సారోదయం | sara prepared in dharmavaram | Sakshi
Sakshi News home page

సారోదయం

Published Thu, Aug 10 2017 10:28 PM | Last Updated on Sun, Sep 17 2017 5:23 PM

సారోదయం

సారోదయం

బెల్టు తీయరు.. ఘాటు తగ్గదు
- ధర్మవరం కేంద్రంగా సారా తయారీ
- కామిరెడ్డిపల్లి తోటల్లో నాటు గుప్పు
- అధికార పార్టీ నేతల కనుసన్నల్లో వ్యవహారం
- చూసీచూడనట్లుగా ఎక్సైజ్‌ అధికారులు
- ఫలితాలివ్వని నవోదయం


65 - ధర్మవరం పంచాయతీలు
6 - మద్యం దుకాణాలు
90 - బెల్టు షాపులు
3 - నాటుసారా తయారీ గ్రామాలు


ఈ ఫొటోలో కనిపిస్తున్న నాటుసారా బట్టీ ధర్మవరం మండలం కామిరెడ్డిపల్లి గ్రామంలోనిది. ఓ టీడీపీ నాయకుడు తన తోటలో ఈ బట్టీ ఏర్పాటు చేసి సారా కాస్తున్నాడు. ఇదే ప్రాంతంలో ఆరేడు బట్టీలతో నిరంతరాయంగా సారా తయారీ సాగుతోంది. జిల్లాలోని పలు ప్రాంతాలకు ఇక్కడి నుంచే సారాను తరలిస్తున్నారు. ఫ్యాక‌్షన్‌ ప్రభావిత గ్రామం కావడంతో ఇక్కడ పోలీసు పికెట్‌ కొనసాగుతోంది. అయినప్పటికీ నాటుసారాకు అడ్డుకట్ట పడకపోవడం గమనార్హం.

ధర్మవరం: నవోదయం.. నినాదంగానే మిగిలిపోతోంది. మద్యం బెల్టు షాపులపై ఉక్కుపాదం మోపుతాం.. నాటుసారా తయారీని సమూలంగా నిర్మూలిస్తామనే ఎక్సైజ్‌ శాఖ ప్రతిన నీరుగారుతోంది. జిల్లాలో ఎక్కడ చూసినా నాటుసారా ఏరులై పారుతోంది. పెట్టుబడి తక్కువ.. ఆదాయం ఎక్కువగా ఉండటంతో అధికార పార్టీ నాయకులు కొందరు ఆ దిశగా వ్యాపారం సాగిస్తున్నారు. సారా తయారీకి ధర్మవరం నియోజకవర్గం కేంద్రంగా మారింది.

మండల పరిధిలోని కామిరెడ్డిపల్లి, ఓబుళనాయునిపల్లి, నేలకోట తండాలలో నాటుసారా తయారీ యథేచ్ఛగా సాగుతోంది. ముఖ్యంగా కామిరెడ్డిపల్లిలోని అధికార పార్టీ నేతలకు ఈ దందా ప్రధాన ఆదాయ వనరుగా ఉంది. ఎక్సైజ్‌ అధికారులు చేస్తున్న దాడులు నామమాత్రం కావడంతో సారా తయారీకి అడ్డుకట్ట పడని పరిస్థితి. ధర్మవరం ఎక్సైజ్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో గతనెల 19 నుంచి ఇప్పటి వరకు తొమ్మిది మందిపై కేసులు నమోదు చేశారు. 73 మందిని తహసీల్దార్ల ఎదుట బైండోవర్‌ చేశారు. అయినప్పటికీ పరిస్థితిలో మార్పు రాకపోవడం గమనార్హం. నాటుసారా కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో గొడవలు చోటు చేసుకుంటూ.. హత్యలకు దారి తీస్తున్న ఘటనలు కూడా ఉంటున్నాయి.

నవోదయం నామమాత్రమే?
నవోదయం కార్యక్రమం ద్వారా నాటుసారా తయారీని నిర్మూలించాల్సిన ఎక్సైజ్‌ అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా నాటుసారా తయారీ మొత్తం అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లో జరుగుతుండటంతో చర్యలకు వెనుకంజ వేస్తున్నారు. ఉన్నతాధికారుల నుంచి ఒత్తిళ్లు వచ్చినప్పుడు మాత్రమే అడపాదడపా తయారీ ప్రాంతాలకు వెళ్లడం.. అక్కడున్న తయారీ సామగ్రిని చిందవందర చేయడంతో మమ అనిపిస్తున్నారు. ఇదిలాఉంటే సారా తయారీ ప్రాంతానికి నలువైపులా ప్రత్యేకంగా మనుషులను ఏర్పాటు చేసుకుని దందా సాగిస్తున్నారు. అరకిలోమీటరు పరిధిలో కొత్త వ్యక్తులు ఎవరు వచ్చినా అప్రమత్తం చేసేలా ఏర్పాటు చేసుకున్నారు. ఇకపోతే మండలాల పరిధిలోని దుకాణాల నుంచి బెల్టు షాపులకు మద్యం సరఫరా అవుతోంది.

నేతలకు ఆదాయమార్గం
ప్రస్తుత కరువు పరిస్థితుల్లో మందుబాబులు వందల రూపాయలు ఖర్చు చేసి మద్యం సేవించలేక, నాటుసారాకు అలవాటుపడినట్లు తెలుస్తోంది. రూపాయి పెట్టుబడి పెడితే రూ.20 లాభం వస్తుండటంతో అధికార పార్టీ నేతలు కొందరు సారా తయారీని ఆదాయ మార్గంగా ఎంచుకున్నారు. ధర్మవరం మండలం కామిరెడ్డిపల్లి గ్రామ సమీపంలోని కంపచెట్లలో నాటుసారాను తయారు చేసి అనంతపురం, ధర్మవరం, కనగానపల్లి, రామగిరి, బత్తలపల్లి మండలాల్లో విక్రయిస్తున్నారు. తయారు చేసిన సారాను అక్కడే ప్యాకెట్లుగా మార్చి, పాత ద్విచక్రవాహనాల్లో తరలిస్తున్నారు. ధర్మవరం పట్టణంలోని దుర్గానగర్, శారదానగర్, సుందరయ్యనగర్, గుట్టకిందపల్లి, కొత్తపేటల్లో, అనంపురంలో రాణినగర్, టీవీటవర్‌ కొట్టాల, రుద్రంపేట, లెనిన్‌నగర్‌లలో సారా విక్రయాలు జోరుగా సాగుతున్నాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement