వెల్దుర్తి: జింకలను వేటాడి అతి క్రూరంగా చంపిన వేటగాళ్ల కోసం గాలిస్తున్నామని డీఎఫ్‌ఓ శ్రీధర్‌రావు తెలిపారు. శనివారం మండలంలోని శెట్టిపల్లి గ్రామంలో పలువురిని విచారించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 22న ఉదయం ఆటోలో వేటగాళ్లు జింకలను చంపి తీసుకెళ్తుండగా శెట్టిపల్లి వద్ద వీఎస్‌ఎస్ బాలయ్య గమనించి పట్టుకున్నాడని తెలిపారు.
విషయం మా దృష్టికి తేగా తమ సిబ్బంది పోస్టుమార్టం నిర్వహించి అడవిలోనే ఖననం చేశారన్నారు. ఒక మగ జింక, ఆడ జింకలకు పొట్టలు, గొంతులు కోశారని , రెండు పిల్ల జింకలకు సైతం గొంతులు కోశారని తెలిపారు. అనుమానితులైన ఇద్దరు తమ అదుపులో ఉన్నారని, జింకలను సరఫరా చేసే ఆటోను సీజ్ చేశామన్నారు.
ఇదిలా ఉండగా గ్రామస్తులతోపాటు బాలయ్య మాట్లాడుతూ హైదరాబాద్ నుండి పిస్తోల్ కలిగిన ఓ రిటైర్డ్ పోలీస్ అధికారి ప్రతి శనివారం సాయంత్రం సమయంలో శెట్టిపల్లి అడవిలోకి వచ్చి జంతువులను వేటాడుతుంటాడని డీఎఫ్‌ఓకు ఫిర్యాదు చేశారు. స్పందించిన ఆయన విచారణ చేపడతామని తెలిపారు. ఇదిలా ఉండగా ఈ ఏడాది అడవి జంతువులు వివిధ రకాల పంటలను ధ్వంసం చేశాయన్నారు.
కేంద్ర ప్రభుత్వం నుండి మంజూరైన రూ. 10.50 లక్షలను రైతులకు పంట నష్ట పరిహారంగా అందచేశామన్నారు. పంటలు ధ్వంసమైతే 24 గంటలలోపు రైతులు తమకు ఫిర్యాదు చేయాలన్నారు. ఎకరాకు పంటను బట్టి రూ. 6 నుండి రూ. 10వేల వరకు నష్ట పరిహారం అందజేస్తామన్నారు. ఆయన వెంట వైల్డ్‌లైఫ్ పోచారం అభయారణ్యం రేంజ్ అధికారి భర్నోబా, సిబ్బంది ఉన్నారు.