
కాపాలా లేని మెదక్‌లోని ఏటీఎం
పేట్రేగుతున్న దొంగలు
తొమ్మిది నెలల్లోనే 8 ఘటనలు
అయినా భద్రతపై చర్యలు శూన్యం
చోద్యం చూస్తున్న అధికారులు
మెదక్: దొంగలు పేట్రేగిపోతున్నారు. కాపలాలేని ఏటీఎంలనే టార్గెట్‌చేస్తు దోపిడీలు చేస్తున్నారు. ఇందులో కొన్నింట్లలో దోచుకెళుతుండగా మరికొన్ని తెరుచుకోకపోవటంతో వదిలేసి వెళ్లిపోతున్నారు. గడిచిన 9 మాసాల్లో జిల్లాలో 8కి పైగా ఈలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. అయినా బ్యాంకు అధికారులు ఏటీఎంల వద్ద భద్రతపై దృష్టి సారించడంలేదు.
గతయేడాది డిసెంబర్ మాసంలో మెదక్ పట్టణం వెంకటరావు నగర్ కాలనిలోని రోడ్డుపక్కన గల ఏటీఎంలో తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో దొంగలు బులేరాపై వచ్చి గ్యాస్‌కట్టర్‌తో ఏటీఎంను కట్‌చేస్తుండగా బస్తీతిరిగే పోలీసులు వారిని అటకాయింయటంతో బులేరోవాహనంలో పరారయ్యారు. పోలీసులు వెంబడించినా ఫలితంలేకుండా పోయింది.
అదేరోజు రాత్రి çసంగారెడ్డిలోని ఏటీఎంను పగులగొట్టిన దొంగలు కొద్దిమొత్తం డబ్బును ఎత్తుకెల్లినట్లు తెలిసింది. గతంలో పెద్ద శంకరంపేట ఏటీఎం, రంగంపేటలో బ్యాంకుదోపిడీకి యత్నించారు. టేక్మాల్, అల్లాదుర్గంలో ఏటీఎం, అలాగే ఇటీవల మూడు మాసాల్లోనే పాపన్నపేట మండలం కొత్తపల్లిలో గల ఏటీఎంను రెండు సార్లు దొంగలు పగలగొట్టి డబ్బులు ఎత్తుకెళ్లేందుకు విఫలయత్నం చేశారు.
ఇటీవల అదేమండలంలోని యూసుపేటలోని బ్యాంకును సైతం దోచుకునేందుకు తీవ్ర ప్రయంత్నం చేశారు. మూడు రోజుల కిందట హత్నూరమండలం దౌల్తాబాద్‌లోని చౌరస్తాలో ఏటీఎంలను ధ్వంసం చేసిన గుర్తుతెలియని దొంగలు పోలీసుల రాకను గమనించి పరారయ్యారు. ఏటీఎంలను టార్గెట్‌చేస్తూ దోపిడీకి పాల్పడుతున్నా సంబంధిత బ్యాంకుల అధికారులు మాత్రం స్పందించటంలేదు.
ఈ విషయంపై పోలీసులు బ్యాంకుల అధికారులను పిలిచి సమావేశపరిచి అవగాహన కల్పించినప్పటికీ వారు భద్రతపై ఏమాత్రం చొరవచూపటంలేదన్న ఆరోపణలున్నాయి. మెదక్ పట్టణంలో సుమారు 15 ఏటీఎంల వరకు ఉండగా అందులో ఒకటిరెండింట్లో తప్పా మిగతా ఏటీఎంలలో ఏలాంటి భద్రతను ఏర్పాటు చేయటం లేదు.
ఈ విషయపై ఓ బ్యాంకు ఉన్నతాధి కారిని ప్రశ్నించగా తాము ఏటీఎంల భద్రతను కాంట్రాక్టు పద్ధతిన వేరేవారికి అప్పగించామని తెలిపారు. ఏటీఎంలో దాచి ఉంచిన డబ్బుకు బీమా ఉంటుందన్నారు. ఇదిలా ఉండగా.. ఉన్న కొద్దిమంది పోలీసులు ఏటీఎంలు, పట్టణాల్లో గస్తీ తిరగటం కష్టంగా మారినట్లు ఓ జిల్లా పోలీస్ ఉన్నతాధికారి తెలిపారు. ఇప్పటికైనా బ్యాంకు అధికారులు స్పందించి ప్రతి ఏటీఎం వద్ద కాపలా దారులను ఉంచాలని పలువురు కోరుతున్నారు.