19 నుంచి జిల్లా వైజ్ఞానిక ప్రదర్శనలు
-
ప్రదర్శనలో 525 నమూనాలు
-
డీఈఓ రామలింగం
నెల్లూరు (టౌన్): ఈ నెల 19 నుంచి 21 వరకు జిల్లా వైజ్ఞానిక ప్రదర్శనలను నిర్వహించనున్నట్లు డీఈఓ మువ్వా రామలింగం తెలిపారు. సుబేదార్‌పేటలోని సెయింట్ జాన్స్ ఇంగ్లిష్ మీడియం హైస్కూల్లో బుధవారం అన్ని స్కూళ్ల ప్రధానోపాధ్యాయులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా వైజ్ఞానిక ప్రదర్శనలు సెయింట్ జాన్స్ ఇంగ్లిష్ మీడియం హైస్కూల్లో జరగనున్నాయని వెల్లడించారు. సైన్స్ ఫెయిర్‌లో మొత్తం 525 నమూనాలను ప్రదర్శించనున్నట్లు పేర్కొన్నారు. వైజ్ఞానిక ప్రదర్శనలకు వచ్చే ఉపాధ్యాయులు, విద్యార్థులకు భోజన, వసతి సౌకర్యాలను ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల నుంచి రోజుకు 10 వేల నుంచి 15 వేల మంది విద్యార్థులు సందర్శించే విధంగా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. జిల్లా వైజ్ఞానిక ప్రదర్శనను విజయవంతం చేసేందకు 18 కమిటీలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఒక్కో నమూనాకు రూ.5 వేలను కేంద్ర ప్రభుత్వం ఇవ్వనుందని తెలిపారు. ప్రారంభానికి కేంద్ర ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక విభాగ సలహాదారుడు సతీష్‌రెడ్డి హాజరవుతారని వివరించారు. ముగింపు రోజున మంత్రి నారాయణ హాజరవుతారని తెలిపారు. డిప్యూటీ డీఈఓలు షా అహ్మద్, మంజులాక్షి, యస్దానీ అహ్మద్, జిల్లా సైన్స్ అధికారి రాధారాణి, తదితరులు పాల్గొన్నారు.