సీఎంను విమర్శిస్తే దేశద్రోహం కేసా! | Sedition case if criticize Cm? | Sakshi
Sakshi News home page

సీఎంను విమర్శిస్తే దేశద్రోహం కేసా!

Published Sat, Dec 19 2015 3:01 AM | Last Updated on Mon, Oct 29 2018 8:44 PM

సీఎంను విమర్శిస్తే దేశద్రోహం కేసా! - Sakshi

సీఎంను విమర్శిస్తే దేశద్రోహం కేసా!

అలా ఎలా పెడతారు?
► ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి కేసులో హైకోర్టు విస్మయం
► రాజకీయ కక్షసాధింపులకు చట్టాన్ని వాడుకోవద్దు
► పోలీసుల్ని ఇలా వాడుకోవడం అధికార దుర్వినియోగమే
► న్యాయమూర్తి ఘాటు వ్యాఖ్యలు
► ఈశ్వరిని అరెస్ట్ చేయొద్దు.. దర్యాప్తు కొనసాగించవచ్చు
► పోలీసులకు ఆదేశం
 
 సాక్షి, హైదరాబాద్: బాక్సైట్ తవ్వకాల వ్యవహారంలో ముఖ్యమంత్రి చంద్రబాబుపై విమర్శలు చేసినందుకుగాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన విశాఖపట్నం జిల్లా పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిపై పోలీసులు దేశద్రోహం కింద కేసు నమోదు చేయడంపట్ల హైకోర్టు విస్మయం వెలిబుచ్చింది. సీఎంను విమర్శిస్తే దేశద్రోహం కేసు ఎలా పెడతారని ప్రశ్నిం చింది. రాజకీయ కక్షసాధింపులకు చట్టాన్ని వాడుకోరాదని స్పష్టం చేసింది. దేశద్రోహం కింద పోలీసులతో ఇలా కేసులు పెట్టించడం అధికార దుర్వినియోగమే అవుతుందని అభిప్రాయపడింది. ప్రజాజీవితంలో ఉన్న వ్యక్తులు అందరికన్నా ఎక్కువ సంయమనం పాటించాల్సిన అవసరముందని అంది.

ఈశ్వరిపై నమో దు చేసిన కేసుల్లో ఆమెను అరెస్ట్ చేయరాదని పాడేరు, చింతపల్లి పోలీసులను ఆదేశించింది. అయితే దర్యాప్తు కొనసాగించవచ్చని తెలి పింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్ శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. బాక్సైట్ తవ్వకాల వ్యవహారంలో రాష్ట్రప్రభుత్వ తీరును నిరసిస్తూ ఈ నెల 10న వైఎస్సార్‌సీపీ చింతపల్లిలో గిరి జన సదస్సు నిర్వహించింది. సదస్సులో ఎమ్మె ల్యే గిడ్డి ఈశ్వరి మాట్లాడుతూ.. సీఎంపై విమర్శలు చేశారు. దీనిపై స్థానిక టీడీపీ నేత లక్ష్మణరావు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈశ్వరిపై పాడేరు, చింతపల్లి పోలీసులు కేసులు నమోదు చేశారు. దీన్ని సవాలు చేస్తూ ఆమె హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యాన్ని జస్టిస్ పి.వి. సంజయ్‌కుమార్ శుక్రవారం విచారించారు.

 ఇది దేశద్రోహం కిందకు ఎలా వస్తుందో అర్థమవట్లేదు..
 ఈశ్వరి తరఫున న్యాయవాది ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. సీఎంపై విమర్శలు చేసినందుకు ఈశ్వరిపై దేశద్రోహం కేసు పెట్టారని,  హత్యాయత్నం కింద కూడా కేసు నమోదు చేశారని తెలిపారు. పత్రికాకథనాల ఆధారంగా ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారని, నిజానికి పత్రికల్లో వచ్చినవిధంగా పిటిషనర్ మాట్లాడలేదన్నారు. గిరిజనుల హక్కులను ప్రభుత్వం ఎలా హరిస్తుందో వివరిస్తూ మాట్లాడారన్నారు. ఇది ఏ రకంగా దేశద్రోహం కిందకు వస్తుందో, హత్యాయత్నం ఎలా అవుతుందో అర్థమవట్లేదన్నారు. సుప్రీం కోర్టు తీర్పుప్రకారం రాజ్యంపై కుట్రపూరితంగా వ్యవహరించినప్పుడే దేశద్రోహం కేసుపెట్టాలి తప్ప.. వ్యక్తులపై కాదన్నారు. ఓ వ్యక్తి రాజ్యాన్ని నడుపుతున్నంత మాత్రాన ఆ వ్యక్తే రాజ్యం కాదన్నారు. అసలు ఈ కేసు చట్టం ముందు నిలబడదన్నారు.
 
 రాజకీయ కక్షలుంటే పోలీసుల్ని వాడుకుంటారా?
 ఈ వాదనలతో ప్రాథమికంగా ఏకీభవించిన న్యాయమూర్తి స్పందిస్తూ... ‘‘రోజూ పత్రికల్లో చూస్తూనే ఉన్నాం. ప్రజా ప్రతినిధులు ఒకరిని మించి ఒకరు మాట్లాడుతున్నారు. ఏ ఒక్కరూ సంయమనం పాటించట్లేదు. తమ స్థాయి ఏమిటన్నది మర్చిపోయి మాట్లాడుతున్నారు. అసలు ఈ కేసులో పిటిషనర్‌పై ఏవిధంగా దేశద్రోహం కింద కేసు పెడతారో అర్థమవట్లేదు. ఇది ఒకరకంగా అధికార దుర్వినియోగమే. ప్రభుత్వమంటే సీఎం ఒక్కరే కాదు. రాజకీయ కక్షలుంటే అందుకిలా పోలీసుల్ని, చట్టాన్ని వాడుకుంటారా?’’ అని ఘాటుగా వ్యాఖ్యానించారు.

పోలీసుల తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) పి.వేణుగోపాల్ వాదనలు వినిపిస్తూ.. ఎమ్మెల్యే ఈశ్వరి చేసిన ప్రసంగం దారుణంగా ఉందన్నారు. సంయమనం పాటించకుండా ఇష్టారాజ్యంగా మాట్లాడారన్నారు. దర్యాప్తు ప్రారంభ దశలో ఉందని, కాబట్టి ఎటువంటి ఉత్తర్వులు జారీ చేయరాదని విన్నవించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. పిటిషనర్ ఈశ్వరిని అరెస్ట్ చేయవద్దని, దర్యాప్తును మాత్రం కొనసాగించవచ్చునంటూ మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. తదుపరి విచారణను వాయిదా వేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement