వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సంతాపాన్ని తెలియజేశారు.
విజయవాడ: వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సంతాపాన్ని తెలియజేశారు. వరద బాధిత ప్రాంతాలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సాయం చేస్తోందని చెప్పారు. శనివారం విజయవాడలో గేట్ వే హోటల్లో ప్రారంభమైన దక్షిణాది రాష్ట్రాల్లో ప్రాంతీయ సదస్సుకు రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమైఖ్య స్ఫూర్తిని సాధించడమే సదస్సు ముఖ్య ఉద్దేశమన్నారు.
అభివృద్ధి, ప్రగతిలో భాగస్వాములను చేయడమే దీని ఉద్దేశమని తెలిపారు. కేంద్ర, రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యల పరిష్కారానికి ఇది సరైన వేదికగా ఆయన పేర్కొన్నారు. దక్షిణాదిన తీర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని రాజ్‌నాథ్ చెప్పారు. వామపక్ష తీవ్రవాదంతో అంతర్గత భద్రతకు సవాల్ ఎదురవుతోందని చెప్పారు. సరైన సహకారం, సమన్వయంతోనే వీటిని అదుపుచేయగలమని రాజ్‌నాథ్ అభిప్రాయపడ్డారు. కాగా, ఈ సమావేశాలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, దక్షిణాది రాష్ట్రాలకు చెందిన మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.