టీడీపీలో స్వార్థ రాజకీయాలు
టీడీపీలో స్వార్థ రాజకీయాలు
Published Mon, Jun 12 2017 9:56 PM | Last Updated on Fri, Aug 10 2018 8:26 PM
14న వైఎస్‌ఆర్‌సీపీలో చేరతా
- చంద్రబాబు ధోరణి మనస్తాపం కలిగించింది
- వేధింపులకు గురిచేస్తున్న మంత్రి అఖిలప్రియ
- పార్టీ మారేందుకు నాయకులు, కార్యకర్తల ఏకాభిప్రాయం
- మాజీ మంత్రి, టీడీపీ నంద్యాల నియోజకవర్గ ఇన్‌చార్జి శిల్పా మోహన్‌రెడ్డి
నంద్యాల: టీడీపీలో స్వార్థ రాజకీయం సాగుతోందని మాజీ మంత్రి, టీడీపీ నంద్యాల నియోజకవర్గ ఇన్‌చార్జి శిల్పా మోహన్‌రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నాన్చుడు ధోరణి, మంత్రి అఖిలప్రియ వేధింపులు మితిమీరడం వల్లే తాను పార్టీ మారేందుకు నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా సోమవారం ఆయన శిల్పా సేవా సమితి కార్యాలయంలో పార్టీ నేతలు, కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ఎన్నికల్లో స్వల్ప మెజార్టీతో ఓటమి పాలయ్యానని.. అయితే తనపై గెలిచిన భూమా నాగిరెడ్డిని పార్టీలో చేర్చుకున్నారన్నారు. అయినప్పటికీ తాను సర్దుకుపోయినా భూమా నుండి తీవ్ర వ్యతిరేకతలను ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు. ఆయన మరణానంతరం కుమార్తె అఖిలప్రియకు మంత్రి పదవిని కట్టబెట్టారని, తన తమ్ముడు శిల్పా చక్రపాణిరెడ్డికి శాసనమండలి చైర్మన్ పదవిని ఇస్తానన్న ముఖ్యమంత్రి ఇప్పటికీ నాన్చుడు ధోరణి అవలంబిస్తున్నారన్నారు.
అఖిలప్రియ చైర్‌పర్సన్ దేశం సులోచనను, కౌన్సిలర్లను, సొంత పార్టీ నేతలతో పాటు కార్యకర్తలను కూడా ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శిల్పా వర్గానికి పనులు చేయవద్దని అధికారులను ఆదేశించారన్నారు. తన వర్గంలోని మున్సిపల్ చైర్‌పర్సన్ దేశం సులోచన, మార్క్‌ఫెడ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పీపీ నాగిరెడ్డి, గోస్పాడు జెడ్పీటీసీ సభ్యుడు ప్రహ్లాదరెడ్డిలను ఎలాంటి కార్యక్రమాలకు కూడా ఆహ్వానించడం లేదన్నారు. నవ నిర్మాణ దీక్షలకు మంత్రి కాల్వ శ్రీనివాసులు హాజరు కాగా.. తనకు కనీస ఆహ్వానం కూడా పంపలేదన్నారు. ఈ విషయాలను ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసినా కనీస స్పందన కరువైందన్నారు.
ఆ ముగ్గురూ టార్గెట్ చేశారు..
మంత్రి అఖిలప్రియ, మాజీ మంత్రి ఫరూక్, ఎంపీ ఎస్పీవై రెడ్డి తనను టార్గెట్ చేశారని శిల్పా తెలిపారు. తనకు ఉప ఎన్నికల్లో టికెట్ ఇస్తే మూకుమ్మడిగా ఓడిస్తామని చెప్పినా తాను మౌనం వహించానే కానీ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదన్నారు. అయితే పార్టీ నేతలు, కార్యకర్తలను వేధింపులకు గురి చేస్తుంటే మౌనం వీడక తప్పలేదన్నారు.
రేపు వైఎస్సార్సీపీలో చేరిక
పార్టీ నేతలు, కార్యకర్తలందరూ వైఎస్సార్సీపీలో చేరేందుకు ఏకాభిప్రాయం తెలిపారన్నారు. ఆ మేరకు ఈనెల 14వ తేదీ ఉదయం 10.30గంటలకు హైదరాబాద్‌లోని లోటస్ పాండ్ నివాసంలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహనరెడ్డి సమక్షంలో తనతో పాటు చైర్‌పర్సన్ దేశం సులోచన, మార్క్‌ఫెడ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పీపీ నాగిరెడ్డి, కౌన్సిలర్లు, సర్పంచ్‌లు, పెద్ద ఎత్తున అభిమానులు పార్టీలో చేరనున్నట్లు చెప్పారు. వీరంతా మంగళవారం మధ్యాహ్నం నుండి హైదరాబాద్‌కు బయలుదేరడానికి సిద్ధం కావాలన్నారు. నేటి నుండి వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలమయ్యామని శిల్పా చెప్పడంతో వైఎస్సార్సీపీ జిందాబాద్, జగన్ జిందాబాద్ అంటూ నినాదాలు మిన్నంటాయి. కార్యక్రమంలో చైర్‌పర్సన్ దేశం సులోచన, మార్క్‌ఫెడ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పీపీనాగిరెడ్డి, గోస్పాడు జెడ్పీటీసీ సభ్యుడు ప్రహ్లాదరెడ్డి, 25 మంది కౌన్సిలర్లు పాల్గొన్నారు.
Advertisement