పోలీస్ సంక్షోభం
=హోంగార్డులకు మూడు నెలలుగా అందని జీతం
=బడ్జెట్ ఉన్నా మంజూరు చేయని అధికారులు
=దయనీయ పరిస్థితిలో చిరు ఉద్యోగులు
అనంతపురం సెంట్రల్ : నగరంలోని ఓ పోలీస్ స్టేషన్ లో పని చేస్తున్న శివ(పేరు మార్చాం) అనే హోంగార్డుకు నెలసరి వేతనం రూ.12 వేలు. ఇంటి అద్దెకు రూ. 4 వేలు, ఇంటి సరుకులు రూ. 3 వేలు, కరెంట్, పాల బిల్లు రూ. 900, డిష్ బిల్లులు, పిల్లల చదువులు, ఇతర ఖర్చులు కలిపి మరో రూ.5 వేలు ఖర్చు అవుతోంది. ప్రతినెలా వచ్చే ఈ జీతంపై ఆధారపడి కుటుంబాన్ని పోషిస్తున్నారు. ప్రస్తుతం మూడు నెలలుగా వేతనాలు అందలేదు. కుటుంబ పోషణకు అవసరమైన డబ్బును వడ్డీకి తెచ్చుకోవాల్సి వస్తోంది. రెండు నెలలుగా అద్దె చెల్లించకపోవడంతో ఇంటి యజమానుల నుంచి వేధింపులు మొదలయ్యాయి. కేవలం ఒక్క శివ మాత్రమే కాదు జిల్లాలోని 961 మంది హోంగార్డూలదీ ఇదే పరిస్థితి.
‘అనంత’లోనే ఈ పరిస్థితి
పొరుగున ఉన్న వైఎస్సార్ కడప, కర్నూలు జిల్లాల్లోని హోంగార్డులకు 5,6 తేదీల్లో జీతాలు అకౌంట్‌లో జమ అవుతుండగా, జిల్లాలో మాత్రం వేతనాల చెల్లింపులు గందరగోళంగా మారాయి. జిల్లాలో హోంగార్డులకు వేతనాలు ఎప్పుడు ఇస్తారోకూడా తెలియని పరిస్థితి. ప్రస్తుతం మూడు నెలలుగా వేతనాలు అందలేదు. కనీసం ఉన్నతాధికారులకు విన్నవించుకునే సాహసం కూడా చేయలేని పరిస్థితిలో హోంగార్డులు బతుకీడిస్తున్నారు. ఒకవేâýæ వినతిపత్రం ఇస్తే భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బందులకు గురవుతామో అనే భయాందోళన వారిలో వ్యక్తమవుతోంది.
మానసిక క్షోభను అనుభవిస్తున్న
హోంగార్డులు : పొరుగున ఉన్న తెలంగాణలో హోంగార్డుల సంక్షేమానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోంది. హోంగార్డుల పేరును మార్చి స్పెషల్ పోలీస్ అసిస్టెంట్స్(ఎస్పీఏలు)గా మార్చారు. బేసిక్, డీఏ, హెచ్‌ఆర్‌ఏ, సీసీఏ కలిపి రూ.19,884 ఇస్తున్నారు. ఇక్కడ మాత్రం రూ. 12 వేలు మాత్రమే వస్తోంది. అది కూడా సక్రమంగా రాకపోవడంతో తీవ్ర మానసిక క్షోభను అనుభవిస్తున్నారు. కుటుంబాలు కూడా సక్రమంగా గడవని పరిస్థితి నెలకొంది. కేవలం హోంగార్డులే కాకుండా వారి కుటుంబ సభ్యులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది.
పట్టని పోలీసు సంక్షేమం
జిల్లాలో హోంగార్డులు అవస్థలు పడుతున్నా పోలీసులు అధికారుల సంఘం పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. పోలీసులంటే కేవలం కానిస్టేబుల్, హెడ్‌కానిస్టేబుల్, ఏఎస్‌ఐలు, ఎస్‌ఐలు ఆపై స్థాయి అధికారులు మాత్రమేనా అని హోంగార్డులు ప్రశ్నిస్తున్నారు. ప్రముఖులు వచ్చినా, ఏ ఎన్నికలు వచ్చినా ఒళ్లు హూనం అయ్యే లా పనిచేస్తోంది హోంగార్డులేనన్న విషయం ఉన్నతాధికారులకు తెలియదా? అని మండిపడుతున్నారు. పోలీసు అధికార సంక్షేమ సంఘంలో తమకు ఓటు లేదనే సంఘం నేతలు తమను నిర్లక్ష్యం చేస్తున్నారని హోంగార్డులు వాపోతున్నారు.
బడ్జెట్ రాలేదు :
బడ్జెట్ రాకపోవడంతో హోంగార్డుల జీతాలు ఆగాయి. త్వరలో బడ్జెట్ వస్తుంది. మూడు నెలలవి కలిపి ఒకేసారి చెల్లిస్తాం.
– చిన్నికృష్ణ, ఏఆర్ డీఎస్పీ