దర్శనభాగ్యం కల్పించాలి. మాకు కూడా పని దొరుకుతుంది.
దేవుని దర్శనం పెద్దోళ్లక్కేనా..? – రామలింగయ్య నిడమనూరు భక్తుడు
నదిలో స్నానం చేశాక మొదట శివుడిని దర్శించుకుంటే పాపాలు తొలుగుతాయి. కాని నదిపక్కన గుడి ఉన్నా దేవుని దర్శనం చేసుకోకుండా ఆపుతున్నారు. దేవున్ని పెద్దోళ్లే దర్శనం చేసుకోవాలా. మాలాంటి సాధారణ భక్తులు చేసుకోకూడదా..?