ఆర్‌ఎస్‌ఆర్‌.. ఈజే లెజెండ్‌.. | rsr is a legend | Sakshi
Sakshi News home page

ఆర్‌ఎస్‌ఆర్‌.. ఈజే లెజెండ్‌..

Published Sat, Nov 5 2016 10:31 PM | Last Updated on Mon, Sep 4 2017 7:17 PM

ఆర్‌ఎస్‌ఆర్‌.. ఈజే లెజెండ్‌..

ఆర్‌ఎస్‌ఆర్‌.. ఈజే లెజెండ్‌..

-ఆస్తులమ్మి విద్యాదానం
–ఎమ్మెల్సీ అయినా సాధారణ జీవితం
 
అరవై ఆరు ఎకరాల ఆసామి. రాష్ట్రంలో పేరుగాంచిన ఒక విద్యా సంస్థకు ప్రిన్సిపాల్‌గా పనిచేసిన వ్యక్తి. ఆయన తలచుకుంటే విలాసవంతమైన జీవితాన్ని అనుభవించొచ్చు. ఏడంతస్తుల మేడ, నౌకర్లు, చాకర్లు, కార్లు ఇలా ఏదైనా సమకూర్చుకోవచ్చు. కానీ ఆయన ఆవేమీ కోరుకోలేదు. ఓ సాధారణ మధ్య తరగతి వ్యక్తిలా జీవించాడు. అలాంటి కుటుంబ యజమాని రూపాయి ఖర్చుపెట్టకుండా మేధావుల సభకు ఎన్నికయ్యాడు.. అదికూడా కార్పొరేట్‌ విద్యా వ్యవస్థను శాసించే వ్యక్తులు, అధికారంలో ఉన్న పార్టీ అభ్యర్థిపై పోటీ చేసి గెలిచాడు. ఆయనే ఎమ్మెల్సీ రాము సూర్యారావు(ఆర్‌ఎస్‌ఆర్‌). ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) 
 
పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలం పొంగుటూరు గ్రామానికి చెందిన రాము పేరయ్య, రత్తాల ఏకైక కుమారుడు రాము సూర్యారావు(ఆర్‌ఎస్‌ఆర్‌). సొంతూరులోనే ప్రాథమిక విద్యను పూర్తిచేసిన ఆర్‌ఎస్‌ఆర్‌ డిగ్రీ విద్యను సీఆర్‌రెడ్డి కళాశాలలోనూ, డబుల్‌ ఎంఏను ఆంధ్ర విశ్వ విద్యాలయంలోనూ పూర్తిచేశారు. 1996 నుంచి 2005 వరకు సీఆర్‌ఆర్‌ కాలేజీలో పొలిటికల్‌ సైన్సు విభాగాధిపతిగా పనిచేశారు. 2005నుంచి 2007వరకు అదే కళాశాలకు ప్రిన్సిపాల్‌గా సేవలు అందించి మే 31న పదవీవిరమణ చేశారు. 
 
తాను 3వ తరగతి చదువుతున్న నాటి నుంచే తోటి విద్యార్థులకు పుస్తకాలు, ఫీజులకు సాయపడేవారు ఆర్‌ఎస్‌ఆర్‌. తనకు తండ్రి జేబు ఖర్చుల కోసం ఇచ్చిన డబ్బును వారికి ఇచ్చి ఆదుకునేవారు. వయస్సుతో పాటు ఆయనలోని దయాగుణమూ ఎదుగుతూ వచ్చింది. పేద విద్యార్థులను చదివించడానికి తాతల నుంచి సంక్రమించిన ఆస్తిలో 44 ఎకరాల భూమిని ఆయన అమ్మేశారు. ఉద్యోగంలో ఉండగా తనకు వచ్చిన జీతాన్ని ధారపోసేంతగా, పదవీ విరమణ అనంతరం తన పెన్షన్‌ను సైతం విద్యార్థులకే ఖర్చుపెట్టేంతగా ఆయన దయాగుణం ప్రమోట్‌ అయ్యింది. ఇప్పటికీ ఎమ్మెల్సీగా ఆయన జీతం, పెన్షన్‌ అన్నీ విద్యకే వినియోగిస్తున్నారు. అలాగే ఆరోగ్యమే మహాభాగ్యం అని అందరూ ఆరోగ్యంగా ఉంటేనే దేశం ముందుకువెళుతుందని ఆర్‌ఎస్‌ఆర్‌ విశ్వసిస్తారు. అందుకే పదవీ విరమణ అనంతరం ఎన్ని ఆఫర్లు వచ్చినా కాదని.. ప్రభుత్వాసుపత్రిలో రోగులకు వైద్య సేవలందే విధంగా వారికి సహాయ సహకారాలు అందిస్తూ వచ్చారు. ఆయన రోగులకు చేస్తోన్న సేవలను గుర్తించి ప్రభుత్వం ఆయన్ని జిల్లా కేంద్ర ప్రధాన ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్‌గా నియమించింది. 
 
విద్యాభివృద్ధికి తన జీతాన్ని, జీవితాన్ని ధారపోసిన ఆర్‌ఎస్‌ఆర్‌ మాష్టారు ప్రభుత్వ విద్యా విధానంపై మాత్రం అసంతృప్తి వ్యక్తం చేస్తుంటారు. బాల కార్మికుల విద్యకు, వయోజన విద్యకు ప్రభుత్వం విడుదల చేస్తోన్న నిధులు వృథా అవుతున్నాయనే బాధ ఆయన మాటల్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఇష్టంలేని వారికి బలవంతంగా విద్య చెప్పించే బదులు ఆసక్తిగా చదువుకునే వారి కోసం ఆ నిధులు వినియోగిస్తే మరింత ప్రయోజనముంటుందనేది ఆయన వాదన. ప్రభుత్వ పాఠశాలలను దాతలు, ప్రజా ప్రతినిధులు దత్తత తీసుకోవాలన్నది ఆయన ఆకాంక్ష. అందరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లోనే చదివించేందుకు కృషి చేయాలంటారు. ముఖ్యంగా ప్రభుత్వ టీచర్లు దీనిని గుర్తించుకోవాలని ఆర్‌ఎస్‌ఆర్‌ అభిప్రాయం. 
కార్పొట్‌ విద్యా విధానం మారాలి
’కార్పొరేట్‌ విద్యా సంస్థలు అతి చేస్తున్నాయి. విద్యార్థుల్లో మానసిక పరిపక్వత, సామాజిక చైతన్యం లేకుండా కేవలం బండ చదువులు రుద్దడానికే పరిమితమయ్యాయి. ఆ విధానం మారాలి. అమెరికా, జపాన్‌ దేశాల్లో ప్రభుత్వ పాఠశాలలే అగ్రస్థానాల్లో నిలుస్తున్నాయి. అటువంటి విద్యా విధానంపై అధ్యయనం చేసి ఇక్కడ అమలు చేయాల్సిన అవసరముంది.’ అని ఆర్‌ఎస్‌ఆర్‌ అంటారు. 
రాజకీయాలకు దూరంగా.. సేవకు దగ్గరగా..
’నేను ఏ పార్టీకీ అనుకూలంకాదు, వ్యతిరేకం కాదు అన్ని వర్గాలనూ కలుపుకుపోతాను. ఏ మతం వారైనా తాము నమ్మిన దేవుణ్ణి పూజిస్తే పుణ్యం రాదు. రోగులకు సేవచేస్తే, విద్యార్థులను చదివిస్తే పుణ్యం వస్తుంది అని నమ్మితే సరిపోతుంది. ఓటు వేయడానికి మన  కులపోడా, మనకు ఎంత డబ్బు ఇచ్చాడు అని కాకుండా సేవ చేసేవాడా కాదా, సమాజానికి ఉపయోగపడేవాడా కాదా అని ఆలోచించి ఓటు వేయాలి. కష్టాలు ఎదుర్కొన్నా నీతి, నిజాయితీలకు కట్టుబడి పనిచేస్తే వచ్చే సంతృప్తి అధికారంవల్లనో, డబ్బువల్లనో రాదని గ్రహించాలి’ అన్నది ఆర్‌ఎస్‌ఆర్‌ సందేశం. 
 
 
 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement