Shilpa mohanreddy
-
ఎలాంటి భయాలు వద్దు: వైఎస్ జగన్
- నంద్యాల అభివృద్ధి బాధ్యత నాదే - ఉప ఎన్నిక ప్రచారంలో వైఎస్సార్సీపీ అధినేత నంద్యాల: ‘పులివెందులను ఏ విధంగా అభివృద్ధి చెయ్యాలనుకున్నానో, నంద్యాలను కూడా అలానే చేస్తా. నంద్యాల అభివృద్ధి గురించి ఎవరూ భయపడకండి. మీరు న్యాయానికి ఓటేయండి.. నంద్యాల అభివృద్ధి బాధ్యత నాకొదిలేయండి’ అని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అన్నారు. నంద్యాల ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా శుక్రవారం(10వ రోజు) పట్టణంలోని సాయిబాబానగర్‌లో ఆయన పర్యటించారు. వైఎస్సార్సీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా మూడున్నరేళ్ల చంద్రబాబు దుర్మార్గ పాలనను గుర్తుచేశారు. ‘రైతులకు 86 వేల కోట్ల రుణం మాఫీ చేస్తానని రైతులను, 14 వేల కోట్ల డ్వాక్రా రుణాలు మాఫీచేస్తానని మహిళలను, జాబు ఇస్తానని నిరుద్యోగులను మోసం చేసిన చంద్రబాబు.. ఆఖరికి పసిపిల్లల జీవితాలతో కూడా ఆటలాడుకుంటున్నారు. ఏడాదిలోపు మూగ,చెవిటి పిల్లలకు మాత్రమే ఆపరేషన్లు చేస్తామంటున్నారు. అప్పటికి వారు లోపంతో బాధపడుతున్నారని గుర్తించడమే కష్టం! క్యాన్సర్ పేషెంట్లకు నెలకు 7,8సార్లు కీమోథెరపీ అవసరంకాగా, 2 దఫాలకు మాత్రమే డబ్బులు ఇస్తామంటున్నారు. కిడ్నీ రోగుల డయాలసిస్ కోసం వెళితే.. సంవత్సరం తర్వాత రమ్మంటున్నారు. 108కి ఫోన్‌చేస్తే డీజిల్ లేదనో, జీతాల కోసం డ్రైవర్లు సమ్మె చేస్తున్నారనో సమాధానం వస్తుంది. బెల్టు షాపులు లేకుండా చేస్తామన్నారు.. ఇప్పుడేమో మద్యం హోండెలివరీ ఇస్తామంటున్నారు. ఇదీ.. మూడేళ్ల పాలనలో చంద్రబాబు సాధించిన ఘనకీర్తి’ అని వైఎస్ జగన్ అన్నారు. నంద్యాల అభివృద్ధి నా బాధ్యత: గడిచిన మూడున్నరేళ్లలో సీఎం చంద్రబాబుకానీ, ఆయన మంత్రులుకానీ ఒక్కటంటే ఒక్కసారైనా నంద్యాలకు రాలేదని, ఇప్పుడు ఉప ఎన్నిక వచ్చేసరికి వాళ్లకు ప్రజలు గుర్తొచ్చారని వైఎస్ జగన్ ఎద్దేవా చేశారు. ‘నంద్యాలలో మీరు వేసే ఓటు.. చంద్రబాబు దుర్మార్గ పాలకు చెంపపెట్టులాంటిది. న్యాయానికి, ధర్మానికి ఓటు వేయండి. నంద్యాల అభివృద్ధి విషయంలో ఎలాంటి భయాలొద్దు. ఆ బాధ్యత నాది’ అని జగన్ హామీ ఇచ్చారు. దెయ్యాలు వస్తాయ్.. ప్రమాణాలు చేయిస్తాయ్..: మూడున్నరేళ్లపాటు ప్రజాధనాన్ని కొల్లగొట్టిన చంద్రబాబు.. ఆ డబ్బుతో ఎమ్మెల్యేలను కొన్నారని, ఇప్పుడు ప్రజలను కూడా కొనాలనుకుంటున్నారని వైఎస్ జగన్ విమర్శించారు. ‘నంద్యాలకు దెయ్యాలు వస్తాయి.. ఒక్కో ఓటరు చేతిలో రూ.5వేల పెట్టి, ప్రమాణాలు చేయిస్తాయి. మీరంతా జాగ్రత్తగా ఉండాలి. ధర్మానికి ఓటేసి దెయ్యాలని పారద్రోలాలి’ అని జగన్ అన్నారు. -
నంద్యాల సీటుపై వైఎస్ జగన్ మాటే వేదం
