పత్తాలేని ‘పారిశుధ్య’ కమిటీలు..!
Published Fri, Jul 22 2016 11:51 AM | Last Updated on Tue, Oct 9 2018 5:27 PM
పారిశుధ్య కమిటీ, సీజనల్ వ్యాధులు, మంచిర్యాల
కమిటీ సభ్యులకు కొరవడిన శిక్షణ
సీజనల్ వ్యాధులపై ప్రజల్లో అవగాహన కరువు
విజృంభిస్తున్న సీజనల్ వ్యాధులు
ఆందోళనలో గ్రామీణులు
సాక్షి, మంచిర్యాల : పల్లెల్లో పారిశుధ్యం పడకేసింది. కురుస్తున్న వర్షాలు.. పేరుకుపోతున్న చెత్తాచెదారంతో గ్రామీణ ప్రజల ప్రాణాలకు ముప్పు పొంచి ఉంది. లోపిస్తున్న పారిశుధ్యం.. వ్యాధులపై వారికి అవగాహన కరువైంది. ఇప్పటికే అనేక గ్రామాలను సీజనల్ వ్యాధులు చుట్టుముట్టాయి. ఎంతో మంది జ్వరాలతో మంచంపట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో.. ప్రజలకు అవగాహన కల్పించాల్సిన ‘గ్రామజ్యోతి’ పారిశుధ్య కమిటీలు జిల్లాలో పత్తా లేకుండాపోయాయి. ప్రతినెలా సమావేశమై.. ప్రణాళికలు రూపొందించుకుని కార్యక్రమలు చేపట్టాలని ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలున్నా.. జిల్లాలో పదుల సంఖ్యలో మాత్రమే కమిటీలు చురుకుగా పనిచేస్తున్నాయి. అసలు కమిటీలున్నాయో లేవో కూడా చాలా వరకు గ్రామీణ ప్రజలకు తెలియదంటే అతిశయోక్తి కలగకమానదు. కొన్ని చోట్లయితే.. ఇంత వరకు కమిటీ సభ్యులకు శిక్షణ కొరవడింది. దీంతో కార్యక్రమాలు చేపట్టేందుకు కమిటీ సభ్యులు వెనకడుగు వేస్తున్నారు.
866 గ్రామ పంచాయతీలు..
జిల్లాలో 27 మేజర్.. 839 మైనర్‌లతో కలుపుకుని మొత్తం 866 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. గ్రామాల్లో అభివృద్ధి పనుల గుర్తింపు.. మంజూరు.. నిర్మాణాల బాధ్యతంతా గ్రామస్థాయిలోనే జరిగేలా గతేడాది ఆగస్టు 17న రాష్ట్ర ప్రభుత్వం ‘గ్రామజ్యోతి’ పథకానికి శ్రీకారం చుట్టింది. ప్రారంభం నుంచి పది రోజులపాటు జిల్లాలో పర్యటించిన అధికారులు, ప్రజాప్రతినిధులు 406 గ్రామాలనూ దత్తత తీసుకున్నారు. గ్రామాల అభివృద్ధి బాధ్యత తమదేనంటూ పల్లె ప్రజలకు భరోసా ఇచ్చారు. జిల్లా వ్యాప్తంగా పర్యటించారు.
ఎనిమిది నెలల క్రితమే కమిటీ ఏర్పాటు
గ్రామాలు సర్వతోముఖాభివృద్ధి చెందేలా దాదాపు ఎనిమిది నెలల క్రితమే అన్ని గ్రామాల్లో ఏడేసి కమిటీలు ఏర్పాటు చేశారు. పారిశుధ్యం-తాగునీరు, సహజవనరుల నిర్వహణ, మౌలిక సదుపాయాలు, వ్యవసాయం, సామాజిక భద్రత-పేదరిక నిర్మూలన, ఆరోగ్యం-పౌష్టికాహారం, విద్యాకమిటీలు ఏర్పాటు చేసిన స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రధానోపాధ్యాయులు, మహిళలు, అధికారులకు నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం ఈ కమిటీలో ఏ ఒక్క కమిటీ చురుకుగా పనిచేయడం లేదు. ప్రస్తుత సీజన్లో పారిశుధ్యం-తాగునీటి కమిటీల పాత్ర కీలకం. సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, వార్డుమెంబర్, మహిళా సంఘ నాయకురాలు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి, పదవీ విరమణ పొందిన ఓ ఉద్యోగి ఈ కమిటీలో ఉంటారు. వర్షాకాలం నీరు కలుషితం కావడం.. పారిశుధ్య లోపంతో వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నందునా సీజన ల్ వ్యాధులపై స్పందించాల్సి ఉంటుంది. గ్రామ పంచాయతీలో ఉన్న నిధులతో వీరు తమ కార్యకలాపాలు కొనసాగించాల్సి ఉంది. కాగా.. పథకం ప్రారంభంలో చురుకుగా పనిచేసిన ఈ కమిటీ ప్రస్తుతం పత్తా లేకుండాపోయింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రబలుతున్న వ్యాధుల దృష్యా పారిశుద్ద్య కమిటీలు సమర్ధంగా పని చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ప్రభుత్వం నుంచి ఆదేశాలున్నాయి..
గ్రామజ్యోతి పథకంలో భాగంగా ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులందరూ ప్రతినెలా విధిగా సమావేశం నిర్వహించి కార్యక్రమాలు చేపట్టాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలున్నాయి. ప్రస్తుతం జిల్లాలో కొన్ని గ్రామాల్లోనే కమిటీ సభ్యులు సమావేశం నిర్వహించడం లేదు. దాదాపు అన్ని చోట్ల సమావేశమవుతున్నారు. సీజనల్ వ్యాధుల నేపథ్యంలో ప్రతి కమిటీ సభ్యుడు బాధ్యతాయుతంగా పని చేయాలి.
- పోచయ్య, జిల్లా పంచాయతీ అధికారి
Advertisement
Advertisement