గూగుల్, ఫేస్‌బుక్, వాట్సాప్ మనకెందుకు?
► సొంత యాప్స్ మనకూ ఉంటాయిగా!
► వాళ్ల సేవలు అక్కర్లేదని చెబితే సరి
► అమెరికా ధోరణులపై సునీల్ మిట్టల్ వ్యాఖ్య
న్యూఢిల్లీ: విదేశీ నిపుణుల రాకను నియంత్రించేలా అమెరికా ప్రభుత్వం రక్షణాత్మక ధోరణులు అవలంబిస్తుండటంపై టెలికం సంస్థ భారతీ ఎయిర్‌టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్ ఘాటుగా స్పందించారు. పలు అమెరికన్ కంపెనీలకు పెద్ద ఎత్తున కార్యకలాపాలున్న భారత్ కూడా ఇదే వైఖరి పాటిస్తే ఎలా ఉంటుందో ఆలోచించుకోవాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. విదేశీ సంస్థలు భారత్‌లో భారీ లాభాలు ఆర్జిస్తున్నప్పుడు.. భారతీయ ఉద్యోగుల రాకపోకలపై ఆయా దేశాలు నియంత్రణలు విధించడం సరికాదన్నారు.
అమెరికాలాగానే వ్యవహరిస్తే.. స్వదేశీ యాప్స్ అనేకం ఉండగా భారత్‌లో గూగుల్, ఫేస్‌బుక్, వాట్సాప్ వంటి అమెరికన్ టెక్ దిగ్గజాల కార్యకలాపాలను అనుమతించాల్సిన అవసరమేం ఉంటుందని ప్రశ్నించారు. ‘ఫేస్‌బుక్‌కు 20 కోట్ల మంది, వాట్సాప్‌కు 15 కోట్ల మంది, గూగుల్‌కు 10 కోట్ల మంది యూజర్లు భారత్‌లో ఉన్నారు. అలాంటప్పుడు మా సొంత యాప్స్ మాకున్నాయి.. మీరు మాకు అక్కర్లేదు అంటే ఎలా ఉంటుంది‘ అని మిట్టల్ వ్యాఖ్యానించారు. భారత ఐటీ నిపుణులపై ప్రభావం చూపించేలా అమెరికా వీసా నిబంధనలు కఠినతరం చేయడంపై ఆయన ఈ మేరకు స్పందించారు.