- అధినేత ఎలా చెబితే అలా నడుచుకుంటా: శిల్పా మోహన్‌రెడ్డి - కాన్ఫరెన్స్‌లు తప్ప మూడేళ్లలో చంద్రబాబు చేసింది శూన్యం - భారీ అనుచరగణంతో వైఎస్సార్సీపీలోకి చేరిన నంద్యాల నేత హైదరాబాద్: పదవులకు ఆశపడి కాదు.. ఆత్మగౌరవం కోసమే పార్టీ మారానని అన్నారు మాజీ మంత్రి శిల్పా మోహన్‌రెడ్డి. భారీ సంఖ్యలో మద్దతుదారులు వెంటరాగా ఆయన బుధవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. హైదరాబాద్‌లోని కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి.. శిల్పా, ఇతర కీలక నాయకులకు కండువాలు కప్పి వైఎస్సార్సీపీలోకి స్వాగతం పలికారు. పార్టీలో చేరిక అనంతరం మోహన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. నంద్యాల సీటు విషయంలో అధినేత జగన్ ఎలా చెబితే అలా నడుచుకుంటానని అన్నారు. చంద్రబాబు ధోరణితో విసిగిపోయాం: ‘‘వైఎస్సార్ సీపీలో గెలిచిన భూమా నాగిరెడ్డి టీడీపీలో చేరినప్పటి నుంచి అంతర్గత విబేధాలు హెచ్చుమీరాయి. ఆ కారణంగా నియోజకవర్గ అభివృద్ధి పూర్తిగా కుంటుపడిపోయింది. పరిస్థితి చేయిదాటిపోతుండటంతో నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే ఫిర్యాదుచేశా. ఒకటికాదు, వందలసార్లు మొరపెట్టుకున్నా. అయినాసరే, ఆయన మమ్మల్ని పట్టించుకోలేదు. కనీసం పెన్షన్లు, రేషన్‌కార్డులు, ఇళ్ల సమస్యలైనా తీర్చమని అడిగా ఫలితం లేదు. మాపట్ల టీడీపీ అధిష్టానం నిర్లక్ష్యధోరణికి విసిగిపోయాం. ఫరూఖ్, అఖిలప్రియలు మాకు వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తున్నా చంద్రబాబు స్పందించలేదు. పర్సనల్ ఎజెండాలు లేకుండా పనిచేసే మనం ఇక పార్టీలో ఉండటం అనవసరమని క్యాడర్ అభిప్రాయపడింది. సమర్థవంతుడైన జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో పనిచేయాలని నిర్ణయించుకున్నాం. అందుకే వైఎస్సార్సీపీలో చేరాం’’ అని శిల్పా మోహన్‌రెడ్డి చెప్పారు. చిన్నపిల్లల్ని మంత్రులు చేస్తే సహకరించాం భూమా చనిపోయిన తర్వాత ఆయన కూతురు అఖిలప్రియకు మంత్రి పదవి ఇచ్చే విషయంలో చంద్రబాబు తమను స్పంప్రదించారని, అప్పుడు తామేమీ అభ్యంతరం చెప్పలేదని శిల్పా మోహన్‌రెడ్డి గుర్తుచేశారు. ‘‘వయసులో మాకంటే చిన్నపిల్లలైన కొందరిని కేబినెట్లోకి తీసుకున్నారు. మంచికే అనుకున్నాం. కానీ వాళ్లు స్థానిక నేతలను అస్సలు పట్టించుకోలేదు. ఎంపీపీలు, జెడ్సీటీసీలు, మున్సిపల్ చైర్మన్లు, సర్పంచ్‌లు.. ఎవ్వరినీ లెక్కచేయకుండా ఏకపక్షంగా వ్యవహరించారు. దీంతో స్థానిక నాయకత్వంలో తీవ్ర అసంతృప్తి రగిలింది. ఈ సమస్యలను ఎన్నిసార్లు దృష్టికి తీసుకెళ్లినా సీఎం స్పందించలేద’’ని వివరించారు శిల్పా. కాన్ఫరెన్స్‌లు తప్ప పని జరగట్లేదు భూమా మరణం తర్వాత ఆయన కూతురు మంత్రి అయింది కానీ నంద్యాల సమస్యలు మాత్రం ఎప్పటిలాగే ఉన్నాయని శిల్పా మోహన్‌రెడ్డి అన్నారు. ఎంతోకొంత పని చేయాలనే ఉద్దేశంతో నంద్యాల టికెట్ సంగతేమిటని అడగ్గా చంద్రబాబు దాటవేత ధోరణి ప్రదర్శించారని శిల్పా