
వైజాగ్‌లో ఒక్క సీన్ తీసినా సినిమా హిట్టే!
ప్రకృతి గీసిన చిత్రంలా ఉండే విశాఖ నిర్మాతలకు సెంటిమెంట్...
నిర్మాతలకు విశాఖ ఓ సెంటిమెంట్ - నటుడు బాలాజీ
ప్రకృతి గీసిన చిత్రంలా ఉండే విశాఖ నిర్మాతలకు సెంటిమెంట్ అని, ఇక్కడ ఒక్క సీన్ తీసినా ఆ సినిమా హిట్ అనే భావన వారిలో నాటుకుపోయిందని అన్నారు విలక్షణ నటుడు బాలాజీ. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు నగరానికి వచ్చిన ఆయన్ను సాక్షి పలకరించింది. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే.. – డాబాగార్డెన్స్ (విశాఖ దక్షిణ)
‘మగమహారాజు’ మేలి మలుపు
నేను సినీరంగంలో 1983లో అడుగుపెట్టాను. ఇప్పటివరకు వంద సినిమాలు చేశాను. మగమహారాజు సినిమా నా కెరీర్‌ను మలుపుతిప్పింది. ప్రస్తుతం బిచ్చగాడా మజాకా, భ్రమ, గోలీ సోడా సినిమాలతో పాటు, బాలకృష్ణతో ఓ సినిమా, త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాను. పక్కింటి అమ్మాయి, కుంకుమపువ్వు టీవీ సీరియల్స్‌లో నటిస్తున్నాను.
ఉత్తరాది కళాకారులతో ‘అల్లూరి’
అల్లూరి సీతారామరాజు సీరియల్ నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నాను. ఉత్తరాంధ్ర కళాకారులతోనే పూర్తిగా సీరియల్ నిర్మాణం జరుగుతుంది.
షూటింగ్‌కు విశాఖ అనుకూలం
చలనచిత్రాలు, సీరియల్స్ నిర్మాణానికి విశాఖ అనుకూలమైంది. ఇక్కడ సహజ సిద్ధమైన అందాలు ఉన్నాయి. చిత్ర నిర్మాతలకు విశాఖ ఒక వరం. ఇక్కడ చిత్రాలు నిర్మిస్తే అవి నూటికి నూరు శాతం విజయాన్ని సాధిస్తాయి. నిర్మాతలకు విశాఖ సెంటిమెంట్. ఇక్కడ ఒక్క సీను తీసినా చాలు ఆ సినిమా హిట్ అనే భావన నిర్మాతల్లో బాగా ఉంది.
స్టూడియో ఉంటే మరింత అభివృద్ధి
విశాఖలో చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ఏపీ స్టేట్ తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ ఫెడరేషన్ గౌరవాధ్యక్షుడిగా నా శాయశక్తులా కృషి చేస్తాను. ఇక్కడ చాలామంది కళాకారులు ఉన్నారు. ఇక్కడ అవకాశాలు తక్కువగా ఉండటంతో హైదరాబాద్‌లో ఉంటున్నారు. ఇక్కడే అన్నిరకాల సౌకర్యాలు ఉంటే తెలుగుఫిల్మ్ ఇండస్ట్రీకి కేంద్రంగా తయారవుతుంది. ఆ దిశగా ప్రభుత్వం కృషి చేయాలి, ఇక్కడ ప్రభుత్వం అన్నిరకాల సదుపాయాలతో ఒక స్టూడియో నిర్మిస్తే సినిమా ఇండస్ట్రీ అభివృద్ధి చెందుతుంది.