వీవీపాలెం సభలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
- కొత్తగా డబుల్‌లైన్ రోడ్ల ప్రతిపాదన
ఖమ్మం అర్బన్:జిల్లా కేంద్రం ఖమ్మం చుట్టూ రూ.182 కోట్లతో ఔటర్ రింగ్‌రోడ్డు నిర్మిస్తామని, సర్వే సాగుతోందని, సీఎం ఆమోదం తర్వాత పనులు చేపడతామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. బుధవారం రఘునాథపాలెం మండలంలోని వీవీపాలెంలో గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసి, తాగునీటి ఓవర్‌హెడ్ ట్యాంక్ ను ప్రారంభించి సభలో మాట్లాడారు. ఖమ్మం నియోజకవర్గంలో ఇప్పటి వరకు రూ.వెయ్యి కోట్లతో అభివద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. వీవీపాలెం నుంచి వేపకుంట్ల వరకు, రఘునాథపాలేనికి డబుల్‌లైన్ రోడ్లు మంజూరు చేస్తామని ప్రకటించారు. వీవీపాలెం–మంచుకొండ వరకు రూ.7కోట్లతో బీటీరోడ్డు నిర్మించామని, స్థానిక ఎమ్మెల్యే విజ్ఞప్తి మేరకు పంచాయతీరాజ్ నుంచి రోడ్లు, భవనాలశాఖకు మార్చామని, వీవీపాలేనికి పూర్వ వైభవం తీసుకొస్తామని హామీనిచ్చారు. ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ మాట్లాడుతూ..మంత్రి సహకారంతో నియోజకవర్గంలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. అనంతరం మంత్రి స్థానిక పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమాల్లో జెడ్పీ చైర్‌పర్సన్ గడిపల్లి కవిత, డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్‌బాబు, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, జెడ్పీ సీఈఓ నూరపాక నగేష్, ఆర్డీఓ వినయ్‌కష్ణారెడ్డి, జెడ్పీటీసీ అజ్మీరా వీరునాయక్, ఎంపీపీ మాలోత్ శాంత, డీఈఓ రాజేష్, సర్పంచ్ ఆవుల హేమలత, ఎంపీటీసీ యరగర్ల పద్మ, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ సత్యనారాయణ, సొసైటీ అధ్యక్షుడు రావెళ్ల శ్రీనివాసరావు, ఆత్మ చైర్మన్ మెంటం రామారావు, తహసీల్దార్ వెంకారెడ్డి, ఎంపీడీఓ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.