ఇసకేస్తే రూ.కోట్లు!
► జీవీఎంసీలో ఇసుకాసురుల దందా
► ఉచిత ఇసుకకూ అనుచిత వసూళ్లు
► శ్రీకాకుళం జిల్లా పొందూరు నుంచి ఇసుక రవాణా
► దానికి అనుమతి పేరుతో దోచేస్తున్న అధికారులు
► ట్రిప్పునకు రూ.500 ఇస్తేనే స్లిప్పు
► ప్రతిరోజూ వందలాది ట్రిప్పులు
మహా విశాఖ నగరపాలక సంస్థ(జీవీఎంసీ)లో పనిచేసిన పాము పాండురంగారావు రూ. వందల కోట్ల అక్రమాస్తులు కూడబెట్టారంటే మొదట్లో ఎవరికీ నమ్మబుద్ధి కాలేదు.. కూసింత బయటపడితే.. చింపి చేటంత చేస్తారన్న వ్యాఖ్యలు వినిపించాయి.. కానీ పక్కా ఆధారాలతో వెల్లడైన ఆస్తుల లెక్కలు.. అందరి కళ్లూ అంటుకుపోయేలా చేశాయి.. ఇప్పుడిదంతా ఎందుకంటే.. జీవీఎంసీలో అలాంటి అవినీతి ‘కట్టల’ పాములు ఇంకా చాలానే ఉన్నాయి మరి.. ప్రతి పనిలోనూ కాసులు వెతుక్కొని కోట్లు కూడబెట్టేవారు ఇంకెంతో మంది ఉన్నారు.. అంతెందుకు.. ప్రభుత్వం ఇసుక సరఫరాను ఉచితం చేసినా.. అందులోనూ రూ. కోట్ల కుప్పలు పోగేసుకోగల ఘనులు.. మన జీవీఎంసీ అధికారులు! రవాణాకు అనుమతుల పేరుతో.. ట్రిప్పునకు ఇంత అని రేటు పెట్టి మరీ అక్రమార్జనకు పాల్పడుతున్నారు.
అదెలాగంటే...
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : గతంలో ఇసుక రీచ్‌ల నిర్వహణలో అక్రమాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తడం.. ఇసుక కొరత నెలకొనడం వంటి కారణాలతో ప్రభుత్వం ఉచితంగా ఇసుక పంపిణీ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఎక్కడో ఏమో గానీ.. జీవీఎంసీ అధికారులకు మాత్రం ఈ విధానం ‘ఉచిత’ సంపాదన మార్గంగా మారింది. అడ్డదారిలో రూ.కోట్లు సంపాదించిపెడుతోంది. జీవీఎంసీ పరిధిలో భారీ స్థా?ఇలో భవన నిర్మాణాలు జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ ఇసుక కొరత తీవ్రమైంది.
జిల్లాలో ఏ రీచ్‌లోనూ ఇసుక లభ్యం కాని పరిస్థితుల్లో కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి అక్కడి రీచ్‌ల నుంచి ఇసుక తెప్పిస్తున్నారు. ఈ మేరకు జీవీఎంసీ పరిధిలోని నిర్మాణాలకు అవసరమైన ఇసుకను శ్రీకాకుళం జిల్లాలోని పొందూరు మండలం ముద్దాడ, పింగూరు రీచ్‌ల నుంచి తీసుకునేందుకు అనుమతులు పొందారు. అక్కడ కూడా పూర్తి ఉచితంగానే ఇసుక పంపిణీ చేస్తారు. అయితే రవాణా ఖర్చులు మాత్రం వినియోగరారుడే భరించాలి. ఈ క్రమంలో కార్పొరేషన్ పరిధిలో నిర్మాణ పనులు చేస్తున్న కాంట్రాక్టర్లు తమకు అవసరమైన ఇసుక కోసం కార్పొరేషన్ అధికారుల నుంచి సిఫారసు చేయించుకోవాల్సి ఉంటుంది. సరిగ్గా దీన్నే అవకాశంగా తీసుకొని జీవీఎంసీ అధికారులు దోపిడీ పర్వానికి తెర తీశారు
ఇసుక కావాల్సిన కాంట్రాక్టర్లు జీవీఎంసీ ఇంజినీరింగ్ విభాగాన్ని సంప్రదించాలి. తమ నిర్మాణాలకు సంబంధించి ఎన్ని ట్రిప్పుల ఇసుక కావాలో ముందుగా తెలియజేయాలి. ఆ మేరకు ఇంజినీరింగ్ అధికారులు పరిశీలించి సదరు కాంట్రాక్టర్లకు స్లిప్‌లు అందిస్తారు. ఆ స్లిప్ తీసుకుని పొందూరు మండలంలోని రీచ్‌కు వెళ్తే అక్కడ ఉచితంగా ఇసుక పంపిణీ చేస్తారు. కానీ కార్పొరేషన్ అధికారులు ట్రిప్పునకు రూ. 500 చొప్పున వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది.
రోజుకు ఎన్ని ట్రిప్పులు తిరిగితే అన్ని రూ.500 వాళ్లకు ముట్టజెప్పాల్సిందే. అసలే తీవ్రమైన ఇసుక కొరతతో ఎక్కడికక్కడ పనులు నిలిచిపోయిన తరుణంలో కాంట్రాక్టర్లు మారు మాట్లాడకుండా ట్రిప్పుకు 500 చొప్పున ఇచ్చి స్లిప్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇలా రోజుకు 300 నుంచి 400 ట్రిప్పులు పొందూరు మండలం నుంచి వస్తున్నాయి. దీన్ని బట్టి జీవీఎంసీ అధికారులు ఉచిత ఇసుక పంపిణీ ద్వారా ఎంత కొల్లగొడుతున్నారో ఇట్టే అర్ధం చేసుకోవచ్చు.
కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ఏం చేస్తున్నట్టు?
ఉచిత ఇసుక వ్యవహారంలోనూ జీవీఎంసీ అధికారులు కాసులు వెతుక్కుంటుంటే కాంట్రాక్టర్స్ అసోసియేన్ ఏం చేస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓ దశలో కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ద్వారా స్లిప్‌లు అందించే పని చేపట్టారు. అయితే అసోసియేషన్‌లోని కొందరు.. అవినీతి అధికారులతో కుమ్మక్కై.. స్లిప్ రాస్తే తమకూ వాటా ఇవ్వాలని డిమాండ్ చేశారన్న ఆరోపణలు వచ్చాయి. వాళ్లకు కొంత.. వీళ్లకు కొంత అంటూ అటు అసోసియేషన్.. ఇటు అధికారులు వాటాలు వేసుకుని డబ్బులు డిమాండ్ చేస్తున్నా విధి లేని పరిస్థితుల్లో కాంట్రాక్టర్లు ఎవరికివ్వాల్సింది వారికి ఇచ్చేస్తున్నట్టు తెలుస్తోంది.