
ముంబై: కార్డు చెల్లింపులను స్వీకరించని సంస్థలకు మధ్యవర్తుల ద్వారా చెల్లింపులు జరపడాన్ని నిలిపివేయాలంటూ కార్డు నెట్‌వర్క్ సంస్థ వీసాను ఆర్‌బీఐ ఆదేశించినట్లు సమాచారం. ఇలాంటి లావాదేవీల ద్వారా పెద్ద మొత్తంలో నిధులు చట్టవిరుద్ధంగా బదిలీ అవుతున్నాయని రిజర్వ్ బ్యాంక్ పేర్కొంది.
‘కార్డు ద్వారా చెల్లింపులను స్వీకరించని సంస్థలకు నిర్ధిష్ట మధ్యవర్తుల ద్వారా చెల్లింపులు జరిగేలా ఒక కార్డ్ నెట్‌వర్క్ సంస్థ ఒప్పందం చేసుకున్నట్లు మా దృష్టికి వచ్చింది‘ అంటూ వీసా పేరును ప్రస్తావించకుండా రిజర్వ్ బ్యాంక్ ఒక ప్రకటనలో పేర్కొంది.
ఈ వ్యవహారంపై చేపట్టిన అధ్యయనం పూర్తయ్యే వరకు అటువంటి ఒప్పందాలను నిలిపివేయాలని కార్డు కంపెనీకి సూచించినట్లు వివరించింది. అయితే, క్రెడిట్ కార్డుల సాధారణ వినియోగంపై ఎలాంటి ఆంక్షలు లేవని పేర్కొంది. ఆర్‌బీఐ ప్రత్యేకంగా పేరు ప్రస్తావించనప్పటికీ సదరు కార్డు నెట్‌వర్క్ సంస్థ వీసానే అని సంబంధిత వర్గాలు తెలిపాయి. నిబంధనల ప్రకారం ఇది కూడా ఒక తరహా చెల్లింపు విధానం కిందకే వస్తుందని, అధికారికంగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని ఆర్‌బీఐ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment