ఎడ్లబండి టు హెలికాప్టర్
ఆదివాసీ జాతరకు
ఆధునిక పోకడలు
మరిన్ని సౌకర్యాలకు రూపకల్పన
వరంగల్ : మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర సౌకర్యాల విషయంలో రోజురోజుకు అధునికతను సంతరించుకుంటోంది. రెండు దశాబ్దాల క్రితం ఎడ్లబండ్లతో మేడారం జాత ర జరిగే ప్రాంతమంతా నిండిపోయేది. కాల క్రమేణా రవాణ వ్యవస్థ మెరుగుపడుతున్న కొద్ది కొత్తకొత్త వాహనాలు జాతరకు రావడం ప్రారంభమైంది. గిరిజన జాతర కావడంతో సుదూర గిరిజన ప్రాంతాల్లో గ్రామాలకు చెం దిన ఆదివాసీలు, ఇతర సామాజిక వర్గాలకు చెందిన భక్తులు జాతర జరిగే సమయానికి వారం రోజుల ముందే ఎడ్లబండ్లల్లో ప్రయాణం ప్రారంభించేవారు.జంపన్నవాగుపై బ్రిడ్జి నిర్మాణంతో రవాణా సౌకర్యం మెరుగుపడింది.
మేడారంను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం నిధుల కేటాయింపులను రెట్టింపు చేసింది. ఎడ్ల బండ్లతో ప్రారంభమైన జాతరకు ఆర్టీసీ బస్సులేగాక ఆటోలు, మాక్స్‌క్యాబ్‌లు, గ్రామీ ణ ప్రాంతాలకు చెందిన రైతులు వారి సొంత ట్రాక్టర్లు, టాటాఏస్ ట్రాలీల్లో జాతరకు రెండు, మూడు రోజుల ముందే వచ్చి జంపన్నవాగు తీరంలో బస ఏర్పాటు చేసుకుంటున్నారు. పర్యాటకులను ఆకర్షించేందుకు పర్యాటక అభివృద్ధి సంస్థ హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ సర్వీసులు ప్రారంభించింది. అమ్మవార్ల గద్దెలకు గ్రానైట్‌తో ఫ్లోరింగ్, స్టీల్‌తో బారికేడ్లు నిర్మించడంతో మరింత శోభను సంతరించు కుంది. జాతర సమయంలోనేగాక నిత్యం గద్దెల వద్దకు భక్తులు వచ్చేందుకు మరిన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు తయారుచేస్తోంది.