
చార్జీల మోత
♦ చార్జీల మోత.. కరెంటు వాత
♦ బస్సు భారం ఏటా రూ.12.15 కోట్లు
♦ ప్రతినెలా విద్యుత్ వడ్డింపు రూ.5 కోట్లు!
♦ కుదేలైన సామాన్య జనం సర్కారు తీరుపై విమర్శలు
సర్కార్ ఒకే రోజు రెండు షాకులిచ్చింది. చార్జీల వడ్డింపుతో సామాన్యులను ఎడాపెడా బాదేసింది. ఓ వైపు విద్యుత్, మరోవైపు ఆర్టీసీ బస్సు చార్జీలను పెంచింది. వంద యూనిట్లు దాటితే చాలు పెంపు భారం తప్పదు. 24 గంటలూ విద్యుత్ సరఫరా చేస్తోన్న దశలో సామాన్యుడు సైతం వంద యూనిట్ల స్లాబ్ దాటేస్తున్నాడు. ఈ క్రమంలో తాజాగా పెంపు భారాన్ని మోయక తప్పని పరిస్థితి.
మెదక్: ఆర్టీసీ బస్సు చార్జీల పెంపు భారం సామాన్యుడిపై పడింది. ఆర్డినరీ బస్సుతోపాటు అన్ని రకాల బస్సుల్లోనూ ప్రభుత్వం చార్జీల మోత మోగించింది. 30కిలో మీటర్లకుపైగా ప్రయాణించే ప్రతి ప్రయాణికుడిపై అదనపు భారం మోపింది. జిల్లాలో ఏడు బస్సు డిపోలు ఉండగా మొత్తం 618 బస్సులు నడుస్తున్నాయి. ఇందులో 269 ఆర్డినరీ, పల్లె వెలుగు బస్సులుండగా, 349 ఎక్స్‌ప్రెస్, లగ్జరీ, సూపర్‌లగ్జరీ బస్సులున్నాయి. నిత్యం ఈ బస్సులు 2.25 లక్షల కిలోమీటర్ల మేర తిరుగుతున్నాయి. ఇందులో 1,12,500 కిలో మీటర్ల ప్రయాణం 30కిలో మీటర్లపైనే కొనసాగుతుంది.
30 కిలో మీటర్ల లోపు రూపాయి చొప్పున పెరుగుతుండటంతో ఏడాదికి రూ.4.05 కోట్ల భారం పడగా, 30 కిలోమీటర్ల ఆపైనా.. 8.10 కోట్ల భారం పడుతుంది. మొత్తం రూ.12.15 కోట్లు భారం ప్రయాణికుడిపై పడనుంది.ఇప్పటికే కరువు, కాటకాలతో నిండా మునిగిన పేద, సామాన్య, మధ్యతరగతి ప్రజలకు మరింత భారం కానుంది. ఇప్పటికే కరువుతో ప్రజలు వలసలు వెళ్తున్న క్రమంలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయడం లేదు. దీంతో ఆర్టీసీ నష్టాల్లో ఉన్నట్లు ఉన్నతాధికారి తెలిపారు. అలాంటిది కరువు, కాటకాలతో విలవిలలాడుతున్న ప్రజలపై ఆర్టీసీ చార్జీలను వడ్డించడం ఎంతవరకు సమంజసమని పలువురు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
చార్జీల పెంపుపై మండిపాటు...
చార్జీల పెంపు సరికాదని ఇప్పటికే కమ్యూనిస్టులు, ఇతర పార్టీల నాయకులు ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ప్రత్యేక రాష్ట్రంలో ఏడాదికి 27శాతం ఆదాయం అధికంగా వస్తుందని ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. దేశంలోనే రాష్ట్రాన్ని అభివృద్ధిలో మొదటిస్థానంలో నిలుపుతామంటూ చెప్పిన మరుసటి రోజే చార్జీలు పెంచడం సరికాదని పలువురు విమర్శిస్తున్నారు.
♦ ఇదే పరిస్థితి కొనసాగితే ప్రభుత్వంపై ప్రజలు పెట్టుకున్న నమ్మకం వమ్ముచేసినట్లే అవుతుందన్నారు. దీంతో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగే అవకాశాలున్నాయి.