అయోధ్యలోని రామాలయంలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం 2024, జనవరి 22న జరగనుంది. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీతో సహా దేశంలోని పలువురు ప్రముఖులు పాల్గొననున్నారు. ‘రామనంది’ సంప్రదాయంలో అయోధ్య రామాలయంలో పూజలు నిర్వహిస్తున్నారు. ఈ సంప్రదాయం భవిష్యత్తులోనూ కొనసాగనుంది. ఇంతకీ ‘రామనంది’ శాఖను ఎవరు స్థాపించారు? ఈ సంప్రదాయంలోని నియమాలు ఏమిటి?
రామనంది శాఖను జగత్గురు శ్రీ రామానందాచార్య స్థాపించారు. ఈ శాఖ బైరాగిల నాలుగు పురాతన శాఖలలో ఒకటి. దీనిని బైరాగి శాఖ, రామవత్ శాఖ, శ్రీ శాఖ అని కూడా పిలుస్తారు. కాశీలోని పంచగంగా ఘాట్ వద్ద రామనంది శాఖకు చెందిన పురాతన మఠం కూడా ఉంది. ఈ శాఖకు చెందిన వారు ప్రధానంగా శ్రీరాముని పూజిస్తారు. ఈ శాఖలోని వారు జపించే మంత్రం ‘ఓం శ్రీరామాయ నమః’ ఈ శాఖను అనుసరించేవారు శుక్లశ్రీ, బిందుశ్రీ, రక్తశ్రీ మొదలైన తిలకాలను ధరిస్తారు.
రామనంది శాఖకు శ్రీరాముడు ప్రధాన దైవం. ఈ వర్గానికి చెందిన వారు బాలునిరూపంలోని శ్రీరాముని పూజిస్తారు. అంటే చిన్నపిల్లలను ఎంత అల్లారుముద్దుగా చూసుకుంటారో అదేవిధమైన తీరులో భగవంతుని పూజిస్తారు. వీరు పూజా విధానంలో బాలరాముడిని ప్రతిరోజూ ఆకర్షణీయంగా అలంకరిస్తారు. శ్రీరాముని చిన్న పిల్లవానిగా భావించి.. ఉదయాన్నే నిద్ర లేవడం, స్నానం చేయించడం, గోరుముద్దలను తినిపించడం లాంటివి తమ పూజా విధానంలో భాగంగా ఆచరిస్తుంటారు.
రామనంది శాఖ కొన్ని వందల ఏళ్లుగా అయోధ్యలోని రామాలయంలో పూజలు నిర్వహిస్తోంది. నూతన రామాలయంలో కూడా బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ అనంతరం రామనంది వర్గానికి చెందిన పూజారులే ఇక్కడ సమస్త పూజలు చేయనున్నారు.
ఇది కూడా చదవండి: అయోధ్యకు రాకండి!
Comments
Please login to add a commentAdd a comment