వాపోయారు. రాష్ట్రస్థాయి నాయకులతో పలు దఫాలు చర్చలు జరిపినా ఫలితం రాలేదని, ‘అమెరికా నుంచి తిరిగొచ్చాక చెబుతా’న్న బాబు మాట చివరికి నీటిమూటే అయిందని ఆవేదన చెందారు. టికెట్ ఇవ్వడం, ఇవ్వకపోవడం కంటే అధిష్టానం నిర్లక్ష్యధోరణే తమను తీవ్రంగా బాధించిందని శిల్పా అన్నారు. గడిచిన మూడేళ్ల కాలంలో సీఎం చంద్రబాబు నాయుడు వీడియో కాన్ఫరెన్సులు తప్ప పనులేవీ చేయలేదని విమర్శించారు. ‘ఎంతసేపూ పోలవరం, అమరావతి అంటారేగానీ రాయలసీమ సంగతి పట్టించుకోరా? పరిశ్రమలు స్థాపించామని ఘనంగా చెప్పుకుంటున్న మీరు వాటిలో ఎన్ని ప్రారంభమయ్యాయో చెప్పగలరా?’ అని చంద్రబాబును నిలదీశారు. వైఎస్సార్ నా గురువు దివంగత వైఎస్సార్‌ను గురువుగా అభివర్ణించిన శిల్పా మోహన్‌రెడ్డి.. ఆ మహానేత దయవల్లే రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యానని గుర్తుచేశారు. వైఎస్సార్సీపీలో చేరడం సొంతింటికి తిరిగొచ్చినట్లుందని అన్నారు. వైఎస్ కుటుంబానికి అండగా ఉండాలని బలంగా నిర్ణయించుకున్నట్లు తెలిపారు. నంద్యాల టికెట్ విషయంలో జగన్ నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్నారు. ప్రస్తుతం టీడీపీలో ఎమ్మెల్సీగా ఉన్న తన సోదరుడు శిల్పా చక్రపాణిరెడ్డితో విబేధాలు లేవని, పార్టీలు వేరైనా కుటుంబ వ్యవహారాల్లో తేడాలు రావని స్పష్టం చేశారు. -
హైదరాబాద్‌కు బయల్దేరిన శిల్పా
– నేడు ఉదయం 10.30గంటలకు వైఎస్సార్సీపీలో చేరిక నంద్యాల: మాజీ మంత్రి, టీడీపీ ఇన్చార్జ్ శిల్పామోహన్‌రెడ్డి బుధవారం వైఎస్సార్సీపీలో చేరనున్నారు. హైదరాబాద్‌లోని లోటస్ పాండ్‌లో పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి సమక్షంలో ఉదయం 10 గంటలకు పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. నంద్యాల మునిసిపల్ చైర్పర్సన్ దేశం సులోచన, మార్క్‌ఫెడ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పీపీనాగిరెడ్డి, పార్టీ నేతలు గోస్పాడు ప్రహ్లాదరెడ్డి, శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి, జగదీశ్వరరెడ్డి, ఆదిరెడ్డితో సహా కౌన్సిలర్లు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌లతో కలిసి భారీ ఎత్తున శిల్పామోహన్‌రెడ్డి మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు ఇంటి నుంచి హైదరాబాద్‌కు బయల్దేరారు. దాదాపు 150కి పైగా వాహనాల్లో నంద్యాల, గోస్పాడు నుంచి 2 వేల మంది కార్యకర్తలు వారి వెంట కదిలారు. కార్యకర్తల్లో ఆనందోత్సవం శిల్పా వైఎస్సార్సీపీలో చేరుతున్నట్లు ప్రకటించడంతో పార్టీ నేతలు, కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కొంత మంది ఆయన ఇంటి వద్ద బాణ సంచా పేల్చారు. ఇంటిపై ఉన్న టీడీపీ జెండాలను తొలగించి వైఎస్సార్సీపీ జెండాను కట్టారు. పార్టీ కార్యకర్తలు ప్రతి వార్డు నుంచి వచ్చి శిల్పాకు పూలమాలలు వేసి అభినందించారు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారని, ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని, తామంతా అండగా ఉంటామని చెప్పారు. -
