- మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్‌లో విషాదం
- ఆడుకుంటూ బస్సు వద్దకు వెళ్లిన నందిని
- వెనుక టైరు కింద పడి ప్రాణాలు వదిలిన చిన్నారి
షాద్‌నగర్: తుళ్లుతూ, నవ్వుతూ ఆడుకుంటు న్న చిన్నారి.. ఆడుతూ ఆడుతూ ఇంటి బయటకు వెళ్లింది.. పిల్లలంతా స్కూలు బస్సు ఎక్కుతుంటే చూసి దాని దగ్గరికి వెళ్లింది.. ఇది చూడకుండా డ్రైవర్ నిర్లక్ష్యంగా ముందుకు పోనివ్వడంతో బస్సు వెనుక చక్రాల కిందపడి నలిగిపోయింది.. కన్నవారికి కన్నీటిని మిగుల్చుతూ అక్కడికక్కడే తుదిశ్వాస విడిచింది. శనివారం మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్‌లో ఈ విషాదం చోటు చేసుకుంది. షాద్‌నగర్ పట్టణంలోని కాకతీయ పాఠశాల బస్సు విద్యార్థులను తీసుకొచ్చేందుకు శనివారం ఉదయం ఫరూఖ్‌నగర్‌కు వెళ్లింది. అక్కడి నుంచి తిరిగి వస్తూ మధ్యలో ఈద్గా ప్రాంతం లో మరి కొందరు విద్యార్థులను ఎక్కించుకునేందుకు డ్రైవర్ బస్సును ఆపాడు.
ఆ పక్కనే నివాసముంటున్న కొత్త లక్ష్మయ్య, మానస దంపతుల కుమార్తె నందిని (2) ఆ సమయంలో ఆడుకుంటూ ఇంట్లోంచి బయటకు వచ్చి.. బస్సు దగ్గరగా వెళ్లింది. ఈ విషయాన్ని గమనించని డ్రైవర్ బస్సును ముందుకు నడిపాడు. దీంతో ఆ చిన్నారి బస్సు వెనుక టైరు కిందపడింది. ఒక్కసారిగా ఏదో శబ్దం రావడంతో డ్రైవర్, విద్యార్థులు బస్సు దిగి చూడగా.. చిన్నారి నందిని అప్పటికే ప్రాణాలు విడిచింది. అప్పటి వరకూ ఆడుతూ పాడుతూ ఉన్న తమ కుమార్తె మరణించడంతో ఆమె తల్లిదండ్రులు శోక సంద్రంలో మునిగిపోయారు. ప్రైవేట్ స్కూల్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతో చిన్నారి బలయిపోయిందంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిబంధనల ప్రకారం స్కూల్ విద్యార్థులను తీసుకెళ్లే బస్సులో క్లీనర్ కూడా ఉండాలని... ప్రమాదానికి కారణమైన బస్సులో క్లీనర్ లేడని మండిపడ్డారు. డ్రైవర్ నిర్లక్ష్యంతోపాటు క్లీనర్ లేకపోవడం కూడా ప్రమాదానికి కారణమని పేర్కొన్నారు. పాఠశాల యాజమాన్యంపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ ఎస్‌ఐ శ్రీనివాస్ తెలిపారు.