విలేకరులతో మాట్లాడుతున్న సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ధనుంజయరావు
– మూడేళ్లలో ఎస్సీ హాస్టళ్లు ఖాళీ
– విద్యార్థులను రెసిడెన్షియల్ పాఠశాలల్లో చేర్పిస్తాం
– సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ధనుంజయరావు
లావేరు: మూడేళ్లలో జిల్లాలోని అన్ని ఎస్సీ హాస్టళ్లను ఎత్తివేస్తామని సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ కె.ధనుంజయరావు అన్నారు. మండలంలోని లావేరు హైస్కూల్‌కు సోమవారం వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. గత ఏడాది జిల్లాలో 12 ఎస్సీ హాస్టల్స్ ఎత్తివేశామని, ఈ ఏడాది జిల్లాలోని లావేరు, ఇచ్చాపురం మండలాల్లో గల ఎస్సీ బాలికల హాస్టల్స్, నీలానగరం, సీతంపేట, శ్రీకాకుళం అర్బన్, అక్కుపల్లి, జి.సిగడాం, డోలపేట గ్రామాల్లో గల ఎస్సీ బాలుర హాస్టల్స్‌ను ఎత్తివేస్తామని తెలిపారు. ఇంకా జిల్లాలో 41 ఎస్సీ హాస్టల్స్ పనిచేస్తున్నాయని వాటిన్నింటినీ మూడేళ్లలో దశల వారీగా ఎత్తి వేస్తామన్నారు. ఇక్కడి విద్యార్థులను జిల్లాలో ఉన్న 12 ఎస్సీ రెసిడెన్షియల్ హాస్టల్స్‌లో చేర్పిస్తామన్నారు. షెడ్యూల్ కులాలు విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడం కోసమే హాస్టల్స్‌ను ఎత్తివేస్తున్నామని తెలిపారు. రెసిడెన్షియల్ పాఠశాలల్లో అదనపు పాఠశాల భవనాలు నిర్మించడం కోసం జిల్లాకు రూ.21.03 కోట్లు నిదులు మంజూరు చేశామని చెప్పారు. హాస్టళ్లు మూతబడితే అక్కడ పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ సిబ్బందినీ తీసేస్తామని స్పష్టం చేశారు. రెగ్యులర్ వార్డెన్‌లు, ఉద్యోగులను రెసిడెన్షియల్ హాస్టల్స్‌కు, వేరే శాఖల్లోను నియమించడం జరుగుతుందన్నారు. ఆయనతో పాటు రణస్థలం ఎస్సీ బాలికల హాస్టల్ వార్డెన్ కె.సుజాత ఉన్నారు.