న్యూఢిల్లీ : స్థానికంగా డేటా స్టోర్ చేయాలంటూ... అంతర్జాతీయ ఫైనాన్సియల్ టెక్నాలజీ కంపెనీలకు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా విధించిన నిబంధనలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ తుది గడువును ఇంకా పొడిగించే లేదంటూ కూడా ఆర్‌బీఐ తేల్చేసింది. ఇప్పటికే డేటాను స్థానికంగా స్టోర్ చేసుకునేందుకు కంపెనీలకు ఆరు నెలల సమయం ఇచ్చినట్టు ఆర్‌బీఐ సీనియర్ అధికారులు పేర్కొన్నారు. దీంతో నేటి నుంచే ఈ స్థానిక స్టోరేజ్ నిబంధనలను విదేశీ కంపెనీలు పాటించాల్సి వస్తోంది. అంటే గ్లోబల్ ఫైనాన్సియల్ టెక్నాలజీ కంపెనీలన్నీ దేశీయ కస్టమర్ల లావాదేవీల డేటాను భారత్‌లోనే స్టోర్ చేయాలి.
తుది గడువును పొడిగించాలని కోరుతూ... వీసా, మాస్టర్‌కార్డు, పేపాల్, గూగుల్, అమెజాన్, ఫేస్‌బుక్ కంపెనీల ప్రతినిధులు, ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీని ఈ నెల ప్రారంభంలో కలిశారు. కానీ అప్పటికే ఆరు నెలల సమయమిచ్చిన ఆర్‌బీఐ, ఇక పొడిగింపు ఇవ్వనని చెప్పింది. వాట్సాప్ తాము ఇప్పటికే ఆర్‌బీఐ ఆదేశాలను పాటిస్తున్నట్టు పేర్కొంటోంది. భారత్‌లో పేమెంట్ సంబంధిత డేటాను స్టోర్ చేసే సిస్టమ్‌ను రూపొందించినట్టు ఈ కంపెనీ తెలిపింది. ప్రస్తుతం వాట్సాప్‌కు భారత్‌లో 200 మిలియన్ మంది యూజర్లున్నారు. మెసేజింగ్ మాధ్యమంగా దూసుకెళ్తున్న ఈ కంపెనీ, దేశీయ పేమెంట్ రంగంలో తనదైన ముద్ర వేసుకునేందుకు పేమెంట్స్ ఫీచర్‌ను తీసుకొస్తోంది.
దేశీయ కంపెనీలు ఆర్‌బీఐ మార్గదర్శకాలను స్వాగతిస్తున్నాయి. అయితే గ్లోబల్ కంపెనీలు మాత్రం ఆర్‌బీఐ మార్గదర్శకాలపై కాస్త అసంతృప్తిగానే ఉన్నాయి. స్థానిక సర్వర్లను ఇప్పడికప్పుడు ఏర్పాటు చేయడం అంటే ఖర్చుతో కూడుకున్న పని అంటూ గ్లోబల్ కంపెనీలు భయపడుతున్నాయి. ఖర్చుల పెరుగుదలను నివారించేందుకు భారత్‌లో ఒరిజినల్ డేటాకు బదులు, మిర్రర్ డేటాను అందిస్తామని గ్లోబల్ కంపెనీలు ఇటీవల ఆర్‌బీఐతో జరిపిన సమావేశంలో చెప్పాయి. అయితే ఆ ప్రతిపాదనకు ఆర్‌బీఐ ఒప్పుకోలేదు. కచ్చితంగా డేటాను ఎండ్-టూ-ఎండ్ లావాదేవీగా అందించాలని ఆదేశించింది. పేమెంట్ ఇన్‌స్ట్రక్షన్ మేరకే సమాచారాన్ని సేకరించడం, ప్రాసెస్ చేయడం జరుపాలని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment