సమనకేర్‌.. సంప్రదాయ వేడుక | samanacare.. it's a festival | Sakshi
Sakshi News home page

సమనకేర్‌.. సంప్రదాయ వేడుక

Published Sun, Jul 31 2016 11:17 PM | Last Updated on Mon, Sep 4 2017 7:13 AM

సమనకేర్‌.. సంప్రదాయ వేడుక

సమనకేర్‌.. సంప్రదాయ వేడుక

– గిరిజనుల పండగ 
– అంటువ్యాధులు ప్రబలకుండా  కుల దైవానికి వేడుకోలు
– జిల్లాలోని 61 తండాల్లో వేడుక
– ఈ నెల చివరి వరకు పూజలు
 
కర్నూలు సీక్యాంప్‌:
సమనకేర్‌..ఇదో గిరిజన పండగ. ఊరూవాడ, పిల్లాజల్లా అందరూ బాగుండాలని ప్రతీ సంవత్సరం భక్తిశ్రద్ధలతో నిర్వహించే వేడుక. జిల్లాలోని 61 తండాల్లో ఉత్సవ నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆదివారం ప్రారంభమైన పూజలు ఆగస్టు నెల ఆఖరు వరకు కొనసాగనున్నాయి. ఈ నేపథ్యంలో సమనకేర్‌ ప్రత్యేక, విశిష్టతలపై ప్రత్యేక కథనం   
సమన అంటే ఊరి బయట అని అర్థం. ఊరి చివరికి వెళ్లి అమ్మవారికి యాటను బలి ఇచ్చి అక్కడ అన్ని కుటుంబాలు వెళ్లి సామూహిక విందును ఆరగిస్తారు. ఊరి చివరకు వెళ్లి తిని వచ్చిన అనంతరం గ్రామంలో దోమలను, ఈగలను అమ్మవారు గ్రామం బయటకు పంపేస్తారని వారి విశ్వాసం. తర్వాత దోమలు, ఈగల ద్వారా రోగాలు ప్రబలబోవని వారి నమ్మకం. ప్రతీ ఏడాది ఈ పండుగ నిర్వహిస్తారు. పూర్వాకాలంలో దోమలు, ఈగలతో కలరా, మలేరియా లాంటి అంటురోగాలు ప్రబలి జనం మత్యవాత పడేవారు. దీంతో గిరిజనులు తమ కుల దైవం దండిమారెమ్మ, గిరిజనుల గురువు సేవాలాల్‌ మహరాజ్‌కు పూజలు నిర్వహించారు. అప్పటి నుంచి రోగాలు దరిచేరలేదని..అందుకే ఏటా ఈ పండగను జరుపుకుంటామని గిరిజన పెద్దలు చెబుతున్నారు. 
పూజలు ఇలా చేస్తారు...
గిరిజనుల కుల దైవం దండి మారెమ్మ తల్లికి యాటను బలి ఇచ్చి నైవేద్యం సమర్పిస్తారు. వారి గురువు సేవాలాల్‌ మహరాజ్‌కు బెల్లంతో తయారు చేసిన అన్నం నైవేద్యంగా పెడతారు. అనంతరం దేవతలకు తమ గ్రామంలో, తమ కులంలో, రాష్ట్రంలో ఉన్న సమస్యలు చెప్పి బాధా తప్ప హదయాలతో వాటిని తీర్చాలని కోరుతారు. అనంతరం సామూహిక భోజనం చేస్తారు. 
 
ప్రభుత్వం గుర్తించాలి: రాంనాయక్‌ లంబాడీ కులం పెద్ద
  తెలంగాణ ప్రభుత్వం ఈ పండగను అధికారికంగా నిర్వహిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఈ పండగను గుర్తించలేదు. గిరిజనులు భక్తి శ్రద్ధలతో ఈ పండుగ జరుపుకుంటారు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాం కాబట్టి అన్ని పండుగలతో పాటు సమానంగా మాకు సమనకేర్‌ కానుకలు ఇవ్వాలి.
అంటురోగాలు ప్రబలకుండా ప్రార్థిస్తాం: హాషాబాయ్‌
 పూసల కార్తెలో అంటురోగాలు ప్రబలకుండా సమనకేర్‌ పూజ చేస్తాం. దేశవ్యాప్తంగా గిరిజనులు ఈ పండుగను నిర్వహిస్తారు. గ్రామంలో  ఈ సీజన్‌లో దోమల ద్వారా వచ్చే అంటురోగాలు ప్రబలకుండా అమ్మవారిని మొక్కుతాం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement