ఇది ఆరో అవకాశం
జాతరలో సేవలు అందించడం ఆనందాన్నిస్తుంది
2006లో సీఐ హోదాలో ట్రాఫిక్ సంస్కరణలతో గుర్తింపు
భక్తుల సౌకర్యమే లక్ష్యం
సీఎం సెక్యూరిటీ వింగ్ డీఎస్పీ దక్షిణామూర్తి
ఆయన అంకితభా వం, సేవానిరతి గల పోలీసు అధికారి. 2006 సంవత్సరంలో ఏటూరునాగారం సీఐ హోదాలో మేడారంలో తల్లుల సన్నిధిలో బందోబస్తు విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రి సెక్యూరిటీ వింగ్ డీఎస్పీగా కీలక బాధ్యతలు నెరవేరుస్తున్నారు దక్షిణామూర్తి. వరుసగా ఆరోసారి తల్లులకు సేవ చేసే అవకాశం దక్కడం ఎంతో సంతోషాన్ని ఇస్తోందని చెబుతున్న ఆయన ‘సాక్షి’తో తన మనోగతాన్ని పంచుకున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
నేను సెంట్రల్ క్రైం స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న సమయంలో తొలిసారి 2004లో మేడారం జాతర విధుల్లో పాల్గొనే అవకాశం లభించింది. అప్పట్లో తాడ్వాయి-మేడారం మధ్య ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో తాడ్వాయి నుంచి మేడారానికి చేరుకునేందుకు 14 గంటల సమయం పట్టిందంటే వాహనాల రాకపోకలు ఎంతగా నిలిచిపోయూయో అర్థం చేసుకోవచ్చు.
గుర్తింపు తెచ్చిన 2006 జాతర
2006 జాతర సమయానికి నేను ఏటూరునాగారం సర్కిల్ ఇన్స్‌పెక్టర్‌గా ఉన్నాను. అంతకుముందు జాతరలో ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకొని 2006లో రెండున్నర నెలల ముందు నుందే మేడారంలో ఉన్న భౌగోళిక పరిస్థితులపై పూర్తిగా అవగాహన తెచ్చుకున్నాను. అప్పుడు వరంగల్ ఎస్పీగా స్టీఫెన్ రవీంద్ర, ములుగు ఏఎస్పీగా రాజేశ్‌కుమార్‌లు పని చేస్తున్నారు. వీరి సూచనల పేరకు ట్రాఫిక్‌ను పకడ్బందీగా క్రమబద్ధీకరించేందుకు పక్కా ప్రణాళిక రూపొందించాను. అది మంచి ఫలితాలిచ్చింది.
ఆ రెండు అంశాలే కీలకం
మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరలో రెండు అంశాలు ప్రధానమైనవి. వీటిలో మొదటిది చిలకలగుట్ట నుంచి సమ్మక్క, కన్నెపల్లి నుంచి సారలమ్మను గద్దెలపైకి తీసుకురావడం. రెండోది జాతరకు వచ్చే భక్తుల రాకపోకలు సాఫీగా జరగడం. జంపన్నవాగుపై ఉన్న ఒకే వంతెనపై ట్రాఫిక్ భారం ఎక్కువ పడుతుండటంతో కొత్తూరు-మేడారం గ్రామాల మధ్య కొత్తగా మరో వంతెన నిర్మించాలని సూచించాం. ఈ మార్పుతో ట్రాఫిక్‌ను సాఫీగా దారి మళ్లించేందుకు అవకాశం లభించింది.
వన దేవతలు గద్దెలపైకి వచ్చేటప్పుడు..
జాతరలో వనదేవతలను గద్దెలపైకి తీసుకురావడం పోలీసు విధుల్లో అత్యంక కీలకం. ఇక్కడ చిన్నపాటి తేడా వచ్చినా ప్రభుత్వ యంత్రాంగానికి చెడ్డపేరు వస్తుంది. కాబట్టి విధి నిర్వహణలో మాపై ఎంతో ఒత్తిడి ఉంటుంది. సమ్మక్క-సారలమ్మలను తీసుకొచ్చేప్పుడు రోప్ పార్టీలో కేవలం పూజారులనే అనుమతించాలని అప్పట్లో నేను తీసుకున్న నిర్ణయం ఫలించింది. రోప్ పార్టీకి అవత ల పోలీసులు రక్షణగా ఉంచాను. దీంతో భక్తుల హడావుడి బాగా తగ్గింది. దీంతో పూజారులు ప్రశాంతంగా వనదేవతలను గద్దెలపైకి తీసుకొస్తున్నారు. ఇప్పటికీ అదే వ్యూహాన్ని పోలీసులు అమలుచేస్తున్నారు.