
వాట్సాప్‌లో ఐదువేల నోటు హల్‌చల్!
మెదక్: ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో ఐదువేల రూపాయల నోటు ఇదేనంటూ ఓ ఫొటో హల్‌చల్ చేస్తోంది. త్వరలో భారత రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) ఈ నోటును మార్కెట్‌లోకి విడుదల చేయనున్నట్లు పేర్కొంటూ.. దీనిని ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఐదువేల నోటు వాట్సాప్ లో విపరీతంగా షేర్ అవుతోంది. గతంలో రూ.500 నోటు రావడమే ప్రజలు గొప్పగా భావించారు.
ఆ తరువాత రూ.1,000 నోటు వచ్చి వారిని మరింత ఆశ్చర్యపరిచింది. ఈసారి ఏకంగా రూ.5,000 నోటు వస్తుందని వాట్సాప్‌లో ప్రచారం జరుగడం చర్చనీయాంశంగా మారింది. వాట్సాప్‌లోనే కాదు ఫేస్‌బుక్‌లోనూ ఈ ఐదువేల నోటు ఫొటో హల్‌చల్ చేస్తోంది. అయితే గతంలో 2014లోనూ ఓసారి ఇలాగే రూ. ఐదువేల నోటు వస్తుందని విపరీతంగా ప్రచారం జరిగింది. దీనిని ఆర్బీఐ అప్పట్లో కొట్టిపారేసింది. ఐదువేల నోటు వస్తుందన్నదని ప్రచారం బూటకమేనని అప్పట్లో స్పష్టం చేసింది.