
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
రాజువారిపేట(చాపాడు): అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యకు యత్నించిన మండల పరిధిలోని రాజువారిపేట గ్రామానికి చెందిన పాలూరు వెంకటరెడ్డి (55) అనే రైతు మృతి చెందాడు. పోలీసులు, మృతుని బంధువుల కథనం మేరకు.. గత ఐదారేళ్లుగా వెంకటరెడ్డి 9 ఎకరాల కౌలు పొలంలో వ్యవసాయం చేస్తున్నాడు. ఈ క్రమంలో తనకు వ్యవసాయం, కుటుంబ పోషణ కోసం రూ. 8లక్షలు పైగా అప్పులు అయ్యాయి. ఈ ఏడాది సాగు చేసిన చెరకు పంట సైతం అనుకున్నంత దిగుబడి ఇవ్వకపోవటంతో మనస్తాపం చెందిన రైతు ఈ నెల 20న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శివశంకర్ తెలిపారు.