
సాక్షి, హైదరాబాద్ : హోంగార్డులపై రాష్ట్ర ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. హోంగార్డుల వేతనాలను రూ.12 వేల నుంచి రూ.20 వేలకు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. హోంగార్డులందరికీ డబుల్ బెడ్రూం ఇళ్లను కట్టించి ఇస్తామని వెల్లడించారు. బుధవారం ఇక్కడ ప్రగతిభవన్‌లోని ‘జనహిత’లో హోంగార్డులతో సీఎం సమావేశమయ్యారు. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, డీజీపీ మహేందర్‌రెడ్డి సమక్షంలో వేతనాల ’పెంపుతోపాటు పలు కీల కమైన ప్రకటనలు చేశారు. వేతనాల పెంపుతో ఏడాదికి దాదాపు రూ.265 కోట్ల మేర ప్రభుత్వంపై భారం పడనుంది. ఈ నిర్ణయాలతో రాష్ట్రంలో దాదాపు 18,900 మంది హోంగార్డులు లబ్ధి పొందనున్నారు. ఏడాదికి రూ.వెయ్యి చొప్పున ఇంక్రిమెంట్ అమలు చేయనున్నట్టు వెల్లడించారు. మన ఆదాయం అంతా మన ప్రజలకు చెందాలనే లక్ష్యంతోనే ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడామని, పోరాడి తెచ్చుకున్న రాష్ట్రంలో ఎవరూ వెట్టిచాకిరీ చేయకూడదని సీఎం అన్నారు.
ప్రత్యేక పరీక్షతో కానిస్టేబుళ్లుగా నియామకం
‘చాలా విభాగాల్లో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బంది వేలల్లో ఉన్నారు. అసలు పరిస్థితి మీకు అర్థం కావాలనే అందరినీ పిలిపించుకుని మాట్లాడుతున్నాను. హోంగార్డులను క్రమబద్ధీకరించేందుకు గతంలో మూడు రాష్ట్రాలు ప్రయత్నించాయి. అయితే, వాటిని కోర్టులు కొట్టివేశాయి. రోస్టర్ విధానం లేకుండా ఎలాంటి నియామకాల ప్రక్రియ జరగకూడదు. ఈ రోజు నుంచి ప్రత్యేక కానిస్టేబుళ్ల నియామకాలకు రిజర్వేషన్లు కల్పిస్తాం. కానిస్టేబుళ్ల నియామకాల్లో ప్రస్తుతమున్న రిజర్వేషన్లను 10 నుంచి 25 శాతానికి పెంచుతాం. రోస్టర్ అమలు చేస్తూనే హోంగార్డుల నియామకాల్లో అధికారులు కాస్త దయ చూపాలి. సాధారణ అభ్యర్థులతో కాకుండా హోంగార్డులకు ప్రత్యేకంగా పరీక్ష నిర్వహించాలి’అని సీఎం అన్నారు. రాష్ట్రంలో ఒప్పంద అధ్యాపకులు, ఇతర సిబ్బందిని శాశ్వత ఉద్యోగులుగా మార్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వం చేసే మంచి పనులపై ప్రతిపక్షాలు కోర్టుల్లో కేసులు వేసి అడ్డుకుంటున్నాయని విమర్శించారు.
సీఎంకు శ్రీనివాస్‌గౌడ్ కృతజ్ఞతలు
సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న హోంగార్డుల సమస్యలను పరిష్కరించినందుకు సీఎంకు హోంగార్డుల అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. బుధవారం సచివాలయం మీడియా పాయింట్‌లో మాట్లాడుతూ హోంగార్డులకు గౌరవప్రదమైన నెలసరి వేతనం 12 వేల నుండి 20 వేలకు పెంచడంతో పాటు, డబుల్ బెడ్రూమ్స్, రిక్రూట్‌మెంట్‌లో వారికి ప్రత్యేక అవకాశం కల్పించడం అభినందనీయమన్నారు. అనంతరం హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డిని కలసి కృతజ్ఞతలు తెలియజేశారు.
ముఖ్యమంత్రికి డీజీపీ కృతజ్ఞతలు
అతి తక్కువ జీతాలతో పనిచేస్తున్న హోంగార్డుల ఇబ్బందులను మానవత్వంతో అర్థం చేసుకుని ముఖ్యమంత్రి చారిత్రక నిర్ణయం తీసుకున్నారని డీజీపీ మహేందర్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. పోలీసు వ్యవస్థను బలోపేతం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచి అత్యంత ప్రాధాన్యమిస్తున్నదని అన్నారు. హోంగార్డులపై వరాల జల్లు కురిపించిన సీఎంకు రాష్ట్ర పోలీసు అధికారుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు యేదుల గోపిరెడ్డి ధన్యవాదాలు తెలిపారు.
హోంగార్డులపై సీఎం కేసీఆర్ వరాల జల్లు
Comments
Please login to add a commentAdd a comment