టీడీపీలో స్వార్థ రాజకీయాలు
14న వైఎస్ఆర్సీపీలో చేరతా - చంద్రబాబు ధోరణి మనస్తాపం కలిగించింది - వేధింపులకు గురిచేస్తున్న మంత్రి అఖిలప్రియ - పార్టీ మారేందుకు నాయకులు, కార్యకర్తల ఏకాభిప్రాయం - మాజీ మంత్రి, టీడీపీ నంద్యాల నియోజకవర్గ ఇన్చార్జి శిల్పా మోహన్‌రెడ్డి నంద్యాల: టీడీపీలో స్వార్థ రాజకీయం సాగుతోందని మాజీ మంత్రి, టీడీపీ నంద్యాల నియోజకవర్గ ఇన్చార్జి శిల్పా మోహన్‌రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నాన్చుడు ధోరణి, మంత్రి అఖిలప్రియ వేధింపులు మితిమీరడం వల్లే తాను పార్టీ మారేందుకు నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా సోమవారం ఆయన శిల్పా సేవా సమితి కార్యాలయంలో పార్టీ నేతలు, కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ఎన్నికల్లో స్వల్ప మెజార్టీతో ఓటమి పాలయ్యానని.. అయితే తనపై గెలిచిన భూమా నాగిరెడ్డిని పార్టీలో చేర్చుకున్నారన్నారు. అయినప్పటికీ తాను సర్దుకుపోయినా భూమా నుండి తీవ్ర వ్యతిరేకతలను ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు. ఆయన మరణానంతరం కుమార్తె అఖిలప్రియకు మంత్రి పదవిని కట్టబెట్టారని, తన తమ్ముడు శిల్పా చక్రపాణిరెడ్డికి శాసనమండలి చైర్మన్ పదవిని ఇస్తానన్న ముఖ్యమంత్రి ఇప్పటికీ నాన్చుడు ధోరణి అవలంబిస్తున్నారన్నారు. అఖిలప్రియ చైర్పర్సన్ దేశం సులోచనను, కౌన్సిలర్లను, సొంత పార్టీ నేతలతో పాటు కార్యకర్తలను కూడా ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శిల్పా వర్గానికి పనులు చేయవద్దని అధికారులను ఆదేశించారన్నారు. తన వర్గంలోని మున్సిపల్ చైర్పర్సన్ దేశం సులోచన, మార్క్‌ఫెడ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పీపీ నాగిరెడ్డి, గోస్పాడు జెడ్పీటీసీ సభ్యుడు ప్రహ్లాదరెడ్డిలను ఎలాంటి కార్యక్రమాలకు కూడా ఆహ్వానించడం లేదన్నారు. నవ నిర్మాణ దీక్షలకు మంత్రి కాల్వ శ్రీనివాసులు హాజరు కాగా.. తనకు కనీస ఆహ్వానం కూడా పంపలేదన్నారు. ఈ విషయాలను ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసినా కనీస స్పందన కరువైందన్నారు. ఆ ముగ్గురూ టార్గెట్ చేశారు.. మంత్రి అఖిలప్రియ, మాజీ మంత్రి ఫరూక్, ఎంపీ ఎస్పీవై రెడ్డి తనను టార్గెట్ చేశారని శిల్పా తెలిపారు. తనకు ఉప ఎన్నికల్లో టికెట్ ఇస్తే మూకుమ్మడిగా ఓడిస్తామని చెప్పినా తాను మౌనం వహించానే కానీ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదన్నారు. అయితే పార్టీ నేతలు, కార్యకర్తలను వేధింపులకు గురి చేస్తుంటే మౌనం వీడక తప్పలేదన్నారు. రేపు వైఎస్సార్సీపీలో చేరిక పార్టీ నేతలు, కార్యకర్తలందరూ వైఎస్సార్సీపీలో చేరేందుకు ఏకాభిప్రాయం తెలిపారన్నారు. ఆ మేరకు ఈనెల 14వ తేదీ ఉదయం 10.30గంటలకు హైదరాబాద్‌లోని లోటస్ పాండ్ నివాసంలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డి సమక్షంలో తనతో పాటు చైర్పర్సన్ దేశం సులోచన, మార్క్‌ఫెడ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పీపీ నాగిరెడ్డి, కౌన్సిలర్లు, సర్పంచ్‌లు, పెద్ద ఎత్తున అభిమానులు పార్టీలో చేరనున్నట్లు చెప్పారు. వీరంతా మంగళవారం మధ్యాహ్నం నుండి హైదరాబాద్‌కు బయలుదేరడానికి సిద్ధం కావాలన్నారు. నేటి నుండి వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలమయ్యామని శిల్పా చెప్పడంతో వైఎస్సార్సీపీ జిందాబాద్, జగన్ జిందాబాద్ అంటూ నినాదాలు మిన్నంటాయి. కార్యక్రమంలో చైర్పర్సన్ దేశం సులోచన, మార్క్‌ఫెడ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పీపీనాగిరెడ్డి, గోస్పాడు జెడ్పీటీసీ సభ్యుడు ప్రహ్లాదరెడ్డి, 25 మంది కౌన్సిలర్లు పాల్గొన్నారు. -
చంద్రబాబు వద్దకు నంద్యాల టీడీపీ పంచాయితీ
విజయవాడ: కర్నూలు జిల్లా నంద్యాల టీడీపీ పంచాయతీ మరోసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వద్దకు చేరింది. నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి, మాజీ మంత్రి, నంద్యాల టీడీపీ ఇన్చార్జి శిల్పామోహన్‌రెడ్డి సోదరులు మంగళవారం చంద్రబాబుతో సీఎం క్యాంప్ కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరువురు తమ వాదనలు వినిపించారు. వైఎస్ఆర్ సీపీ తరపున ఎమ్మెల్యేలుగా గెలిచిన భూమా నాగిరెడ్డి, అఖిల ప్రియ ఇటీవల టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే. అయితే శిల్పా సోదరులకు, భూమాకు సయోధ్య కుదరలేదు. భూమా నాగిరెడ్డి పార్టీలో చేరినప్పటి నుంచి ఇరువర్గాల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. భూమా అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని, అంతేకాకుండా తమ అనుచరులపై దాడులు చేయిస్తున్నారని శిల్పా సోదరులు ఫిర్యాదు చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య రాజీ కుదిర్చేందుకు భూమా నాగిరెడ్డితో పాటు శిల్పా సోదరులను చంద్రబాబు పిలిపించారు. నిన్న కూడా ఇరువర్గాలు విడివిడిగా చంద్రబాబుతో భేటీ అయిన విషయం విదితమే. -
భూమా నాగిరెడ్డి దాడులు చేయిస్తున్నారు
విజయవాడ: నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి తమ అనుచరులపై దాడులు చేయిస్తున్నారని మాజీ మంత్రి, నంద్యాల టీడీపీ ఇన్చార్జి శిల్పామోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఫిర్యాదు చేశారు. తాము మొదటినుంచి పార్టీ కోసం పనిచేస్తున్నామని, తమకు తగిన ప్రాధాన్యమివ్వాలని శిల్పామోహన్ రెడ్డి సోదరులు చంద్రబాబును కోరారు. సోమవారం విజయవాడ క్యాంప్ ఆఫీసులో