దళితులకు కావాల్సింది ఆత్మగౌరవం
Published Sun, Sep 18 2016 9:31 PM | Last Updated on Mon, Sep 4 2017 2:01 PM
రాజమహేంద్రవరం కల్చరల్:
దళితులకు కావాల్సింది ఆత్మగౌరవమే కాని, మతం కాదని కుసుమ ధర్మన్న చాటారని బెంగళూరు విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధిపతి కె. ఆశాజ్యోతి పేర్కొన్నారు. ‘దళితులు– వర్తమానం–కుసుమ ధర్మన్న’ అనే సదస్సులో ఆమె ప్రసంగించారు. ఆంగ్లేయుల పాలనకన్నా, నల్ల దొరలపాలనలోని కష్టాలు కుసుమ ధర్మన్నను కదిలించాయని ఆమె పేర్కొన్నారు. మొదట్లో ఆయనపై గాంధీ ప్రభావం ఉన్నప్పటికీ, అనంతరం కాలంలో అంబేడ్కర్ అనుయాయిగా మారారన్నారు. మహాభారతాన్ని సంకరజాతుల ఆధిపత్యయుద్ధమని వర్ణించిన ఏకైక కవి కుసుమ ధర్మన్న అని ఆమె పేర్కొన్నారు. మరో సాహితీవేత్త కోయి కోటేశ్వరరావు మాట్లాడుతూ మనం ప్రత్యామ్నాయ సంస్కృతిని అభివృద్ధి చేసుకోవాలని కోరారు. ప్రాణహిత కవి సన్నిధానం నరసింహ శర్మ మాట్లాడుతూ1870–1880 నాటి పత్రికలు కూడా కొన్ని గ్రంథాలయాలలో లభ్యమవుతున్న నేపధ్యంలో కుసుమ ధర్మన్న సంపాదకత్వంలో వెలువడిన పత్రికలు లభ్యం కాకపోవడం శోచనీయమన్నారు. మేడిపల్లి రవికుమార్ మాట్లాడుతూ కసుమ«ధర్మన్నను జాతీయకవిగా గుర్తించాలన్నారు. నన్నయ విశ్వవిద్యాలయం అసోసియేట్ ప్రొఫెసర్ టి.సత్యనారాయణ మాట్లాడుతూ నన్నయ విశ్వవిద్యాలయంలో కుసుమ ధర్మన్న పీఠాన్ని ఏర్పాటు చేయాలని, గోదావరి గట్టున ఆయన శిలావిగ్రహం నెలకొల్పాలని కోరారు. కీర్తిపురస్కార గ్రహీత డాక్టర్ గూటం స్వామి, డాక్టర్ పుట్లహేమలత తదితరులు ప్రసంగించారు. అనంతరం జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
Advertisement