అక్రమ సరుకు వయా అధికార పార్టీ?
• చెన్నై నుంచి హైదరాబాద్ వెళుతున్న విదేశీ టేకు
• నాయకుల రంగప్రవేశంతో అధికారులు సెలైంట్
ఒంగోలు క్రైం: విదేశీ టేకు అక్రమ వ్యాపారంలో లక్షలాది రూపాయలు చేతులు మారుతున్నారుు. చెన్నై నుంచి హైదరాబాద్‌కు కలప యథేచ్ఛగా తరలిపోతోంది. నాలుగు రోజులుగా ఒంగోలు రిజర్వు ఫారెస్ట్ కార్యాలయంలో ఉన్న రెండు లారీల వ్యవహారంలో అధికార పార్టీ నాయకుల ఒత్తిడి పెరగడంతో వాటిని అక్కడ నుంచి పంపించేందుకు అటవీ శాఖాధికారులు ఉత్సాహంగా ఉన్నట్లు తెలిసింది. వేబిల్లులు సక్రమంగా లేకపోవడం ఒక ఎత్తు అయితే... గుంటూరు అటవీ శాఖకు చెందిన స్క్వాడ్ అధికారులు ఈ వ్యవహారంలో మెత్తబడినట్లు సమాచారం.
ఒంగోలు అటవీ శాఖాధికారులు కూడా స్క్వాడ్ అధికారులతో చేతులు కలిపి నామమాత్రపు అపరాధరుసుం విధించి పంపించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. అక్రమంగా విదేశీ టేకు తరలిస్తున్న రెండు లారీలను అక్టోబర్ 31వ తేదీ రాత్రి అటవీ శాఖ స్క్వాడ్ అధికారులు పట్టుకున్నారు. గుంటూరు చెందిన స్క్వాడ్ రేంజర్ నాగేంద్రరావు ఆధ్వర్యంలోని బృందం ఒంగోలు బైపాస్ రోడ్డులో మాటు వేసి అదుపులోకి తీసుకున్నారు. ఇతర దేశాలనుంచి దిగుమతి చేసుకున్న టేకును చెన్నై హార్బర్ నుంచి లారీల్లో తరలిస్తున్నారు. లారీ డ్రైవర ్లను టేకుకు సంబంధించిన ఇన్‌వాయిస్, సరుకు వివరాలు చూపించాలని కోరారు. ఎలాంటి ఆధారాలు లేకపోవటంతో లారీలను ఒంగోలు రెగ్యులర్ ఫారెస్ట్ రేంజర్ కార్యాలయూనికి తరలించారు. వాటిని అటవీ శాఖ అధికారులకు అప్పగించి వెళ్లి పోయారు.