bus accident
ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ
Published Sat, Jul 23 2016 10:49 PM | Last Updated on Mon, Sep 4 2017 5:54 AM
మద్దిపాడు : రోడ్డు పక్కకు ఆగేందుకు ప్రయత్నిస్తున్న ఆర్టీసీ బస్సును వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా ఇద్దరు తీవ్రంగా ఆరుగురు స్వల్పంగా గాయపడ్డారు. ఈ ఘటన మండలంలోని గుండ్లాపల్లి ఫ్లయి ఓవర్ సమీపంలో జాతీయ రహదారిపై శుక్రవారం అర్ధరాత్రి ఒకటిన్నర గంటల సమయంలో జరిగింది. అందిన వివరాల ప్రకారం.. కనిగిరి డిపోకు చెందిన బస్సు విజయవాడ నుంచి కనిగిరి వెళ్తోంది. ఓ వృద్ధ ప్రయాణికుడు మేదరమెట్లలో దిగాల్సి ఉండగా ఆయన నిద్రపోయాడు. గుండ్లాపల్లి వద్దకు రాగానే మెలుకువ వచ్చి స్టేజీ దాటిపోయిందని గ్రహించి బస్సు ఆపాలంటూ కేకలేశాడు. బస్సు డ్రైవర్ గుండ్లాపల్లి ఫ్లయి ఓవర్ దాటిన తర్వాత రోడ్డు మార్జిన్‌లో ఆపేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇంతలో వెనుక నుంచి అతివేగంగా వచ్చిన తమిళనాడు లారీ.. ఒక్క ఉదుటున బస్సు వెనుక భాగాన్ని ఢీకొట్టాడు. ప్రమాదంలో బస్సు వెనుక సీట్లో కూర్చొని ఉన్న గుర్తు తెలియని ప్రయాణికునితో పాటు ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను 108లో ఆస్పత్రికి తరలిస్తుండగా గుర్తుతెలియని ప్రయాణికుడు మృతి చెందాడు. ఆయన వివరాల కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు. బస్సు ముందు భాగంలో నిలబడి ఉన్న అద్దంకి డిపోకు చెందిన కండక్టర్ రత్నకుమార్ కుడిచేయి భుజం వద్ద ఎముక విరిగిపోయింది. ఆదే బస్సులో ప్రయాణిస్తున్న ఆరుగురికి స్వల్ప గాయాలయ్యాయి. బస్సు దిగబోతున్న వృద్ధుడు కూడా గాయపడటంతో ఆయన్ను బంధువులు ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఎస్సై దేవకుమార్ తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఆ పక్కనే ఉన్న ఎక్స్‌ప్రెస్ డాబా యజమాని తన సిబ్బందితో కలిసి పోలీసులకు సాయం చేశారు. మృతుని వివరాలు తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్సై విజ్ఞప్తి చేశారు.
Advertisement