శిల్పామోహన్ రెడ్డి సోదరులు.. భూమా నాగిరెడ్డి, ఆయన కుమార్తె, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిల ప్రియ వేర్వేరుగా ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. వైఎస్ఆర్ సీపీ తరపున ఎమ్మెల్యేలుగా గెలిచిన భూమా నాగిరెడ్డి, అఖిల ప్రియ ఇటీవల టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే. అయితే శిల్పా సోదరులకు, భూమాకు సయోధ్య కుదరలేదు. విభేదాలతో ఇరు వర్గాలు పరస్పరం చంద్రబాబుకు ఫిర్యాదు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఇరువర్గాలను పిలిచి రాజీచేసేందుకు ప్రయత్నించారు. ఇరు వర్గాల వాదనలు విని, కలసి పనిచేయాలని వారికి సూచించారు. -
భూమా X శిల్పా
► నేడు చంద్రబాబు వద్ద పంచాయితీ ► విజయవాడకు తరలి వెళ్లిన నేతలు నంద్యాల: కర్నూలు టీడీపీలో శిల్పా సోదరులు, ఇటీవలే పార్టీలో చేరిన భూమా నాగిరెడ్డి మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇందుకు సంబంధించి ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి, మాజీ మంత్రి, టీడీపీ ఇన్చార్జి శిల్పామోహన్‌రెడ్డి మధ్య పంచాయితీ సోమవారం సీఎం చంద్రబాబు కోర్టులో జరగనుంది. ఇందుకోసం వీరిద్దరితో పాటు మాజీ మంత్రి ఫరూక్, పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ చక్రపాణిరెడ్డి కూడా ఆదివారమే విజయవాడకు బయలుదేరి వెళ్లారు. ఆధిపత్యం విషయంలో ఇరువర్గాల వారు పట్టుదలగా ఉండటంతో సయోధ్య కుదిరే అవకాశం లేదని తెలుస్తోంది. సీఎం కూడా సర్ధుకుపోవాలని సూచించి పంపే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఇరు వర్గాలు చంద్రబాబుకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. -
కార్యకర్తలను ఇబ్బంది పెడితే ఊరుకోం
నంద్యాల టౌన్: ‘పార్టీలోకి కొత్తగా వచ్చిన వారు కార్యకర్తలను అనగదొక్కడానికి యత్నించినా, ఇబ్బందులు పెట్టినా చూస్తూ ఊరుకోబోమ’ని మాజీ మంత్రి, టీడీపీ నంద్యాల నియోజకవర్గ ఇన్చార్జ్ శిల్పామోహన్‌రెడ్డి హెచ్చరించారు. స్థానిక టెక్కె మార్కెట్ యార్డులో ఆయన శనివా రం పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత పదేళ్లలో ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేసినా కొత్త నాయకులు విమర్శలు చేయడం తగదన్నారు. నియోజకవర్గానికి తానే ఇన్చార్జిగా ఉంటానని, ఎమ్మెల్యేగా భూమానాగిరెడ్డికి ప్రొటోకాల్ మాత్రమే ఉంటుందన్నారు. సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ దేశం సులోచన, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ పురుషోత్తమరెడ్డి, పార్టీ లీగల్ సెల్ జిల్లా కార్యదర్శి తులసిరెడ్డి, రాష్ట్ర మార్క్‌ఫెడ్ ఉపాధ్యక్షుడు పీపీనాగిరెడ్డి, ఆర్జీఎం విద్యాసంస్థల అధినేత శాంతిరాముడు, కాపు కార్పొరేషన్ డెరైక్టర్ రామచంద్రారావు తదితరులు పాల్గొన్నారు.