మెట్రో పనుల ప్రస్తుత రిజల్ట్
సాక్షి,సిటీబ్యూరో: భాగ్యనగరి కలల ప్రాజెక్టు.. మెట్రో రైలు పాతనగరంలో పరుగులు పెట్టే భాగ్యం ఇప్పట్లో లేనట్టేనన్న సంకేతాలు వెలువడుతున్నాయి. జేబీఎస్–ఫలక్‌నుమా (కారిడార్–2) మార్గంలో.. మహాత్మగాంధీ బస్‌స్టేషన్ నుంచి ఫలక్‌నుమా (5.3 కి.మీ) మార్గంలో రూటు మార్పుపై రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీకి ఏడాదిగా ఎలాంటి దిశానిర్దేశం చేయలేదు. దీంతో ఈ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పాతనగరంలోని పలు ప్రార్ధనా స్థలాలను పరిరక్షించేందుకు మెట్రో మార్గాన్ని మూసీ నది మధ్య నుంచి మళ్లించాలని గతంలో సర్కారు సంకల్పించింది.
ఈమేరకు అలైన్‌మెంట్ మార్పుపై అధ్యయనం చేయాలని అప్పట్లో నిర్మాణ సంస్థను సైతం ఆదేశించింది. ఆ దిశగా అధ్యయనం చేపట్టిన నిపుణుల బృందం.. మెట్రో మార్గం మార్పుపై సాంకేతికంగా, వాణిజ్య పరంగా ఉన్న అవకాశాలను పరిశీలించింది. మూసీనది మధ్య నుంచి మెట్రో మార్గం ఏర్పాటు సాంకేతికంగా కష్టనష్టాలతో కూడుకున్నదని, ఒకవేళ ఈ మార్గంలో రూటును ఏర్పాటు చేసినప్పటికీ వాణిజ్యపరంగా తమకు గిట్టుబాటు కాదని ప్రభుత్వానికి నివేదించింది.
ఈ అంశంపై నగరంలోని అన్ని రాజకీయ పార్టీల నేతలతో అఖిలపక్ష సమావేశం సైతం ఏర్పాటు చేస్తామని గతంలో ప్రభుత్వం ప్రకటించినా సమావేశం మాత్రం జరగలేదు. ఏడాది కాలంగా ఈ విషయంపై ఎలాంటి పురోగతి కనిపించకపోవడం గమనార్హం.
పనుల ప్రగతి ఇదీ..
మార్గం.. మొత్తం ఏర్పాటు మార్గం
పిల్లర్లు చేసినవి (కి.మీలో)
నాగోల్ మెట్టుగూడ(స్టేజ్1) 315 315 8.01
మియాపూర్–ఎస్.ఆర్‌నగర్ (స్టేజ్2) 456 456 11.90
మెట్టుగూడ–బేగంపేట్ (స్టేజ్3) 305 293 7.89
బేగంపేట్–శిల్పారామం (స్టేజ్4) 432 337 8.51
ఎస్.ఆర్.నగర్–ఎల్భీనగర్ (స్టేజ్5) 652 611 16.39
జేబీఎస్–ఫలక్‌నుమా (స్టేజ్6) 587 186 4.86
మొత్తం 2,747 2,198 57.56