మాట్లాడుతున్న కలెక్టర్ హనుమంతరావు
జహీరాబాద్ టౌన్: జహీరాబాద్ నియోజకవర్గం కర్ణాటక సరిహద్దులో ఉన్నందున ఎన్నికల వరకు 24 గంటలు గట్టి నిఘా పెట్టాలని కలెక్టర్ హనుమంతరావు పోలీసులు, ఎక్సైజ్, ఎన్నికల అధికారులను ఆదేశించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ జిల్లా ఎస్పీ శ్రీధర్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర సరిహద్దులో మాడ్గి, హుసెళ్లి వద్ద చెక్‌పోస్టులను ఏర్పాటు చేశామన్నారు. అక్రమంగా మద్యం, డబ్బులు రాకుండా ఉండేందుకు చెక్‌పోస్టుల వద్ద గట్టి నిఘా పెట్టాలన్నారు.
కర్ణాటక రాష్ట్రం నుంచి రాష్ట్రంలోకి వచ్చేందుకు ఇతర మార్గాలు కూడా ఉన్నాయని, ఆయా మార్గాల్లో కూడా నిఘా పెంచాలని ఆయన పోలీసులు, అధికారులను ఆదేశించారు. బంగారం, మద్యం, డబ్బులు రాకుండా ఉండేందుకు ప్రతీ వాహనాన్ని క్షుణంగా తనిఖీలు చేయాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యం చేస్తే కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కర్ణాటక సరిహద్దులోని గ్రామాల్లో ఎన్నికలకు రెండు రోజుల ముందు మద్యం దుకాణాలను మూసి ఉంచాలని ఎక్సైజ్ అధికారులను ఆదేశించారు. మద్యం అమ్మకాలను అరికట్టడానికి పోలీసులు కూడా గ్రామాల్లో పర్యటించి తనిఖీలు చేయాలన్నారు.
ఎన్నికలు పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలన్నారు. బీదర్ జిల్లా నియోజకవర్గం సరిహద్దులో ఉందని, అక్రమంగా మద్యం, డబ్బులు వచ్చేందుకు అవకాశం ఉన్నందున, నివారణకు పూర్తి సహకారం అందించాలని బీదర్ ఎస్పీని కోరారు. కర్ణాటక నుంచి మద్యం, డబ్బులు రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. బీదర్ ఎస్పీ శ్రీధర్ మాట్లాడుతూ సరిహద్దులో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. మద్యం, అక్రమంగా డబ్బులు రాకుండా 24 గంటల పాటు తనిఖీలను నిర్వహిస్తామన్నారు. ఈ సమావేశంలో రిటర్నింగ్ అధికారి అబ్దుల్ హమీద్, డీఎస్పీ నల్లమల రవి,
ఎక్సైజ్ సీఐ ఆశోక్‌కుమార్ తదితర అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment