- నంద్యాల అభివృద్ధి బాధ్యత నాదే
- ఉప ఎన్నిక ప్రచారంలో వైఎస్సార్‌సీపీ అధినేత
నంద్యాల: ‘పులివెందులను ఏ విధంగా అభివృద్ధి చెయ్యాలనుకున్నానో, నంద్యాలను కూడా అలానే చేస్తా. నంద్యాల అభివృద్ధి గురించి ఎవరూ భయపడకండి. మీరు న్యాయానికి ఓటేయండి.. నంద్యాల అభివృద్ధి బాధ్యత నాకొదిలేయండి’ అని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అన్నారు. నంద్యాల ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా శుక్రవారం(10వ రోజు) పట్టణంలోని సాయిబాబానగర్‌లో ఆయన పర్యటించారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా మూడున్నరేళ్ల చంద్రబాబు దుర్మార్గ పాలనను గుర్తుచేశారు.
‘రైతులకు 86 వేల కోట్ల రుణం మాఫీ చేస్తానని రైతులను, 14 వేల కోట్ల డ్వాక్రా రుణాలు మాఫీచేస్తానని మహిళలను, జాబు ఇస్తానని నిరుద్యోగులను మోసం చేసిన చంద్రబాబు.. ఆఖరికి పసిపిల్లల జీవితాలతో కూడా ఆటలాడుకుంటున్నారు. ఏడాదిలోపు మూగ,చెవిటి పిల్లలకు మాత్రమే ఆపరేషన్లు చేస్తామంటున్నారు. అప్పటికి వారు లోపంతో బాధపడుతున్నారని గుర్తించడమే కష్టం! క్యాన్సర్ పేషెంట్లకు నెలకు 7,8సార్లు కీమోథెరపీ అవసరంకాగా, 2 దఫాలకు మాత్రమే డబ్బులు ఇస్తామంటున్నారు. కిడ్నీ రోగుల డయాలసిస్ కోసం వెళితే.. సంవత్సరం తర్వాత రమ్మంటున్నారు. 108కి ఫోన్‌చేస్తే డీజిల్ లేదనో, జీతాల కోసం డ్రైవర్లు సమ్మె చేస్తున్నారనో సమాధానం వస్తుంది. బెల్టు షాపులు లేకుండా చేస్తామన్నారు.. ఇప్పుడేమో మద్యం హోండెలివరీ ఇస్తామంటున్నారు. ఇదీ.. మూడేళ్ల పాలనలో చంద్రబాబు సాధించిన ఘనకీర్తి’ అని వైఎస్ జగన్ అన్నారు.
నంద్యాల అభివృద్ధి నా బాధ్యత: గడిచిన మూడున్నరేళ్లలో సీఎం చంద్రబాబుకానీ, ఆయన మంత్రులుకానీ ఒక్కటంటే ఒక్కసారైనా నంద్యాలకు రాలేదని, ఇప్పుడు ఉప ఎన్నిక వచ్చేసరికి వాళ్లకు ప్రజలు గుర్తొచ్చారని వైఎస్ జగన్ ఎద్దేవా చేశారు. ‘నంద్యాలలో మీరు వేసే ఓటు.. చంద్రబాబు దుర్మార్గ పాలకు చెంపపెట్టులాంటిది. న్యాయానికి, ధర్మానికి ఓటు వేయండి. నంద్యాల అభివృద్ధి విషయంలో ఎలాంటి భయాలొద్దు. ఆ బాధ్యత నాది’ అని జగన్ హామీ ఇచ్చారు.
దెయ్యాలు వస్తాయ్.. ప్రమాణాలు చేయిస్తాయ్..: మూడున్నరేళ్లపాటు ప్రజాధనాన్ని కొల్లగొట్టిన చంద్రబాబు.. ఆ డబ్బుతో ఎమ్మెల్యేలను కొన్నారని, ఇప్పుడు ప్రజలను కూడా కొనాలనుకుంటున్నారని వైఎస్ జగన్ విమర్శించారు. ‘నంద్యాలకు దెయ్యాలు వస్తాయి.. ఒక్కో ఓటరు చేతిలో రూ.5వేల పెట్టి, ప్రమాణాలు చేయిస్తాయి. మీరంతా జాగ్రత్తగా ఉండాలి. ధర్మానికి ఓటేసి దెయ్యాలని పారద్రోలాలి’ అని జగన్ అన్నారు.