ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్:గ్రామ రెవెన్యూ అధికారులు (వీఆర్వో), గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్‌ఏ) పరీక్ష ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతి ఈ ఫలితాలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. వీఆర్వో విభాగంలో మణుగూరు మండలం సమితి సింగారం గ్రామానికి చెందిన కోటగిరి సతీష్ (హాల్‌టికెట్ నంబర్ 122129713) 97 మార్కులతో జిల్లాస్థాయిలో ప్రథముడిగా నిలిచారు. వీఆర్‌ఏ కేటగిరీలో కూసుమంచి మండల కేంద్రానికి చెందిన కొమ్ము బాబూరావు (హాల్‌టికెట్ నం. 222100093) 93 మార్కులతో ప్రథమస్థానం పొందారు. చర్ల మండలం ఆర్.కొత్తగూడెంకు చెందిన తిప్పనబోయిన విష్ణునారాయణ వీఆర్వో విభాగంలో రెండో ర్యాంకు, తల్లాడ మండలం నారాయణపురానికి చెందిన సౌజన్య మూడో ర్యాంకు, బయ్యారం మండలం కొత్తపేట వాసి పాతూరి సందీప్ నాల్గో ర్యాంకు, తల్లాడ మండలం నారాయణపురానికే చెందిన మరో అభ్యర్థి వి. అంకిరెడ్డి ఐదోర్యాంకు సాధిం చారు.
తీవ్ర పోటీ నెలకొన్ని వీఆర్వో కేటగిరీలో తొలి 20 ర్యాంకులు సాధించిన వారిలో అత్యధికులు బీసీ-డీ కేటగిరీకి చెందిన వారే ఉన్నారు. టాప్‌లో 20లో బీసీ-డీకి చెందినవారు ఎనిమిది మంది ఉండటం గమనార్హం. వీఆర్‌ఏ కేటగిరీ లో కూసుమంచికి చెందిన బాబూరావు ప్రథమస్థానంలో నిలిచారు. ఈ ఉద్యోగాలకు సంబంధించి జిల్లాస్థాయి ర్యాంకులు ఉండవని, గ్రా మాలు యూనిట్‌గా తీసుకుని మెరిట్ లిస్టును ప్రకటిస్తామని రెవెన్యూ అధికారులు తెలిపారు.
తుదిజాబితా కోసం కసరత్తు..
జిల్లా కలెక్టర్ శ్రీనివాసశ్రీనరేశ్ శనివారం సాయంత్రం తన క్యాంప్ కార్యాలయంలో వీఆర్వో, వీఆర్‌ఏ ఫలితాల సీడీని ఆవిష్కరించారు. వీటి ఆధారంగా ఆయా పోస్టులను భర్తీ చేసేందుకు జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయిలో కసరత్తు చేస్తోంది. జాయింట్ కలెక్టర్ కె.సురేంద్రమోహన్ ఆధ్వర్యంలో జిల్లా ఉన్నతాధికారులు త్వరలో ఉద్యోగ నియామకపత్రాలు అందించేందుకు కృషి చేస్తున్నారు. ఆది లేదా సోమవారం ఉద్యోగాాలు పొందినవారి జాబితా విడుదలయ్యే అవకాశాలున్నాయి.
మైదాన, షెడ్యూల్ ఏరియాలో వేర్వేరుగా...
ఈ నెల 2న నిర్వహించిన వీఆర్వో, వీఆర్‌ఏ పరీక్షలకు జిల్లావ్యాప్తంగా 73,260 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. 65,480 మంది పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 78 వీఆర్వో పోస్టులకు 62,752 మంది హాజరయ్యారు. 105 వీఆర్‌ఏ పొఓస్టులకు 2,752 మంది హాజరయ్యారు. అర్హత సాధించిన అభ్యర్థుల వీఆర్వో ఉద్యోగాలకు మైదానప్రాంతంలో ఒక్కో పోస్టుకు ఒకరి చొప్పున (1:1), షెడ్యూల్ ఏరి యాలో 1:3 నిష్పత్తిలో సర్టిఫికెట్ల పరిశీలనకు పిలుస్తారు. వీఆర్‌ఏ ఉద్యోగాలకు 1:5 నిష్పత్తిలో అభ్యర్థుల జాబితాను తయారు చేస్తారు.
పనిచేయని సర్వర్లు..
జిల్లాలో ఇంటర్నెట్ సర్వర్లు పనిచేయకపోవడంతో వీఆర్వో, వీఆర్‌ఏ ఫలితాలు తెలుసుకోవడం కోసం అభ్యర్థులు ఇబ్బందులు పడ్డారు. జిల్లాలో అత్యధిక మార్కుల జాబితాను తెలుసుకునేందుకు నానా తంటాలు పడాల్సి వచ్చింది. చివరకు త్రీజీ సెల్‌ఫోన్స్ సహాయంతో జాబితాను తెలుసుకోవాల్సి వచ్చింది.