నల్లమల ఘాట్‌లో ఆర్టీసీ బస్సు బోల్తా
ఆత్మకూరు: కర్నూలు – దోర్నాల రహదారిలో నల్లమల ఘాట్‌లోని రోళ్ల పెంట ఎగువన 32 కి.మీ. రాయి మలుపు వద్ద ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. విజయవాడ నుంచి మంత్రాలయానికి బయలుదేరిన తిరువూరు డిపోకు చెందిన సూపర్ లగ్జరి బస్సు శనివారం వేకువజామున 3.30 గంటల సమయంలో టైరు అదుపు తప్పి బోల్తా పడింది. పక్కనే భారీ వృక్షాలు, వెదురు పొదళ్లు ఉండటంతో బస్సు లోయలో పడకుండా నిలిచిపోయింది. దీంతో బస్సులోని 30 మంది ప్రయాణికులు అద్దాలు పగులగొట్టుకుని సురక్షితంగా బయటపడ్డారు. మలుపు వద్ద నెమ్మదిగా వెళ్తున్న సమయంలో బస్సు బోల్తా పడటంతో ప్రయాణికులకు గాయాలు కాలేదు. అదే రహదారిలో మరో బస్సులో విజయవాడ నుంచి కర్నూలుకు వస్తున్న కర్నూలు ఆర్‌ఎం వెంకటేశ్వరరావు సంఘటన స్థలానికి చేరుకుని ఆత్మకూరు ఆర్టీసీ డిపో అధికారులకు సమాచారం అందజేశారు. మరో బస్సులో ప్రయాణికులను మంత్రాలయానికి పంపించారు. శనివారం ఉదయం ఆత్మకూరు ఆర్టీసీ డీఎం శ్యాంప్రసాద్, పీటీఎం మధుసూదన్‌రావు, తిరువూరు డిపో మేనేజర్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. బస్సును క్రేన్ ద్వారా బయటకు తీశారు. భారీ వక్షాలు, వెదురు పొదలు లేకపోతే 10 అడుగుల లోయలో పడేదని అధికారులు చెబుతున్నారు.